పీసీ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
విద్యార్థినులకు నగదు పురస్కారాలు అందజేసిన జస్టిస్ సుభాషణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గత విద్యార్థునులకు ఆర్థిక సాయం అందిస్తున్న జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డిని అంతా ఆదర్శంగా తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన పీసీ రెడ్డి ట్రస్టు 17వ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున నగదు పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ పీసీ రెడ్డి ఉదారతను చాటుకుంటున్నారని కొనియాడారు.
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జస్టిస్ పీసీ రెడ్డి పదవీ విరమణ అనంతరం ట్రస్టు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారని సుభాషణ్‌రెడ్డి అన్నారు. అలాగే మహిళాభివృద్ధికి ఆయన కృషి గర్వకారణమని, అందరూ జస్టిస్ పీసీ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి ఇలాంటి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు జస్టిస్ పీసీ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ కూచిపూడి నృత్య గురువు మద్దాలి ఉషా గాయత్రి నిర్వహించిన ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో పీసీ రెడ్డి కుమారులు శ్రీకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.
పురస్కారాలు అందుకున్న విద్యార్థులు వీరే
న్యాయ శాస్త్రంలో పి.వాసవి, కె.సునీత, కె.లక్ష్మీ తులసి.. వైద్య శాస్త్రంలో కె.చంద్రకళ, పి.కార్తి, చింతా జీవన, షేక్ షీపా సుల్తానా, టి.శివ ప్రియాంక.. సాంకేతిక శాస్త్రంలో సి.క్రిష్ణ నివేదిత, పి.సాయిదివ్య, బి.మమత, సుగ్గం జానకి, గీత తరంగిణి, ఆర్.సౌమ్య, పి.సాయి చేతన, పి.సుజాత.. ఆర్ట్స్‌లో పి.కావేరి.. క్రీడల్లో పి.కీర్తి.. కళల్లో టి.గౌరీ ప్రియ.