సామూహిక నిమజ్జనం, ప్రధాన ఊరేగింపు నేపథ్యంలో గురువారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు నిర్వాహకులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతి విగ్రహం వద్దా ఉండే సిబ్బంది వీటి అమలును పర్యవేక్షిస్తారు.
- నిమజ్జనం కోసం విగ్రహాలను తరలించే వాహనాలు ఎలాంటి మరమ్మతులకు లోను కానివి అయి ఉండాలి.
- స్థానిక డీసీపీ ఇచ్చిన సీరియల్ నంబర్‌తో కూడిన స్టిక్కర్‌ను వాహనానికి ముందు వైపు స్పష్టంగా కనిపించేలా విధంగా అతికించాలి.
- ఊరేగింపులో వాహనాలను ఎలాంటి లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు.
- ఈ వాహనాల్లో కర్రలు, కత్తులు, మందు గుండు సామగ్రి సహా ఎలాంటి నిషేధిత వస్తువులు తీసుకెళ్ళరాదు.
- ఊరేగింపు సమయంలో మండపాలు, రోడ్లపై బాణాసంచా కాల్చకూడదు.
- ర్యాలీల్లో ఉండే అపరిచితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.
- ఆద్యంతం చిత్రీకరించడానికి వీలుగా ప్రతి వాహనానికి ఒక వీడియో కెమెరా సమకూర్చుకోవాలి.
- గురువారం అర్థరాత్రి 12 తర్వాత పితృపక్షం వస్తోంది. ఈ లోపుగానే నిమజ్జనం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించిన విషయం గుర్తుచుకోవాలి.
- గత ఏడాది మేం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసినా, సాయంత్రం వరకు ఎలాంటి విగ్రహాలు నిమజ్జనాని రాకపోవటంతో అన్ని క్రేన్‌స ఖాళీగా ఉండాల్సివచ్చింది. ఈసారి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు.
- ఆలస్యంగా వచ్చిన విగ్రహాలను నెక్లేస్ రోడ్డుకు పంపిస్తారు. సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకము లేకుండా, ఆ మరునాడు ఏ జంక్షన్లు మూసివేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
జాయింట్ కంట్రోల్ రూమ్స్ ఇక్కడే..:
నిమజ్జనం నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. దీనికోసం బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో అన్ని విభాగాల అధికారులు ఉంటారు. దీంతో పాటు నగర వ్యాప్తంగా 8 జాయింట్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్, ఈస్ట్‌జోన్, నార్త్‌జోన్, వెస్ట్‌జోన్, సౌత్‌జోన్ డీసీపీ కార్యాలయాలతో పాటు సర్దార్ మహల్, ఎన్టీఆర్ మార్గ్, గాంధీనగర్ పోలీసు ఔట్‌పోస్టుల కేంద్రంగా ఇవి పని చేయనున్నాయి.
మద్యం విక్రయాలు బంద్...
గణేష్ నవరాత్రుల్లో కీలక ఘట్టమైన నిమజ్జం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలు నిషేధిస్తూ కొత్వాల్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు కమిషనరేట్ల వ్యాప్తంగా గురు-శుక్రవారాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని, మద్యం విక్రయాలు జరగకూడదని కమిషనర్లు స్పష్టం చేశారు. స్టార్‌హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు వీటి నుంచి మినహాయింపునిచ్చారు.
హెల్ప్‌లైన్స్ ఏర్పాటు:
ట్రాఫిక్ మళ్ళింపులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఇతర అంశాల్లో సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040-27852482, 9490598985, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చని సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి కోరారు.