హ్యాపీ డేస్
మా అమ్మమ్మగారి ఊరు విజయవాడలో పుట్టడమైతే పుట్టాను గానీ, చిన్ననాటి నుంచి నేను పెరిగింది హైదరాబాద్‌లోనే. బాల్యంలో ఎక్కువకాలం సికింద్రాబాద్ పరిసరాల్లో గడిపాను. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో చదువుకున్నాను. సైనిక్‌పురి కాలేజీలో బి.కామ్ పూర్తి చేశాను. చిన్నప్పుడు సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, సైనిక్‌పురి ప్రాంతాలనే నగరంలో పోష్ ఏరియాలనుకునే దాన్ని. మా నాన్న రిటైర్డ్ బ్యాంకు అధికారి, అమ్మ గృహిణి. నాకో తమ్ముడు ఉన్నాడు. మాది ఎనిమిది మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. నన్ను చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దిన నగరం ఇదే. అందుకే హైదరాబాద్ అంటే నాకు వల్లమాలిన ఇష్టం. ఔట్‌డోర్ షూటింగుల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్‌ను మిస్సవుతున్నానే అని ఫీలవుతుంటాను. హైదరాబాద్ కంఫర్ట్‌కు మరే నగరమూ సాటిరాదు. ఇక్కడి ప్రజలు తమ తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా, సంస్కృతిని, పండుగలను ఎన్నడూ మరచిపోరు.
కేకుల తయారీలో ప్రయోగాలు..
బేకరీ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆన్‌లైన్‌లో ఫుడ్ వెబ్‌సైట్స్ చూస్తూ, వంటల్లో.. ముఖ్యంగా కేకుల తయారీలో ప్రయోగాలు చేస్తుంటాను. నేనెప్పుడు వంటగదిలోకి వెళ్లినా.. ఇంటిల్లిపాదీ నేను చేసే వంటకాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. ఇక హైదరాబాదీ ఫుడ్ విషయానికొస్తే, నాకు హైదరాబాద్ హౌస్‌లోని దమ్‌కీ బిర్యానీ, కుబానీ కా మీఠా చాలా ఇష్టం. నేను ఎక్కువగా మొఘలాయ్ ఫుడ్‌ను ఇష్టపడతాను. మాదాపూర్‌లోని మంజర్ రెస్టారెంట్‌కు కూడా తరచూ వెళుతుంటాను.
అప్పటి పచ్చదనం తిరిగి రావాలి..
నగరంలో నాకు చార్మినార్, బిర్లామందిర్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ఇష్టమైన ప్రదేశాలు. నా చిన్నప్పుడు నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతూ కనిపించేవి. వీధివీధినా పార్కులు ఉండేవి. వాహనాల రద్దీ తక్కువగా ఉండేది. ఇప్పుడన్నీ మారిపోయాయి. వాహనాలు.. వాటి వల్ల కాలుష్యం పెరిగాయి. పచ్చదనం తగ్గింది. చాలా ప్రాంతాల్లో పార్కులు మాయమయ్యాయి. అప్పటి పచ్చదనం తిరిగి రావాలని కోరుకుంటాను. ఇక పండుగలంటే నాకు చాలా ఉత్సాహం. ముంబై తరహాలోనే మన నగరంలోనూ వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. సంక్రాంతికి గొబ్బెమ్మలు, ముగ్గులు, గాలిపటాలు.. సందడే సందడి. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో సంక్రాంతికి అందరం టైపైకి వెళ్లి గాలిపటాలు ఎగరేస్తూ ఉత్సాహంగా గడుపుతాం.
శిరీష చల్లపల్లి