గ్రేటర్ ‘ప్రత్యేకం’
‘అదనం’గా ముగ్గురు ఐఏఎస్‌లు
జీహెచ్‌ఎంసీలో నియామకం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కు కొత్తగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు వస్తున్నారు. ఎ.బాబు, పీఎస్ ప్రద్యుమ్న, డాక్టర్ ఎన్.సత్యనారాయణలను జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీలో స్పెషల్ కమిషనర్‌గా ఉన్న రాహుల్ బొజ్జాను గిరిజన సంక్షేమ శాఖ డెరైక్టర్‌గా బదిలీ చేసింది. 625 చ.కి.మీ.ల విస్తీర్ణంతో ఉన్న జీహెచ్‌ఎంసీలో ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంటు న్నాయి. ముఖ్యంగా చెత్త తరలింపు, వ్యర్థాల నిర్వహణ, రహదారులు, వరద నీటి కాలువల పనులు నిత్య సమస్యలుగా మారాయి.
జీహెచ్‌ఎంసీలో ఐదు జోన్లు ఉన్నప్పటికీ అన్ని పనులనూ ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న ఐఏఎస్‌లకు జోన్లకు సంబంధించిన పూర్తి బాధ్యతలు, లేదా ఆరోగ్యం-పారిశుద్ధ్యం, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ప్లానింగ్ వంటి విభాగాలు అప్పగిస్తే పరిస్థితులు మెరుగవుతాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం- పారిశుద్ధ్య విభాగానికి ఐఏఎస్ అవసరం ఎంతో ఉంది. రహదారులు, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్, భూసేకరణ తదితర అంశాలు ప్లానింగ్ పరిధిలో ఉంటాయి.
ఎంతో కాలంగా మందకొడిగా సాగుతున్న వరద నీటి కాలువలు, ఫ్లైఓవర్ల పనులకు అవసరమైన భూసేకరణ తదితరమైనవి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ ఉంటే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐదు జోన్లలో ప్రస్తుతం సెంట్రల్, నార్త్‌జోన్‌లలో ఐఏఎస్‌లు ఉన్నారు. మిగతా మూడు జోన్లకు కొత్తగా వచ్చే ముగ్గురు ఐఏఎస్‌లను నియమిస్తారా? లేక ఆరోగ్యం- పారిశుద్ధ్యం వంటి పెద్ద విభాగాల బాధ్యతలు అప్పగిస్తారా? అనేది కమిషనర్ సోమేశ్ కుమార్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. మొత్తమ్మీద ఐఏఎస్‌ల రాకతో జీహెచ్‌ఎంసీ పరిస్థితులు మెరుగు పడతాయని పలువురు భావిస్తున్నారు.