రాయదుర్గం: విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నగరం చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో 5 నుంచి 10 గోల్ఫ్ కోర్సుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు వెల్లడించారు. గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్సార్ నిథమ్‌లో మంగళవారం జాతీయ స్థాయి సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరం చుట్టూ ఉన్న శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, నర్సాపూర్, సదాశివపేట్, కీసర వంటి ప్రాంతాలలో ఈ గోల్ఫ్ కోర్సులను 200 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
నగరం నుంచి 50 కిలోమీటర్ల లోపు, ఔటర్ రింగురోడ్డు నుంచి అరగంటలో వెళ్లే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారన్నారు. స్థలం ఉన్న వారు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే అనుమతి ఇస్తామని, లేకుంటే లీజుకు ఇచ్చినా టీఎస్‌టీడీసీ ఏర్పాటు చేస్తుందన్నారు.
హైదరాబాద్‌లోని గోల్ప్ కోర్సు 130 ఎకరాల్లో ఉందని, అంతర్జాతీయ ఆటగాడు టైగర్‌వుడ్ లాంటి వారు ఆడేందుకు ఆసక్తి కనబరుస్తారని అందుకే ఈ నిర్ణయిం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి కేంద్రం రూ. 90 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు. భువనగిరి కోట అభివృద్ధికి రూ. 4.8 కోట్ల కేంద్ర నిధులతో పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఎస్‌టీడీసీ మేనేజింగ్ డెరైక్టర్, నిథమ్ డెరైక్టర్ డాక్టర్ కిష్ట్రినా చోంగ్తూ పాల్గొన్నారు.