విందు.. పసందు!
♦ రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ విందు
♦ హాజరైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు
♦ పావుగంటపాటు ఏకాంతంగా కబుర్లు చెప్పుకున్న కేసీఆర్, చంద్రబాబు
♦ కలియ తిరుగుతూ అతిథులను ఆహ్వానించిన గవర్నర్ దంపతులు
♦ నోరూరించిన సంప్రదాయ వంటకాలు
సాక్షి, హైదరాబాద్: చల్లటి సాయంత్రం.. ఆహ్లాదకర వాతావరణం.. హుస్సేన్‌సాగరం మీదుగా పిల్లగాలులు.. వినీవినిపించనట్టు వినసొంపైన సంగీతం.. చారిత్రక భవనానికి కొత్త శోభను అద్దుతూ విద్యుత్ కాంతుల ధగధగలు... పసందైన సంప్రదాయ వంటకాల ఘుమఘుమలు.. అతిరథమహారథుల పలకరింపులు.. ముసిముసి నవ్వులు.. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కనిపించిన ఆహ్లాద దృశ్య సమాహారం ఇదీ! శీతాకాల విడిదిలో భాగంగా భాగ్యనగరంలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు పరస్పర పలకరింపులు, ఆప్యాయంగా ముచ్చట్లు, రాష్ట్రపతితో సంభాషణలు, గవర్నర్ దంపతులు ఎదురేగి చెప్పే స్వాగత వచనాలు, కొసరికొసరి వడ్డింపులు సాగాయి.
అతిరథుల రాక..
సాయంత్రం ఆరున్నరకు రాజ్‌భవన్ ప్రాంగణంలోకి ప్రముఖుల రాక మొదలైంది. సుందరంగా ముస్తాబైన రాజ్‌భవన్ పచ్చికలో కుర్చీలు వేసి అతిథుల ఆగమనానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. నలుపు రంగు సంప్రదాయ నెహ్రూ కోటు, ప్యాంటుతో గవర్నర్ నరసింహన్, ముదురు నారింజ రంగు చీరతో విమలా నరసింహన్ అక్కడికి చేరుకున్నారు. 120 మంది ప్రముఖులను వారు ఆహ్వానించారు. వచ్చినవారికి ఎదురేగి స్వాగతం పలుకుతూ లోనికి తీసుకెళ్లారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సీఎం చంద్రశేఖరరావు సతీసమేతంగా వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు.
హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ బొసాలే, కేంద్ర మంత్రులు అశోక్‌గజపతి రాజు, బండారు దత్తాత్రేయ, ఇరు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు మధుసూధనాచారి, కోడెల శివప్రసాద్, మండలి చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ మంత్రులు నాయిని నరసింహారెడ్డి, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాసరావు, నారాయణ, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, చిరంజీవి, రామచంద్రయ్య, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ వచ్చారు.
అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డాక్టర్ జీఎన్ రావు, బీవీఆర్ మోహన్‌రెడ్డి, డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ప్రొఫెసర్ శాంతాసిన్హా, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీలు అనురాగ్‌శర్మ, జేవీ రాముడు, కె.పద్మనాభయ్య, ఏపీవీఎన్ శర్మ, ఏకే మొహంతి, ఘంటా చక్రపాణి, డాక్టర్ గోపీచంద్, వకులాభరణం రామకృష్ణ, వి.నాగిరెడ్డి, నగర, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, బి.వి.పాపారావు, బి.జి.సిద్ధార్థ, డాక్టర్ మంజులత, తోట వైకుంటం, బి.నర్సింగరావు తదితరులు విందులో పాల్గొన్నారు.
ఇద్దరు సీఎంల కబుర్లు
విందులో తొలుత సీఎం కేసీఆర్.. చంద్రబాబు వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించగా ఆయన కూడా చిరునవ్వుతో కులాసాగా మాట్లాడారు. వారి వెంట వచ్చిన మంత్రులు కాసేపు మాట్లాడుకున్నాక.. ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కకు వెళ్లి పావుగంటపాటు ఏకాంతంగా కబుర్లు చెప్పుకున్నారు. అయుత చండీయాగం సహా రెండు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై వారు మాట్లాడుకున్నట్టు సమాచారం. కాగా, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానని ముందుగానే గవర్నర్‌కు నివేదించినట్లు తెలిసింది. జగన్‌మోహన్‌రెడ్డిని గవర్నర్ ఆహ్వానించిన సందర్భంలో విందు రోజు నాటికి తాను హైదరాబాద్‌కు దూరంగా ఉండే అవకాశం ఉన్నందున హాజరు కాలేనని గవర్నర్ అనుమతి తీసుకున్నట్లు సమాచారం.
నోరూరించిన ఘుమఘుమలు
అతిథుల కోసం ప్రత్యేకంగా వ డ్డించిన వంటకాలతో రాజ్‌భవన్ లాన్ ప్రాంతం ఘుమఘుమలాడిపోయింది. ఐటీసీ కాకతీయ హోటల్ వంటకాలు అతిథుల నోరూరించాయి. తొలుత సూప్‌గా షోర్బా ఈ ఖుష్‌నుమా వడ్డించారు. తర్వాత స్టార్టర్లుగా రసం వడ, వివిధ పప్పుదినుసుల మిశ్రమంతో చేసే తమిళ సంప్రదాయ దోశ పరుప్పు అడైని వడ్డించారు. తర్వాత టర్కిష్ ఈ పనీర్, ఉర్లయ్ రోస్ట్ (బంగాళాదుంప వేపుడు), కాలీఫ్లవర్ మసాలా డిష్ బ్రకొలీ ముస్సలమ్, గంగవాయిలి-మామిడికాయ పప్పు, పరాటా, నాన్, రోగినీ రోటీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ, సఫేద్ మిర్చీ కా సాలన్, బుర్హానీ రైతా, గులాబ్ కీ ఖీర్, జాఫ్రానీ దఖానీ షీరీన్, స్ట్రాబెరీ, వైట్ చాకోలేట్ పేస్ట్రీలను వడ్డించారు.