ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి,సిటీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి ఘనంగా జరిగింది. మంగళవారం నగరంలోని సిటీ సెంటర్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించారు. పలుచోట్ల నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం, ఐటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, పేదలకు దుపట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.
పలువురు నగర నేతలు వైఎస్సార్ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. దాదాపు 70 మంది రక్తాన్ని దానం చేశారు. అనంతరం వైఎస్సార్ యువజన విభాగం రాష్ట్ర నేత పుత్తా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నగరానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఐటీ, వైద్య విభాగం నేతలు చల్లా మధుసూదన్ రెడ్డి, గోసుల శివభారత్ రెడ్డి , కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నగర నాయకులు వెల్లాల రామ్మోహన్, సూర్యనారాయణ రెడ్డి, కోటం రెడ్డి వినయ్ రెడ్డి, భువనగిరి శ్రీకాంత్, నీలం రాజు, బి.మోహన్ కుమార్, వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం స్వచ్ఛంద సేవకురాలు కేవీఎస్ పద్మజ, యువజ విభాగం స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు పి. మదన్‌మోహన్ రెడ్డి, నీలం రాజు మహిళా నేత కె.జ్యోతి రెడ్డి, జార్జ్, కలిఫా, శ్రీకాంత్‌లాల్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరురాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు కూడా నివాళులర్పించారు.