గాంధీ ఆస్పత్రిలో గవర్నర్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి పనిచేస్తున్న తీరుపట్ల రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ పేషెంట్ వార్డులో సౌకర్యాల లేమి ఉందని, ఎందుకు రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఉదయం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఆయన ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, అత్యవసర వార్డులో కలియతిరిగి అక్కడ రోగులకు అందుతున్న చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ కేవీ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సౌకర్యాలు లేమి గురించి మంత్రి లక్ష్మారెడ్డితో గవర్నర్ ఫోన్లో మాట్లాడారు. భవిష్యత్ లో కూడా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని ఆస్పత్రి సిబ్బందికి చెప్పారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.