Justice Subhasan Reddy
-
పీసీ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
విద్యార్థినులకు నగదు పురస్కారాలు అందజేసిన జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గత విద్యార్థునులకు ఆర్థిక సాయం అందిస్తున్న జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డిని అంతా ఆదర్శంగా తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన పీసీ రెడ్డి ట్రస్టు 17వ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున నగదు పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ పీసీ రెడ్డి ఉదారతను చాటుకుంటున్నారని కొనియాడారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జస్టిస్ పీసీ రెడ్డి పదవీ విరమణ అనంతరం ట్రస్టు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారని సుభాషణ్‌రెడ్డి అన్నారు. అలాగే మహిళాభివృద్ధికి ఆయన కృషి గర్వకారణమని, అందరూ జస్టిస్ పీసీ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి ఇలాంటి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు జస్టిస్ పీసీ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ కూచిపూడి నృత్య గురువు మద్దాలి ఉషా గాయత్రి నిర్వహించిన ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో పీసీ రెడ్డి కుమారులు శ్రీకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న విద్యార్థులు వీరే న్యాయ శాస్త్రంలో పి.వాసవి, కె.సునీత, కె.లక్ష్మీ తులసి.. వైద్య శాస్త్రంలో కె.చంద్రకళ, పి.కార్తి, చింతా జీవన, షేక్ షీపా సుల్తానా, టి.శివ ప్రియాంక.. సాంకేతిక శాస్త్రంలో సి.క్రిష్ణ నివేదిత, పి.సాయిదివ్య, బి.మమత, సుగ్గం జానకి, గీత తరంగిణి, ఆర్.సౌమ్య, పి.సాయి చేతన, పి.సుజాత.. ఆర్ట్స్‌లో పి.కావేరి.. క్రీడల్లో పి.కీర్తి.. కళల్లో టి.గౌరీ ప్రియ. -
చంద్రబాబుపై లోకాయుక్తకు ఫిర్యాదు
-అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి -లోకాయుక్తకు ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడి ఫిర్యాదు -సీఎం తమ పరిధిలోకి రాడని పేర్కొన్న లోకాయుక్త హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగంచేస్తూ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నాడని, ఆయన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఏపీ వెనుకబడిన తరగతుల సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డేరంగుల ఉదయ్‌కిరణ్ శుక్రవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదు చేశారు. గత రెండేళ్లుగా అక్రమంగా ఆర్జించిన డబ్బుతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేశారని, అయితే చంద్రబాబునాయుడు ప్రజల మనోభావాలకు విర్దుదంగా ఎమ్మెల్యేలను కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అవినీతిపై చట్టపరమైన దర్యాప్తు చేపట్టి అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు చేయాలని పోరాటం చేస్తున్నందుకు తనను చంపాలని చూస్తున్నారని, అలాగే తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాలని తెలిపారు. ప్రజల హక్కులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాగా ‘ముఖ్యమంత్రిని విచారించే పరిధి మాకు లేదు. ఇతర రాష్ట్రాల్లో లోకాయుక్త సమర్ధవంతంగా ఉంది. ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రిని విచారించే పరిధి మాకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేం. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించండి’ అని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఈ సందర్బంగా సూచించారు. -
సీమవాసులు ఆత్మగౌరవ ప్రతీకలు
-
సీమవాసులు ఆత్మగౌరవ ప్రతీకలు
‘గ్రాట్’ సదస్సులో జస్టిస్ సుభాషణ్ రెడ్డి హైదరాబాద్: రాయలసీమ వాసులు ఆత్మగౌరవం, బలం, పట్టుదలకు ప్రతీకలని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (గ్రాట్) ఆధ్వర్యంలో రాయలసీమ సాంస్కృతిక సదస్సు- సర్వసభ్య సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని స్వీకరిస్తూనే, అందరం ఒక్కటై సమస్యలను పరిష్కరించుకొని, సమైక్యంగా ముందుకు సాగాలని సదస్సుకు హాజరైన ప్రతినిధులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ నదుల అనుసంధానాన్ని ప్రభుత్వం సత్వరమే చేపట్టాలని సూచించారు. అప్పుడే కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమ వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. చట్టం ప్రకారం అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ, ప్రభుత్వాలు... వరదలతో పంట నష్టపోయిన రైతులకు రూ.కోట్లకు కోట్లు నష్టపరిహారం చెల్లిస్తూ.. కరువు పరిస్థితులతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా వారికి అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి రాయలసీమను రాళ ్లసీమ అనకుండా రత్నాల సీమ అని పిలవాలని సూచించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ను మరువనని, రాజకీయాల్లో తనకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చే సిన వారిలో రాయలసీమ నేతలే అధికంగా ఉన్నారని చెప్పారు. ఇక్కడి నుంచి ఎక్కువమంది సీఎంలు వచ్చినా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని సీమవాసులు ప్రశ్నించలేకపోయారని అన్నారు. సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ సదస్సులో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎ. గోపాలరావు, గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్యామల రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఎ.హనుమంతరెడ్డి, సి. ఆంజనేయరెడ్డి, గోపీనాథ్ రెడ్డి, ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్ జీఆర్‌రెడ్డి, ‘సాక్షి’ డెరైక్టర్ వై.ఈశ్వర ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.