హైదరాబాద్ లో వడగండ్ల వాన
హైదరాబాద్ నగరాన్ని బుధవారం సాయంత్రం వడగండ్లు, వర్షం అతలాకుతలం చేశాయి. నాంపల్లి, కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో 5 గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వాన మొదలైంది.
అంబర్‌పేట్, నల్లకుంట ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. సరూర్‌నగర్, కొత్తపేట, దిల్‌షుక్‌నగర్, చైతన్యపురి ప్రాంతాల్లోనూ వడగండ్ల వాన పడింది. రాజేంద్రనగర్‌లో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడు కావటంతో చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు ఒరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఆల్వాల్ అంబేద్కర్ నగర్‌లోని ఈసేవారోడ్డులో చెట్టు కూలి రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కుషాయిగూడ, దమ్మాయిగూడ, నాగారం, కీసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది.