ఆ ‘గుండె’కు దారి చూపిన గుండెలెన్నో | Green corridor in Hyderabad for heart transport | Sakshi
Sakshi News home page

ఆ ‘గుండె’కు దారి చూపిన గుండెలెన్నో

Published Sun, Mar 1 2015 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

ఆ ‘గుండె’కు దారి చూపిన గుండెలెన్నో

ఆ ‘గుండె’కు దారి చూపిన గుండెలెన్నో

బెంగళూరులోని బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి గుండె సేకరణ
ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు
బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి..
2 నిమిషాల 45 సెకన్లలో ప్రయాణం
రోడ్లపై ట్రాఫిక్ పూర్తిగా ఆపి సహకరించిన పోలీసులు
కొత్తగూడేనికి చెందిన రోగికి విజయవంతంగా గుండె మార్పిడి
 
 సాక్షి, హైదరాబాద్:
 ప్రాంతం: బేగంపేట విమానాశ్రయం
 సమయం: శనివారం మధ్యాహ్నం ఒంటిగంట
 నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే అక్కడి ప్రధాన రహదారి ఆ సమయంలో ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. వీవీఐపీలెవరూ ఆ మార్గంలో ప్రయాణించకున్నా కూడళ్ల వద్ద పోలీసుల హడావుడి ఎక్కువైంది.
ఇంతలో సరిగ్గా ఒంటిగంటా 16 నిమిషాలకు ఎయిర్‌పోర్టులోంచి ఓ అంబులెన్సు రయ్‌మంటూ రోడ్డెక్కింది. విమానాశ్రయం నుంచి 7.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశోదా ఆస్పత్రికి కేవలం 2 నిమిషాల 45 సెకన్లలో చేరుకుంది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి తన చేతిలోని ఓ పెట్టెతో పరుగుపరుగున ఆస్పత్రిలోకి వెళ్లిపోయారు.
 
కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న ఓ మహిళకు యశోదా ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ ద్వారా పునర్జన్మ ప్రసాదించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు, పోలీ సులు, వైద్యులు పడిన తపనకు నిదర్శనమిది.
 
 
 గుండె పనితీరు దెబ్బతినడంతో...
 కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన పద్మ(46) ఇటీవల సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలోని ప్రముఖ గుండె మార్పిడి శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ (ఏజీకే) గోఖలేను సంప్రదించారు. ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన గోఖలే...రోగి గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతోపాటు గుండె ఎడమ కవాటం పనిచేయట్లేదని...దీనివల్ల గుండె పనితీరు సామర్థ్యం 20 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు.

 

దీనికితోడు బాధితురాలికి హైబీపీ, మధుమేహం, హైపోథైరాయిడిజమ్ సమస్య ఉండటంతో గుండె మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని ఆమెకు సూచించారు. ‘ఒ’పాజిటివ్ బ్లడ్‌గ్రూప్ కలిగి ఉన్న బాధితురాలు అవయవ దాత కోసం జీవన్‌దాన్ నెట్‌వర్క్‌లో పేరు నమోదు చేసుకొని మూడు నెలల నుంచి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది.
 
 ఇంతలో ఏం జరిగిందంటే...


 బెంగళూరులో బ్రెయిన్‌డెడ్ కేసు నుంచి..
 బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ వద్ద ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన పండిట్ శివరాయ బాజే (30) రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బన్నేరుగట్ట వద్ద ఉన్న ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నాడు. దీంతో అవయవదానం కోసం ఒప్పించిన వైద్యులు ఇందుకోసం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
 
 శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నిమ్స్ జీవన్‌దాన్‌తోపాటు యశోదా ఆస్పత్రికి ఈ మేరకు సమాచారం అందింది. దాత, స్వీకర్తల బ్లడ్‌గ్రూప్, వయసు మ్యాచ్ కావడంతో వెంటనే గుండెను తెచ్చి హృద్రోగి పద్మకు అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. బ్రెయిన్‌డెడ్‌కు గురైన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఆరు గంటల వ్యవధిలోనే రోగికి అమర్చాల్సి ఉండటంతో ఇందుకోసం వైద్యులు ప్రత్యేక విమానంతోపాటు ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జీఎం ఐజీ మూర్తి సహా హైదరాబాద్, బెంగళూరు పోలీసు కమిషనర్ల అనుమతి పొందారు.
 
 
 విక్టోరియా ఆస్పత్రి నుంచి యశోదాకు తరలింపు
 డాక్టర్ గోఖలే నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన వైద్య బృందం శనివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి చేరుకొని పండిట్ బాజే శరీరం నుంచి ఉదయం 11.30 గంటలకల్లా గుండెను సేకరించింది. (అతని శరీరం నుంచి కాలేయం, మూత్రపిండాలు, కార్నియాను కూడా సేకరించి వివిధ ఆస్పత్రులకు అందజేశారు.) ఆ గుండెను ఓ ప్రత్యేక ద్రవాలున్న పెట్టెలో భద్రపరచి ఓ అంబులెన్సులో ‘గ్రీన్ చానల్’ మార్గంలో విక్టోరియా ఆస్పత్రి నుంచి బయలుదేరి కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే 15 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులోని హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.16 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అప్పటికే బేగంపేట విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి మార్గంలో వాహనాల రాకపోకలను నిలువరిస్తూ ‘గ్రీన్ చానల్’ ఏర్పాటు చేశారు. దీంతో అంబులెన్సు కేవలం 2 నిమిషాల 45 సెకన్ల వ్యవధిలోనే యశోదా ఆస్పత్రికి చేరుకుంది. అందులోంచి దిగిన డాక్టర్ గోఖలే...గుండె ఉన్న పెట్టెను ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.
 
 5 గంటల శస్త్రచికిత్స
 అప్పటికే ఆపరేషన్ థియేటర్‌లో రోగితో సహా సిద్ధంగా ఉన్న పలువురు వైద్యులు మధ్యాహ్నం 1.30 గంటలకు గుండెమార్పిడి ఆపరేషన్‌ను ప్రారంభించి సాయంత్రం 6.30 గంటలకు ముగించారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలో జరిగిన ఈ శస్త్రచికిత్సలో సుమారు 15 మంది వైద్యులు పాల్గొ న్నారు. ప్రస్తుతం రోగిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement