పోలీసుల ఆధీనంలో గోల్కొండ
హైదరాబాద్: రానున్న స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ జెండా ఎగురవేసే గోల్కొండ కోటను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) కదలికలపై సమాచారం ఉన్న కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు రాష్ట్రాన్ని అప్రమత్తం చేశాయి.
అదే విధంగా అమెరికా నిఘా సంస్థలు కూడా భారత్‌పై ఐఎస్‌ఐఎస్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉన్న గోల్కొండ కోటపై ఆగస్టు 15న జాతీయ జెండా ఎగుర వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఫిర్యాదుకు అనుమతి లభించింది. దీంతో పోలీసులు కోట ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసులు, రాష్ట్ర నిఘా వర్గాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.