సుంకంపై సమరం
పాతబస్తీలోని బంగారు వ్యాపారులు కదం తొక్కారు. బంగారంపై ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా శనివారం సాయంత్రం చార్‌కమాన్ గుల్జార్‌హౌస్‌వద్ద భారీ స్థాయిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
కదం తొక్కిన బంగారు వ్యాపారులు
చార్మినార్: అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య పిలుపు మేరకు పాతబస్తీలోని బంగారు వ్యాపారులు రెండో రోజైన శనివారం చార్‌కమాన్ వద్ద నిరాహార దీక్షలు కొనసాగించారు. చార్‌కమాన్ జ్యువె ల్లర్స్ అండ్ సరాఫా అసోసియేషన్, సిద్దంబర్‌బజార్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్స్, కాలికమాన్ చార్మినార్ జ్యువెల్లర్స్, శాలిబండ జ్యువెల్లర్స్ అసోసియేషన్, కాలికమాన్ చార్‌కమాన్ స్వర్ణకారుల సంఘం, చార్‌కమాన్ బెంగాలీ గోల్డ్‌స్మిత్ సంఘం, చార్‌కమాన్ హైదరాబాద్ జెమ్స్ సంఘ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బడ్జెట్‌లో బంగారంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 11 రోజులుగా తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలుపుతున్నా...కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సుంకాల పెంపును ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఆందోళనలో భాగంగా శనివారం సాయంత్రం చార్‌కమాన్ గుల్జార్‌హౌస్ వద్ద వ్యాపారులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.