ఫుల్లు కిక్కు! | Gudumba sales check | Sakshi
Sakshi News home page

ఫుల్లు కిక్కు!

Published Mon, Aug 31 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

ఫుల్లు కిక్కు!

ఫుల్లు కిక్కు!

గ్రేటర్ పరిధిలో 547కు చేరుకోనున్న బార్లు 
మినీ బ్రూవరీలకు అనుమతులు
అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ విధానం 
గుడుంబా విక్రయాలకు చెక్


సిటీబ్యూరో:విశ్వ నగరంలో స్వచ్ఛమైన మంచినీరు, ట్రాఫిక్ ఇక్కట్లు లేని రహదారుల వంటి మౌలిక వసతుల సంగతేమోగానీ మందుబాబులకు మాత్రం ఫుల్లుగా కిక్కెక్కించేందుకు సర్కారు యథాశక్తి ప్రయత్నిస్తోంది. మహా నగర పరిధిలో ప్రధాన రహదారుల పక్కన వైన్ పార్లర్లు, మినీ బీర్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అంతేకాదు... మాల్స్‌లో బార్లు... స్టార్, టూరిజం హోటళ్లలో ఎప్పుడంటే అప్పుడు మద్యం విక్రయాలకు గేట్లు బార్లా తెరిచింది. ఇటీవల నూతన బార్ లెసైన్సుల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కొత్తగా 38 బార్లు తెరచుకోనున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 509. కొత్తవాటితో కలిపి 547కు చేరుకోనుంది.అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన ఎక్సైజ్ పాలసీలో చౌక మద్యం అమ్మకాలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుండడం గమనార్హం.

 24 గంటలపై త్వరలో స్పష్టత
 నగరంలో 24 గంటల పాటు బార్లను తెరిచే అంశంపై మార్గదర్శకాలు విడుదలైన తరవాతే స్పష్టత రానున్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇప్పటికే స్పెన్సర్స్, ఇనార్బిట్ మాల్, మెట్రో వంటి మాల్స్‌లోనూ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. నూతన విధానంలో ప్రత్యేకంగా మాల్స్‌లో మద్యం విక్రయించేందుకు రంగం సిద్ధమైనట్లు వెల్లడించాయి. విదేశీ టూరిస్టులను విశేషంగా ఆకర్షించేందుకు బార్లు, స్టార్ హోటళ్లు, టూరిజం హోటళ్లలో 24 గంటలూ   వైన్, మద్యం విక్రయానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాయి. అవసరం.. అవకాశాన్ని బట్టి తెల్లవారు ఝాము 3 నుంచి 6 గంటల వరకు స్వల్ప విరామం  ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఐటీ, బల్క్‌డ్రగ్, ఫార్మా, బీపీఓ, కేపీఓ వంటి రంగాలతో పాటు పెట్టుబడులకు అనుకూలంగా నగరాన్ని తీర్చిదిద్దాలనేది సర్కారు యోచన. ఈ తరుణంలో విదేశీ టూరిస్టుల సంఖ్య బాగా పెరుగుతుందని.. వారిని ఆకర్షించేందుకే ఈ కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఎక్సైజ్ వర్గాలు చెబుతుండడం గమనార్హం.

 విక్రయ వే ళల పెంపు?
 ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకేతెరిచేందుకు అనుమతిస్తున్నారు. బార్లకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతిస్తున్నారు. నూతన విధానంలో ఈ వేళలను మరింత పెంచేందుకు అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే లెసైన్సుడు మద్యం దుకాణాలకు ఆనుకొని సిట్టింగ్ రూమ్‌లకు అనుమతించిన విషయం విదితమే. మరోవైపు పేదల ఉసురు తీస్తున్న గుడుంబా స్థానంలో రూ.30కే చౌకమద్యం (చీప్‌లిక్కర్) సైతం ప్రభుత్వ లెసైన్సు పొందిన మద్యం దుకాణాల్లో విక్రయించాలని నిర్ణయించింది.

గుడుంబాకు చెక్
నగరంలోని గుడుంబా అడ్డాలపై ఉక్కుపాదం మోపాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించిన విషయం విదితమే. గుడుంబా విక్రయాలు జరిగితే ఎక్సైజ్ అధికారులతో పాటు, స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్లను బాధ్యులుగా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సర్కారు తాజా నిర్ణయంతో ధూల్‌పేట్, పాతనగరంలోని గుడుంబా అడ్డాలపై ఎక్సైజ్, పోలీసుల దాడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
 
 
దారి పొడవునా...
బీర్ ప్లాంట్లు విరివిగా నెలకొల్పేందుకు వీలుగా మైక్రోబ్రూవరీలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3 లక్షల రుసుముతో లెసైన్స్‌లు మంజూరు చేయాలని యోచిస్తోంది. జీహెచ్‌ఎంసీతో పాటు దానికి  ఆనుకొని ఉన్న ఐదు కిలోమీటర్ల పరిధిలో వీటికి అనుమతించనున్నారు. దీంతో బీర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా ఏర్పాటయ్యే
 అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement