సరికొత్త సంకటంలోకి సిరియా
ఒక సమస్య నుంచి బయటపడిన సిరియాను బయటి శక్తుల రూపంలో మరో సమస్య వెన్నాడటం అప్పుడే మొదలైపోయింది. అటువంటి శక్తులలో అన్నింటికన్న ప్రధానమైనది ఇజ్రాయెల్. సిరియా అధ్యక్షుడు అసద్ పతనం ఈనెల 8వ తేదీన జరిగింది. కాగా సిరియాకు పొరుగునే ఉన్న ఇజ్రాయెల్ సైన్యం, అంతకన్న ఒకరోజు ముందే సరిహద్దులు దాటి చొచ్చుకు వచ్చింది. అలా ప్రత్యక్ష దురాక్రమణ మొదలు కాగా, ఇప్పటికి దేశమంతటా కొన్నివందల వైమానిక దాడులు జరిపింది. ఈ చర్యలను ఐక్యరాజ్యసమితితో సహా వివిధ దేశాలు ఖండించినా ఇజ్రాయెల్ ఆపటం లేదు. గోలన్ హైట్స్ప్రాంతం తమదేననీ, దానిని వదలుకునే ప్రసక్తే లేదనీ నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు. అంటే, దాన్ని వారిక ఖాళీ చేయబోరు!సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దులలో గోలన్ హైట్స్ పేరిట పర్వత శ్రేణులున్నాయి. పాల స్తీనా సమస్యను పురస్కరించుకుని అరబ్ దేశాలకూ, ఇజ్రాయెల్‌కూ 1967లో జరిగిన యుద్ధంలో, సిరియాకు చెందిన గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్ని తమ దేశంలో పూర్తిగా విలీనం చేసుకుంటున్నట్లు 1981లో ప్రకటించింది. ఆ చర్య అంతర్జా తీయ చట్టాలకు విరుద్ధం గనుక గుర్తించబోమని ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా సైతం ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ లెక్క చేయ లేదు. గోలన్ హైట్స్ మొత్తం విస్తీర్ణం సుమారు 18 వేల చ.కి.మీ. కాగా, అందులో 12 వేల చ.కి.మీ.ను ఆక్రమించిన ఇజ్రాయెల్‌కు, సిరియాకు మధ్య నిర్యుద్ధ భూమి ఏర్పడింది. ఆ ప్రాంతం ఐక్య రాజ్యసమితి దళాల పర్యవేక్షణలోకి వెళ్లింది. ఇపుడు అసద్ పతన సమయంలో, ఇజ్రాయెల్ సైన్యం అకస్మాత్తుగా ఆ నిర్యుద్ధ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి ఆక్రమించింది.తాత్కాలిక చర్య అనుకోగలమా?ఇజ్రాయెల్ చర్యను ఐక్యరాజ్యసమితితో పాటు సౌదీ అరేబియా, టర్కీ, ఇరాక్, ఖతార్ తదితర దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ సేనలు వెనుకకు పోవాలన్నాయిగానీ, అందుకు ప్రధాని నెతన్యాహూ ససేమిరా అన్నారు. ఇక్కడ చెప్పుకోవలసిన ఒక విషయమేమంటే, గోలన్ ఆక్రమణను మొదట వ్యతిరేకించిన అమెరికా, తర్వాత ట్రంప్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2017లో ఆమోదించింది. ఇపుడు తిరిగి ట్రంప్ రానున్నందున అమెరికా వైఖరి ఏమి కాగలదో ఊహించవచ్చు. నెతన్యాహూ ధైర్యానికి అది కూడా కారణమై ఉండాలి. అమె రికా మాట అట్లుంచితే, అసలు గోలన్ ప్రాంతం యావత్తూ తమకు చెందినదేననీ, కనుక దానిని వదలుకునే ప్రసక్తే లేదనీ నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు. అక్కడి జనాభాలో గల సిరియన్లను వేధించటం, అక్కడినుంచి తరలిపోయేట్లు చేయటం, వేలాదిమంది యూదుల కోసం సెటిల్మెంట్లు సృష్టించటం ఒక విధానంగా అనుసరి స్తున్నారు. ఆ విధంగా అక్కడి సిరియన్లు మైనారిటీగా మారారు. ఇప్పుడు తాజాగా నిర్యుద్ధ లేదా నిస్సైనిక మండలంలోకి వెళ్లి, సమితి సైన్యాన్ని కాదంటూ ఆక్రమించిన దరిమిలా, ఇది తాత్కాలిక చర్య మాత్రమేననీ, ఆ ప్రాంతంలో సిరియన్ తీవ్రవాదులు పుంజుకోకుండా ముందు జాగ్రత్త కోసమనీ నెతన్యాహూ వివరించే యత్నం చేస్తున్నారు.కానీ, ఆయన వివరణను నమ్మేందుకు సమితిగానీ, మరొకరు గానీ సిద్ధంగా లేరు. యథాతథంగా ఇజ్రాయెల్ చర్య సిరియా సార్వ భౌమత్వానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. నిస్సైనిక ప్రాంతం సమితి సేనల అధీనంలో ఉన్నందున ఆ ప్రాంత నిర్వహణను సమితికే వదలి వేయాలి తప్ప ఇజ్రాయెల్ జోక్యం తాత్కాలికం పేరిటనైనా సరే ఆమోదనీయం కాదు. అందుకు సమితి ముందస్తు అనుమతి కూడా లేదు. ఈ విధంగా తాత్కాలిక ఆక్రమణ లేదా పర్యవేక్షణ పేరిట పాల స్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లోని ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించి, ఇప్పటికి అరవై సంవత్సరాలు గడిచినా ఖాళీ చేయటం లేదు. ఇటీవల ఒక కొత్త వాదాన్ని ముందుకు తెచ్చింది. దాని ప్రకారం, అసలు వెస్ట్ బ్యాంక్ అనేది ఇజ్రాయెల్‌లో ఒక భాగమే తప్ప దానికి పాలస్తీనాతో సంబంధం లేదు. అందువల్ల తమ సెటిల్మెంట్లు చట్ట విరుద్ధం కాదు. క్రమంగా ఆ ప్రాంతాన్నంతా ఇజ్రాయెల్‌లో విలీనం చేస్తాం. ఇక్కడ కాకతాళీయమైన ఒక విశేషమేమంటే ఆ విధానాలను, అక్కడి జెరూసలేంకు ఇజ్రాయెల్ రాజధానిని టెల్ అవీవ్ నుంచి బదిలీ చేయటాన్ని ట్రంప్ తన మొదటి పాలనా కాలంలో ఆమోదించారు. ఈ పరిణామాలను ప్రస్తుతం గోలన్ ప్రాంతంలో జరుగుతున్న దానితో పోల్చితే ఏమనిపిస్తుంది? నిస్సైనిక మండలంలోకి ఇజ్రాయెలీ సేనల ప్రవేశం తాత్కాలికమని నమ్మగలమా? పైగా, ఆ పర్వత శ్రేణులన్నీ తమవేనని నెతన్యాహూ గతంలోనే స్పష్టంగా ప్రకటించిన స్థితిలో?గోలన్ హైట్స్ ఇజ్రాయెల్కేనా?విషయం ఇంతటితో ముగియటం లేదు. తమ ఆక్రమణకు బయట ఇంకా సిరియా అధీనంలోనే గల ప్రాంతాన్ని, ఆ పరిసరాలను కూడా ‘స్టెరైల్ జోన్’ (నిర్జీవ మండలం)గా మార్చివేయగలమన్న నెతన్యాహూ అందుకోసం తమ సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ మాటకు ఆయన చెబుతున్న అర్థం ఇక అక్కడ సిరియన్ తీవ్రవాదుల కార్యకలాపాలకు గానీ, స్థావరాలకుగానీ శాశ్వతంగా ఎటువంటి అవకాశాలు లేకుండా చేయటం. వినేందుకు ఇది సహేతు కంగా తోచవచ్చు. కానీ, పైన చెప్పుకొన్న వివరాలలోకి వెళ్లినపుడు ఇజ్రాయెల్ అసలు ఉద్దేశాలు ఏమిటనేది అర్థమవుతుంది. సూటిగా చెప్పాలంటే, గోలన్ ప్రాంతాన్ని వారిక ఖాళీ చేయబోరు. తమ అధీనంలో లేని భాగాన్ని కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆక్రమణ లోకి తెచ్చుకుంటారు.ఇదంతా నిరాటంకంగా సాగేందుకు ఇజ్రాయెల్ సేనలు 8వ తేదీ నుంచే ఆరంభించి మరొక పని చేస్తున్నాయి. అది, సిరియా వ్యాప్తంగా నిరంతరం వందలాది వైమానిక దాడులు. అవన్నీ సిరియా ఆయు ధాగారాలపై, ఉత్పత్తి కేంద్రాలపై, వైమానిక, నౌకా స్థావరాలపై జరుగుతున్నాయి. యుద్ధ విమానాలను, రాకెట్లను, నౌకలను ఇప్పటికే దాదాపు ధ్వంసం చేశారు. వాటిలో అసద్ కాలం నాటి రసాయనిక ఆయుధాలు కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ చెప్తున్నది. ఇవన్నీ సిరియాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన తీవ్రవాదుల చేతికి రాకూడదన్నది తమ లక్ష్యమైనట్లు వాదిస్తున్నది. వాస్తవానికి ఇంతటి స్థాయిలో కాకున్నా ఐసిస్ కేంద్రాలని చెప్పే ఈశాన్య ప్రాంతానికి పరిమితమై అమెరికా కూడా దాడులు సాగిస్తున్నది. సమస్య ఏమంటే, అటు గోలన్ ఆక్రమణలు గానీ, ఇటు ఈ దాడులు గానీ సిరియా సార్వభౌమ త్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, సమితిలో ఎటువంటి ప్రమేయం లేకుండా ఏకపక్షంగా జరుగుతున్నవి.కొత్త ప్రభుత్వపు అడుగులుసిరియా ప్రజలు అయిదు దశాబ్దాల నియంతృత్వం నుంచి,అంతకు మించిన కాలపు వెనుకబాటుతనం నుంచి ఒక కొత్త దశలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా ఒక నియంతను కూల దోయటం ద్వారా ఒక అడుగు వేసి 24 గంటలైనా గడవకముందే, బయటి శక్తులు తమ ప్రయోజనాల కోసం ఈ విధమైన చర్యలకు పాల్పడితే, ఆ ప్రజలు ఏమి కావాలి? సదరు ఆయుధాలన్నీ సిరియా దేశపు రక్షణ సంపద. అక్కడ కొత్తగా అధికారానికి వచ్చేది ఎవరన్నది ఇంకా తెలియదు. దేశంలో వేర్వేరు గ్రూపులు ఉండటం, వాటిలో ఒకటి రెండింటికి ఇస్లామిస్ట్ తీవ్రవాద నేపథ్యం ఉండటం నిజమే. కానీ ఆ సంబంధాలను వారు బహిరంగంగా తెంచివేసుకుని సుమారు ఎనిమిది సంవత్సరాలవుతున్నది. ఇపుడు డమాస్కస్‌లో అధికారానికి వచ్చిన తర్వాత, ప్రధాన గ్రూపు నాయకుడైన మహమ్మద్ జొలానీ, తాము దేశంలోని అన్ని జాతులు, వర్గాల ప్రజలను ఐక్యం చేసి అందరి బాగు కోసం పాలించగలమని ప్రకటించారు. మార్కెట్ ఎకానమీలోకి ప్రవేశించగలమన్నారు. మహిళలపై ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. అసద్‌కు పూర్తి మద్దతునిచ్చిన రష్యా, ఇరాన్‌లతోనూ సత్సంబంధాలకు సుముఖత చూపుతున్నారు. అసద్ హయాంలోని మంత్రి వర్గాన్ని తాత్కాలిక ప్రాతిపదికపై కొనసాగిస్తూ, దేశంలో పరిస్థితులు కుదుట పడేట్లు చూస్తున్నారు.ఉద్యమాల దశలో ఎవరికి ఏ నేపథ్యం ఉన్నా, వారి పరివర్తనలు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్యం. ఆ విజ్ఞత లేని బయటి శక్తులు కేవలం తమ ప్రయోజనాల కోసం ఏవో సాకులు చెప్తూ ఈ విధంగా వ్యవహరించటం ఆమోదించదగిన విషయం కాబోదు.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్