
సంక్షోభంలో కూరుకు పోయిన సిరియాలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటయ్యింది. 13 ఏళ్ల అంతర్యు ద్ధాన్ని, ఐదు దశాబ్దాల నియంతల కుటుంబ పాలనను చవిచూసిన ఆ దేశం ఇప్పుడు కొత్త గాలుల్ని పీల్చుకుంటోంది. జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. పాఠశాలలు తెరుచుకున్నాయి. పిల్లలు తరగతులకు హాజరవుతున్నారు. జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు బయట కొచ్చారు. దాదాపు 7,600 మంది శరణార్థులుగా వెళ్లినవారు టర్కీ సరి హద్దుల మీదుగా తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు.
సిరియాను 50 ఏళ్ల పాటు అసద్ కుటుంబమే పాలించింది. 2000 నుంచి మొన్న అధికారం కోల్పోయే వరకూ అసద్ పాలిస్తే అంతకు ముందు... 1970 నుంచి 2000 వరకూ అసద్ తండ్రి హఫీజ్ ఏలాడు. ఇద్దరూ నియంతలుగానే పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు 2011లో ప్రారంభమయ్యాయి. ఇవే అంతర్యుద్ధంగా రూపు దాల్చాయి. ఈ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. రష్యా, ఇరాన్ దేశాల మిలటరీ; హెజ్‌బొల్లా ఆయుధాలతో దేశంలో 2/3 వంతు భూభాగంపై అసద్ తన పట్టు బిగించాడు. సొంత ప్రజలపైనే రసాయన, సిలిండర్ దాడులు చేయించి లక్షలాది మందిని జైళ్లపాలు చేశాడు. దాదాపు 3 లక్షల మంది దాకా జైళ్లలో మగ్గుతూ ఉంటారని అంచనా.
అసద్ పాలనలో సిరియా దుర్భర పరిస్థితులను చవి చూసింది. 90 శాతం ప్రజలు దారిద్య్రరేఖ దిగువకి చేరారు. ప్రజలకు 24 గంటల కరెంట్ అందుబాటులో లేదు. మందులు లేవు. పెట్రోలుకి రేషన్ ఉంది. బ్రెడ్ కొనుక్కోవటానికి గంటల తరబడి లైన్‌లో నిలబడాలి. చాలా మందికి ఉపాధి లేదు. పొట్ట చేతపట్టుకుని ఎక్కడెక్కడికో వెళుతున్నారు. సిరియా పౌండ్ దాని విలువలో 99 శాతం కోల్పో యింది. రాజధాని నగరమైన డమాస్కస్ మినహా దేశం ఏ నగరాన్ని చూసినా ఇప్పుడు యుద్ధం మిగి ల్చిన విధ్వంసపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. దేశాన్ని పునర్నిర్మించటానికి 250 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని ఐక్యరాజ్యసమితి అంచనా.
అసద్‌ను పదవి నుంచి తొలగించి సున్నీ పాలనను స్థాపించాలనే లక్ష్యంతో పోరాడిన హయత్ తహీర్ ఆల్ షమ్ (హెచ్‌టీఎస్) సంస్థ విజయం సాధించింది. రెండో తిరుగుబాటు బృందం సిరియన్ డెమాక్రటిక్ ఫోర్సెస్ కుర్దుల మిలటెంట్ల సమూహం. మూడోది అటు అసద్‌నూ, ఇటు కుర్దులనూ వ్యతి రేకించే సిరియన్ నేషనల్ ఆర్మీ. సిరియాలో రెబెల్ గ్రూపులకు ప్రధానంగా హెచ్‌టీఎస్‌కు టర్కీ ప్రధాన మద్దతుదారుగా ఉంది. సిరియన్ నేషనల్ ఆర్మీకి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైన్యాన్ని అందించటంతో పాటు రాజకీయంగా కూడా మద్దతుగా నిలిచింది.
అలాగే సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) గ్రూపునకు వ్యతిరేకంగా అమెరికా పోరాడుతోంది. సిరియా మిలటరీ స్థావరాలపై ఇటీవల కాలంలో అనేక మార్లు ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు చేసింది. ఆగ్నేయ ప్రాంతంలోని క్వెనిత్రా లోని రోడ్లు, విద్యుత్ ప్రసార సాధనాలు, వాటర్ నెటవర్క్స్‌ను ధ్వంసం చేసింది. తాము సిరియాలో ఉన్న ఇరాన్ మిలటరీ స్థావరాలపై దాడులు చేస్తు న్నామని... ఆ దేశం ఈ దాడులను సమర్థించుకుంటోంది.
అసద్‌ను పదవీచ్యుతుడిని చేసిన హెచ్‌టీఎస్ కమాండర్ ఇన్ ఛీఫ్ అహ్మద్ ఆల్ షారా సిరియా నాయకత్వ బాధ్యతలను మహ్మద్ అల్ బషర్ చేతిలో పెట్టారు. ఆయన ఇడిబ్ లోని సిరియన్ సాల్వేషన్ గ్రూపు (ఎస్‌ఎస్‌జీ) నాయకుడు. ప్రస్తుతం కేర్ టేకర్ ప్రభుత్వానికి బషర్ నాయకునిగా వ్యవహరిస్తారు. మార్చి 1 వరకూ ఆయన పదవిలో ఉంటారు. పౌర సేవలు సక్రమంగా అందటానికి, సాయుధ దళాల చేతిలోకి అధికార పగ్గాలు వెళ్లకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.
ఒకప్పుడు ఆల్ ఖైదాకు అనుబంధంగా పని చేసిన హెచ్‌టీఎస్‌ను తీవ్రవాద సంస్థగా ముద్ర వేసినా, ఇప్పుడు హెటీఎస్ నేతలతో బైడెన్ ప్రభుత్వం టచ్‌లో ఉంటోంది. యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ దీనిపై మాట్లాడారు. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
– డా‘‘ పార్థసారథి చిరువోలు,సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment