ధరలను నియంత్రించాలి
ప్రభుత్వానికి సీపీఎం వినతి
సాక్షి, హైదరాబాద్: అడ్డూ, అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సరుకులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే సబ్సిడీ కౌంటర్లు ప్రారంభించాలని కోరింది. రెండునెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం 50% మేర ధరలు పెరిగాయని తెలిపింది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అక్రమనిల్వలపై విజిలెన్స్‌దాడులు పెంచాలని, ఆహారపంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హెచ్‌సీయూ వీసీని అరెస్ట్ చేయాలి: రిసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల దళితుడేనని గుంటూరు జిల్లా కలెక్టర్ నిర్ధారించినందున, హెచ్‌సీయూ వీసీ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తమ్మినేని సీఎం కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు.
బలవంతపు భూసేకరణ నిలిపేయాలి: రైతుల నుంచి జీవో 123 ద్వారా బలవంతంగా భూములు తీసుకోవడాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలపై సీపీఎం హర్షాన్ని ప్రకటించింది. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం జీవో 123ని రద్దుచేసి, బలవంతపు భూసేకరణను నిలిపేయాలని కోరింది. కాగా, ఆర్టీసీ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ కార్మికులు, ప్రజా రవాణాను చులకన చేసేట్లుగా వ్యవహరించిన తీరును గర్హిస్తున్నట్లు సీపీఎం పేర్కొంది.