నజరానాల వాన!
ఓట్ల కోసం భారీగా నగదు,
బహుమతులు పంపిణీ
లిక్కర్‌కే లక్షలు వెచ్చించిన అభ్యర్థులు
సిటీబ్యూరో: బల్దియా ఎన్నికల్లో భారీగా నగదు, నజరానాల పంపిణీతో రాజకీయ పార్టీ లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి వీధి, బూత్ పరిధిలో ఇదే తంతు. వివిధ పార్టీల ఏజెంట్లు మూడో కంటికి తెలియకుండా ఓటర్లను, మహిళా గ్రూపులను నేరుగా కలుసుకొని నగదు పంపిణీ చేశారు. మరి కొందరు వారి అకౌంట్ నెంబర్లకు నేరుగా నిధులు బదిలీ చేశారు. మురికివాడల్లో స్థానిక బస్తీ లీడర్ల చేతుల మీదుగా ఓటుకు కనిష్టంగా రూ.500 నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పురుష ఓటర్లకు విందు వినోదాలు సరేసరి. అపార్ట్‌మెంట్లు, కాలనీ సంక్షేమ సంఘాలు ఈ పార్టీలకు వేదికగా మారాయి. మహిళా ఓటర్లను మెప్పిం చేందుకు చీరలు, గాజు లు, వెండి కుంకుమ భరిణెలు, డిన్నర్‌సెట్‌లు, మిక్సీ లు, వంట పాత్రలు, గృహోపకరణాలు పంపిణీ చేశా రు. యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు క్యారమ్స్, చెస్ బోర్డులు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. స్థానికంగా ఎక్కడికిక్కడే నివాసం ఉండే తమ పార్టీ నేతలతో ఈ కార్యక్రమాలను చేపట్టడం విశేషం.
లిక్కర్‌కు రూ.లక్షలు
ప్రధాన పార్టీల అభ్యర్థులు మద్యం కొనుగోలుకు రూ. లక్ష ల్లో ఖర్చు చేశారు. ఒక్కో అభ్యర్థి గత పది రోజు లుగా మద్యం కొనుగోలుకే రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించి నట్లు అనధికారిక అం చనా. నగర శివార్లలో ఒక్కో డివిజన్‌కు సుమారు రూ.కోటి విలువైన మద్యాన్ని అభ్యర్థులు మందుబాబులకు పంపిణీ చేయడం గమనార్హం. వీరంతా ఇంతగా కష్టపడినా వారు ఆశించిన స్థాయిలోఓట్లు పడతాయా అన్నదే ఇప్పు డు మిలియన్ డాలర్ల ప్రశ్న.
బస్తీ నేతలకు తాయిలాలు..
కొందరు అభ్యర్థులు కుల సంఘాలు, బస్తీల్లోని చోటా మోటా నేతలను పిలిపించుకొని ఏకమొత్తంగా డబ్బులిచ్చినట్లు సమాచారం. డబ్బు తీసుకునేందుకు ఇష్టపడని కాలనీలకు మాత్రం అక్కడున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు అయ్యే మొత్తాన్ని భరిం చేలా హామీ ఇచ్చి ఒప్పందం చేసుకొన్నట్లు వినికిడి. మినీ వాటర్ ట్యాంకులు, బోర్లు నిర్మించేలా మరి కొం దరు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. చిన్న, మధ్యతరగతి వర్గాల వారున్న ప్రాంతంలో మద్యం, మాంసంతో కూడిన విందులు ఏర్పాటు చే సి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు యత్నించారు. మరికొం దరు ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వర కూ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
స్వయం సహాయక సంఘాల మహిళల లీడర్లను కలిసి ఓట్ల లెక్కన కొంతమొత్తం చెల్లించినట్టు సమాచారం. నేరుగా తీసుకోని గ్రూపులకు వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. మరి కొందరు అభ్యర్థులు కిరాణా దుకాణాలు, వైన్ షాపుల్లో కొంత డబ్బు డిపాజిట్ చేసి పక్కాగా ఓటు వేస్తామని చెప్పిన వారికి కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న చిన్న స్లిప్ రాసి ఇచ్చారు. వీటి ఆధారంగా పంపిణీలు జరిగిపోయాయి.