
'తలసాని వ్యవహారంలో చర్యలు తీసుకుంటా'
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో చర్యలు తీసుకుంటానని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, తలసాని మంత్రి పదవి రెండు అంశాలు ఉన్నాయన్నారు. అయితే ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని గవర్నర్ వారికి వివరించారు. టీటీడీపీ నేతలు తలసాని, ఇతర ఎమ్మెల్యేల వ్యవహారం అంశాలపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ ను కలిశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్పై వెంటనే చర్యలు తీసుకుని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని టీటీడీపీ నేతలు గవర్నర్ నరసింహిన్ ను కోరారు. టీటీడీపీ నేతలు తలసాని వ్యవహారంపై ఫిర్యాదుచేయడానికి గవర్నర్ వద్దకు వెళ్లారు. తన పదవికి రాజీనామా చేశానని తలసాని చెబుతున్నారని, రాజీనామా తమ వద్దకు రాలేదని అసెంబ్లీ కార్యదర్శి స్పష్టంచేశారని వారు గవర్నర్ కు వివరించారు. అబద్దాలు చెప్పి మిమ్మల్ని కూడా తప్పుదోవ పట్టించి తలసాని మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని పేర్కొన్నారు. పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని గవర్నర్ను కోరినట్లు టీడీపీ నేతల బృందం తెలిపింది.