బంజారాహిల్స్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ క్యాంపు ఆఫీస్ కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు స్థలాన్వేషణ చేపట్టారు. రాజ్‌భవన్ పక్కన ఉన్న దిల్ కుషా గెస్ట్‌హౌస్, గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్‌ను శనివారం మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సెంట్రల్ జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పరిశీలించారు. దిల్‌కుషా గెస్ట్‌హౌస్ వైపు మేయర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒకదాన్ని రెండు రోజుల్లో ఎంపిక చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు.
మేయర్ కోసం క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. మేయర్‌ను కలవడానికి వచ్చేవారు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుసుకున్నఅధికారులు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తేవాలని యోచించి... గెస్ట్‌హౌస్‌లను పరిశీలించారు.
గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ ముందు జరుగుతున్న మెట్రో పనుల వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులతో పాటు మేయర్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం గెస్ట్‌హౌస్‌ను క్యాంపు ఆఫీస్ కోసం తీసుకోవాలా? కొన్ని గదులు మాత్రమే సరిపోతాయా అన్న దానిపై కూడా ఓ నిర్ణయానికి రాలేదు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుంది.
దిల్‌కుషా... మేయర్ క్యాంపు ఆఫీస్?
Published Sun, Feb 14 2016 4:43 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM
Advertisement