అన్నీ అయ్యాకే చెప్పేవాడు!
- ప్రతి వ్యవహారమూ ఇబ్రహీం పర్యవేక్షించాడు
- ఐసిస్‌పై ఆసక్తి ఉండటంతోనే మాడ్యూల్‌లో చేరా
- ఓ సమావేశంలో హఠాత్తుగా ‘అమీర్’ను చేశారు
- ఎన్‌ఐఏ విచారణలో నైమతుల్లా హుస్సేనీ వెల్లడి
- నలుగురి కస్టడీ పూర్తి, ఒకరికి మాత్రం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : ‘ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేయాలనే ఆసక్తి ఉంది. అందుకే ఇబ్రహీంతో కలసి ముఠాలో చేరా. అయితే నేను చేసిందేమీ లేదు’ అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారుల విచారణలో నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్ వెల్లడించాడు. మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీలతో పాటు యాసిర్, మహ్మ ద్ అథఉర్ రెహ్మాన్‌ల కస్టడీకి గడువు ముగియడంతో మంగళవారం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో రెహ్మాన్ నుంచి అదనపు సమాచారం రాబట్టాల్సి ఉండటంతో కస్టడీ పొడిగించాల్సిందిగా కోరా రు. దీనికి అంగీకరించిన కోర్టు రెహ్మాన్‌ను మరో వారం ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ, మిగిలిన ముగ్గురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్(జేకేబీహెచ్)’ మాడ్యూల్ కుట్రను ఎన్‌ఐఏ అధికారులు గత నెల 29న భగ్నం చేసి, రెండు దఫాల్లో ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. వీరిలో ఇబ్రహీం యజ్దానీ, ఇలియాస్ యజ్దానీలతో పాటు యాసిర్, మహ్మద్ అథఉర్ రెహ్మాన్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించింది. పాతబస్తీలోని మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన యాసిర్ ఖైరతాబాద్‌లో రెడీమేడ్ వస్త్రదుకాణం నిర్వహించేవాడు. రెహ్మాన్ ఎంఏ (ఇంగ్లిష్) పూర్తి చేసి.. స్థానికంగా ఇంగ్లిష్ ట్యూషన్లు చెప్పడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని భావించే వారికి నిర్వహించే ‘టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్(టోఫెల్)’ పరీక్షలపై విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేవాడు.
గత ఏడాది ఇబ్రహీం ఇంట్లో అరబిక్ క్లాసులు చెప్పడానికి వచ్చిన నేపథ్యంలో అతడితో యాసిర్‌కు పరిచయమైంది. ఉగ్రవాద భావజాలం ఉండటంతో జేకేబీహెచ్ మాడ్యూల్‌లో చేరాడు. హ్యాండ్లర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ విధ్వంసాలకు కుట్ర పన్నుతున్నామని ఇబ్రహీం చెప్పాడని, అప్పటికే ఆసక్తి ఉండటంతో కలసి పనిచేయడానికి అంగీకరించారని ఎన్‌ఐఏ ఎదుట యాసిర్ చెప్పాడు. తాము తరచూ సమావేశమయ్యే వారమని, ఓ రోజు హఠాత్తుగా మాడ్యూ ల్ చీఫ్(అమీర్)గా తనను ప్రకటించారని వివరించాడు. నాందేడ్, అజ్మీర్, అనంతపురం సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన విషయాన్ని ఆ తర్వాతే తనకు చెప్పారని, నిధుల సమీకరణలో మాత్రం కీలకపాత్ర పోషించానని వెల్లడించాడు.
అత్యంత వేగంగా విస్తరించింది: ఎన్‌ఐఏ
ఈ మాడ్యూల్ అత్యంత వేగంగా విస్తరించిందని ఎన్‌ఐఏ నిర్ధారించింది. అంతా కలసి ముఠాగా ఏర్పడిన 6 నెలల్లోనే హోదాలు ఇచ్చుకోవడం, పేలుడు పదార్థాలు, ఆయుధా ల సమీకరణతో పాటు టార్గెట్ల ఎంపిక, రెక్కీల వరకు చకచకా చేసుకుపోయిందని ఆధారాలు సేకరించింది. దీని గుట్టురట్టు చేయకపోయి ఉంటే భారీ విధ్వంసాలకు దిగేదని, మాడ్యూల్‌లోని సభ్యులందరూ అదే భావజాలం, మానసికస్థితిలో ఉన్నారని అధికారులు చెబు తున్నారు. కస్టడీలో ఉన్న ఉగ్రవాదుల్ని వికారాబాద్ సమీప ప్రాంతాలకు తీసుకెళ్ళిన అధికారులు అక్కడ వారు సంచరించిన ప్రాంతాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు.