మైనారిటీలపై ప్రభుత్వం చిన్నచూపు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, ముస్తాఫా, అంజాద్ ధ్వజం
సాక్షి,హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, మహ్మద్ ముస్తాఫా షేక్, కొరముట్ల శ్రీనివాసులు, ఎస్వీ మోహన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లిం మైనారిటీలకు ముష్టి వేసినట్లు రూ.250 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి మైనారిటీ సమస్యలపై చర్చించే దమ్ము కూడా లేదన్నారు.
కనీసం చట్టసభలో మైనారిటీ సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ‘‘రెండేళ్ల కిందట బడ్జెట్‌లో రూ.246 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2015-16 బడ్జెట్‌లో రూ.376 కోట్లు మైనారిటీల సంక్షేమానికి కేటాయించి, బడ్జెట్ నివేదికలో మాత్రం రూ. 216 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి రూ.165 కోట్లు మాత్రమే వ్యయం చేశారు’’ అని పేర్కొన్నారు. మైనారిటీల హాస్టళ్లకు రూ. 3.35 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
చాలా మంచి మైనార్టీ బడ్జెట్: మంత్రి పల్లె
దక్షిణ భారతదేశంలోనే చాలా మంచి మైనార్టీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని మైనారిటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. లోటు బడ్జెట్ రాష్ట్రమైనప్పటికీ మైనారిటీల మీద అభిమానంతో ఎక్కువ బడ్జెట్ కేటాయించామన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి పల్లె మాట్లాడారు.