‘గోల్డ్’ ట్విస్ట్ ! | Gold twist in malakpet | Sakshi
Sakshi News home page

‘గోల్డ్’ ట్విస్ట్ !

Published Fri, Nov 6 2015 10:16 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

‘గోల్డ్’ ట్విస్ట్ ! - Sakshi

‘గోల్డ్’ ట్విస్ట్ !

మలక్‌పేటలోని ఓ సంస్థలో భారీ స్కామ్ కేసు....
వివిధ ప్రాంతాల నుంచి 12.5 కేజీల బంగారం రికవరీ
అది మాదంటే మాదంటూ కోర్టుకెక్కిన బాధితులు

 
హైదరాబాద్: పోలీసులు రికవరీ చేసిన బంగారం మాదంటే.. మాదంటూ బాధితులు సీసీఎస్ అధికారులను ఆశ్రయించారు... ఆ బంగారాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక అధికారులు చేతులెత్తేశారు. దీంతో రికవరీ చేసిన పసిడిని తమకు అప్పగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కొందరు నాంపల్లి కోర్టును, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.
 
‘ఇంటి దొంగల’తోనే అసలు స్కామ్...  
మలక్‌పేటలో ఉన్న బంగారం తాకట్టు పెట్టుకునే ఓ  సంస్థలో ‘ఇంటి దొంగలు’ భారీ స్కామ్‌కు తెరలేపారు. బంగారు ఆభరణాలపై అప్పులు ఇచ్చే ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులే ముఠాగా ఏర్పడి గోల్‌మాల్ చేశారు. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల్ని నిర్వాహకులు వస్త్రం/కాగితంతో చేసిన చిన్న సంచుల్లో ప్యాక్ చేసి, వాటిపై తాకట్టు పెట్టిన వారు, బంగారం వివరాలు రాసిన స్లిప్పులతో లాకర్లలో భద్రపరుస్తారు. ఇలా లాకర్లలో ఉన్న ఆభరణాలను బయటకు తీసిన ‘ఇంటి దొంగలు’ ఆ ప్యాకెట్లను టాబ్లెట్లు నింపారు.
 
నగలు వేరే చోట తాకట్టు...
మలక్‌పేటలోని సంస్థ నుంచి కాజేసిన నగలను ‘ఇంటి దొంగలు’ వేర్వేరు ప్రాంతాల్లో తాకట్టు పెట్టడంతో పాటు విక్రయించారు. నగలను ఎక్కడైనా తాకట్టు పెట్టడానికి వ్యక్తిగత, నివాస గుర్తింపులు అవసరం. దీని కోసం తమకు పరిచయస్తుల నుంచి వాటిని సేకరించి ‘పని’ పూర్తి చేశారు.

ఎట్టకేలకు తమ సంస్థలో జరుగుతున్న స్కామ్‌ను గుర్తించిన మలక్‌పేటలోని సంస్థ యాజమాన్యం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అప్పటి ఏసీపీ రామారావు నిందితుల్ని అరెస్టు చేయడంతో పాటు రెండు జ్యువెలరీ షాపులు,  మరికొన్ని ప్రాంతాల నుంచి 12.5 కేజీల బంగారం రికవరీ చేశారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలతో నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు.
 
బంగారం కోసం ‘పోటాపోటీ’...
ఇక్కడి వరకు కథ సజావుగానే సాగినా... రికవరీ బంగారం దగ్గరే చిక్కు వచ్చింది. ఆ 12.5 కేజీల బంగారం తమ సంస్థకు చెందినదని, కొందరు చేసిన స్కామ్ వల్లే బయటకు వెళ్లిందంటూ మలక్‌పేట  సంస్థ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. రికవరీ చేసిన బంగారాన్ని సేఫ్ కస్టడీ నిమిత్తం తమకు అప్పగించాలని కోరింది.

‘ఇంటి దొంగలు’ కొందరి గుర్తింపు పత్రాలనైతే సేకరించి, వేర్వేరు చోట్ల ఈ బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఆ గుర్తింపు పత్రాలు ఇచ్చిన వారిలో కొందరు బంగారం మాదేనంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు బంగారంలో కొంత రికవరీ అయిన రెండు జ్యువెలరీ దుకాణాలూ అది తమకు చెందిన పసిడేనంటూ కోర్టుకెక్కాయి.
 
హైకోర్టుకు చేరిన వివాదం..

సాధారణంగా నేరగాళ్ల నుంచి పోలీసులు రికవరీ చేసిన సొత్తును తమకు అప్పగించాల్సిందిగా కోరుతూ బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సేఫ్ కస్టడీ నిమిత్తం వారికే ఇస్తుంది. అయితే ఈ కేసులో మాత్రం ఒకే బంగారాన్ని పలువురు తమదంటే తమదని పోటీపడుతుండటంతో నాంపల్లి కోర్టు ఎవరికీ ఇచ్చేందుకు అంగీకరించలేదు. వివాదం తేలే వరకు ఎవరికీ అప్పగించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది. బంగారం విషయంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీసీఎస్ అధికారులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement