ghmc Election
-
కాపీ కొట్టడానికి తెలివి ఉండాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మేనిఫెస్టోపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫొటోలను జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఫొటోలను వాడటం ప్రశంసలుగా భావిస్తున్నామన్నారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని బీజేపీ నాయకులను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. బల్దియాలో అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ ముఖ్యంగా తెలిపింది. గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని, లక్ష మందికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సామాన్యుని సొంతటి కలను నెరవేరుస్తామని పెర్కొంది. విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్, ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఇస్తామంది. మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీనిచ్చింది. Dear BJP manifesto writers, Glad that you chose pictures of the work done by TRS Govt in your GHMC manifesto We will take this as a compliment to our work But let me remind you what they say in Hyderabad नकल मारने को भी अकल चाहिए। 😀 కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె https://t.co/guN76K5N7n — KTR (@KTRTRS) November 26, 2020 -
గ్రేటర్ ఎన్నికలు; ‘నోటాకే మా ఓటు’
సాక్షి, హైదరాబాద్: సోమవారం కార్తికేయ నగర్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. కొనేళ్లుగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడంతో ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో నోటాకే ఓటు వేయాలని కార్తికేయ కాలనీ వాసులు నిర్ణయించుకున్నారు. దీంతో వారు ‘మా ఓటు నోటాకే’ అని బ్యానర్లతో రాజకీయ నాయకులకు స్వాగతం పలికారు. కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలోని కార్తికేయ కాలని లో 33 ఎకరాల కాలనీ స్థలంలో ప్రజల కోసం ఒక్క ఉద్యానవనం కూడా లేదు. కొంత కాలంగా నీటి పైపులైన్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయనప్పటికీ ఎటువంటి మరమ్మతులకీ నోచుకోలేదు. కాలనీలో కొన్ని రహదారులు గుంతలమయంగా మారినా పట్టించుకున్నవారే లేరు. అందుకే నాయకుల్లో మార్పు కోసమే ఈ ఎన్నికల్లో నోటాకు ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేస్తామని కాలనీవాసులు తెలిపారు. రెండు రోజుల క్రితం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఇటువంటి పరిస్థితే ఎదురైన సంగతి తెలిసిందే. యాప్రాల్ (మేడ్చల్ జిల్లా) లోని ప్రకృతి విహార్ లో ప్రచారం కోసం వెళ్లగా అక్కడి ప్రజలు ఓట్లు కోరే ముందు నాయకులు రోడ్లు చూడాలని హనుమంత రావుతో అన్నారు. స్థానికుల వేడిని తట్టుకోలేక డిసెంబర్ 1 తర్వాత రహదారి నిర్మాణాన్ని చేపడుతామని హామి ఇచ్చాకే వారు ఎమ్మెల్యేను ప్రచారానికి వెళ్లనిచ్చారు. -
సామాన్యులు పోటీ చేసే పరిస్థితుల్లేవు: చాడ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సామాన్యులు, డబ్బులు లేని వారు పోటీ చేసే పరిస్థితులు లేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలంటేనే డబ్బు మయం అనే పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత ప్రజా స్వామ్యంలో సామాజిక సేవ కు ప్రాముఖ్యత లేకుండా పోయిందన్నారు. కార్పొరేట్ సంస్థల వ్యక్తులు, భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజా భక్షకులుగా తయారవుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆగమేఘాలపై నిర్వహిం చడం, ప్రచారానికి కేవలం వారం రోజుల సమయమే ఉండటం విచార కరమన్నారు. ఆదివారం సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకట్‌రెడ్డి లతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా బరి లోకి దిగుతున్నాయని, సీపీఐ 17 డివిజన్లలో పోటీ చేస్తోందని వెల్లడిం చారు. అలాగే, పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే, కేంద్రం సాయం ఎందుకు అందించలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. బాధితు లతో బీజేపీ బురద రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే కేంద్రం తగిన సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఈఎస్ఐ ఆస్పత్రి కేంద్రానికి
కేంద్ర, రాష్ట్ర మంత్రులు దత్తాత్రేయ, నాయినిల మధ్య అంగీకారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిని కేంద్రానికి ఇచ్చేందుకు సయోధ్య కుదిరింది. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డిల మధ్య అంగీ కారం కుదిరింది. ఇద్దరు మంత్రులు ఈఎస్ఐసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో సనత్‌నగర్ ఆసుపత్రిలో ఈఎస్ఐ మెడికల్ కళాశాలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు దత్తాత్రేయ తెలిపారు. మెడికల్ కాలేజీ కోసం సనత్‌నగర్ ఆస్పత్రిని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందున.. కేంద్రం పరిధిలోని నాచారం ఆస్పత్రిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే గోషామహల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉంద ని, రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. వరంగల్‌లో శిథిలావస్థకు చేరిన ఈఎస్ఐ ఆస్పత్రి స్థానంలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. నిజామాబాద్‌లో 10 పడకల ఆస్పత్రిని 50 పడకలకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభమైతే రాష్ట్ర కార్మికులకు మంచి రోజులు వచ్చినట్లేనని నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిని 250 నుంచి 500 పడకలకు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎర్రగడ్డలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయిస్తామని, 500 పడకల కొత్త ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలని కోరారు. చరిత్రలో నిలిచేలా సేవ చేయాలి కార్పొరేటర్లకు నాయిని పిలుపు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లందరూ చరిత్రలో నిలిచిపోయేలా సేవ చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇటీవల గెలిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 29 మంది కార్పొరేటర్లని అబిడ్స్ ఆర్బీవీఆర్ఆర్ హాస్టల్లో సన్మానించా రు. నాయిని మాట్లాడుతూ... ‘సీఎం కేసీఆర్‌ను నమ్మి, ఆయన అభివృద్ధిని చూసి 99 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లను ప్రజలు గెలిపించా రు. మీరంతా నిజాయతీగా పనిచేసి కేసీఆర్ గౌరవం నిలపాలి. లంచం తీసుకోకుండా ఇంటికి అనుమతు లు మంజూరు చేసే పరిస్థితి జీహెచ్ఎంసీలో రావాలి. భవిష్యత్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచే లా కృషిచేయాలి’ అన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘వెలమ, రెడ్డి సామాజిక వర్గాలకు పొసగదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ కేసీఆర్ అన్ని విషయాల్లో రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు’ అన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎడ్ల రఘుపతిరెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సంఘానికి బుద్వేల్ వద్ద 10 ఎకరాల స్థలం కేటాయించనున్నట్టు తెలిపారు. రూ.10 కోట్లు నిధులు కూడా మంజూరు చేశారన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పురానాపూల్‌లో నేడు రీ పోలింగ్
పూర్తి స్థాయి బందోబస్తు అన్ని కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ సిటీబ్యూరో: పురానాపూల్ డివిజన్‌కు శుక్రవారం రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 2న పోలింగ్ సందర్భంగా ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో... వివిధ రాజకీయ పార్టీ ల అభ్యంతరాలు.. ఎన్నికల పరిశీల కుల నివేదిక అనంతరం రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వార్డులోని 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరుగుతుందన్నారు. ఓటరు స్లిప్పులు లేకున్నా స్థానికులు ఓటు వేసేందుకు అనుమతించాల్సిం దిగా అధికారులను ఆదేశించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 36 కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు కానీ... ఫొటోతో కూడిన 21 గుర్తింపు పత్రాల్లో దేనిని చూపించినా అనుమతిస్తారని చెప్పారు. పురానాపూల్ వార్డులో మొత్తం 34,407 మంది ఓటర్లు ఉండగా... 200 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్టు కమిషనర్ చెప్పారు. పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నేడు సెలవు రీ పోలింగ్ దృష్ట్యా పురానాపూల్ వార్డు పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ గురువారం జీవో జారీ చేసింది. పోలింగ్ నిర్వహించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది. దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే వారికి, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని కార్మిక శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. స్థానిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఓటర్లు: పురుషులు-18,204, మహిళలు-16,203, మొత్తం-34,407. బరిలో ఉన్న అభ్యర్థులు... మజ్లిస్ పార్టీ నుంచి మాజీ కార్పొరేటర్ సున్నం రాజ్‌మోహన్... మరో మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి మక్కర్ యాదవ్, టీఆర్ఎస్ అభ్యర్థి మల్లికార్జున్ యాదవ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
గ్రేటర్లో సైకిల్ పంక్చర్..!
♦ కొన్ని డివిజన్లలో టీడీపీకి ఏజెంట్లు కూడా లేని వైనం ♦ గడిచిన అసెంబ్లీ ఎన్నికల తో పోలిస్తే పరిస్థితి ఘోరం ♦ సింగిల్ డిజిట్ దాటితే గొప్ప అంటున్న పార్టీ నేతలు ♦ కొన్నింటిలోనే గట్టి పోటీ ఇవ్వగలిగిన టీడీపీ ♦ పోలింగ్ సరళిని చూసి విస్తుబోయిన తమ్ముళ్లు ♦ సవాళ్లు విసిరినా కార్యక్షేత్రంలో నీరుగారిన శ్రేణులు సాక్షి, హైదరాబాద్: పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఇదేనేమో! ఏడాదిన్నర క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో బలం చాటిన తెలుగుదేశం పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కుదేలైంది. నాడు గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిదింట జయకేతనం ఎగరేసిన టీడీపీ.. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో సైతం దయనీయ స్థితిని ఎదుర్కొంది. ‘జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టండి- మా సత్తా ఏంటో చూపిస్తాం’ అని సవాళ్లు విసిరిన తెలుగు తమ్ముళ్లు తీరా కార్యక్షేత్రంలో నీరుగారి పోయారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హడావుడిగా రెండు రోజులు రోడ్‌షోలు, ఓ రోజు విలేకరుల సమావేశం నిర్వహించి ‘నేను చేసిన అభివృద్ధిని చూసి టీడీపీకి ఓటేయాల’ని వేడుకున్నా గ్రేటర్ ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదని ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ పర్యటించిన డివిజన్లలో ఎన్ని గెలుస్తామనే విషయంలో కూడా టీడీపీ నాయకులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ అంచనాలను కూడా అందుకోలేక పోయిందని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నాయకులంతా టీఆర్ఎస్లో చేరడంతో మొదలైన టీడీపీ పతనం ఆ పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న బూత్, డివిజన్ స్థాయి కార్యకర్తలు గులాబీ గూటిని ఆశ్రయించడంతో పరిపూర్ణమైనట్లు అంచనావేస్తున్నారు. దీంతో కొన్ని పోలింగ్ బూత్‌లలో టీడీపీకి ఏజెంట్లు కూడా లేనిపరిస్థితి. తెలంగాణ భావజాలం ఉన్న ఓటర్లతో పాటు సెటిలర్లు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ మాటలను విశ్వసించి ఓట్లు వేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీకి చుక్కలు చూపించిన శివార్లు 2014 సార్వత్రిక ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కంటోన్మెంట్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మహేశ్వరం, ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పరిణామాల్లో జూబ్లీహిల్ ్స, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో మిగిలారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య టీడీపీలో ఉన్నా, లేకున్నా ఒకటే. ఆయన రాజకీయ బాధ్యతలను సామ రంగారెడ్డికి అప్పగించి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో శివార్లపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్.. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో పాటు సీమాంధ్రుల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేసింది. టీడీ పీకి బలమున్న కూకట్పల్లి, మహేశ్వరం, సనత్‌నగర్‌లతో పాటు ఆపార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి వంటి నియోజకవర్గాల్లో కూడా టీ డీపీ ఓటు బ్యాంకు టీఆర్ఎస్ వైపు బదిలీ అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. అదీగాక, వివిధ పార్టీల్లో నాయకులుగా ఉన్న సెటిలర్లను తమ పార్టీలోకి తీసుకొని ఆయా డివిజన్లలో వారికే టీఆర్ఎస్ టికెట్లు కేటాయించింది. బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయిన డివిజన్లలోని బలమైన నాయకులకు టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడం కూడా టీడీపీకే నష్టం కలిగించింది. అలాగే గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 45 డివిజన్లలో సుమారు 30 డివిజన్ల మాజీ కార్పొరే టర్లు టీఆర్ఎస్ గూటికి చేరి, స్థానికంగా తమ బలానికి, తెలంగాణ సెంటిమెంట్‌ను జోడించి సఫలమైనట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అలాగే టీడీపీకి కేటాయించిన డివిజన్లలో బీజేపీ శ్రేణులు మనస్ఫూర్తిగా పనిచేయలేదని తెలుస్తోంది. 12 నుంచి 15 డివిజన్లలో రెండు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండటం కూడా అధికార పార్టీకి లాభించగా, టీడీపీ దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్, ఎంఐఎం తరువాత మూడోస్థానంలో నిలుస్తామని చెప్పుకున్న టీడీపీ నాయకుల నోటి వెంట ఇప్పుడు మాట పెగలడం లేదు. ఫలితాల తరువాత మాట్లాడతామని ఓ నేత చెబుతుండగా, సింగిల్ డిజిట్ దాటేందుకూ కాంగ్రెస్‌తో పోటీ పడే పరిస్థితి నెలకొందని మరో నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. -
నజరానాల వాన!
ఓట్ల కోసం భారీగా నగదు, బహుమతులు పంపిణీ లిక్కర్‌కే లక్షలు వెచ్చించిన అభ్యర్థులు సిటీబ్యూరో: బల్దియా ఎన్నికల్లో భారీగా నగదు, నజరానాల పంపిణీతో రాజకీయ పార్టీ లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి వీధి, బూత్ పరిధిలో ఇదే తంతు. వివిధ పార్టీల ఏజెంట్లు మూడో కంటికి తెలియకుండా ఓటర్లను, మహిళా గ్రూపులను నేరుగా కలుసుకొని నగదు పంపిణీ చేశారు. మరి కొందరు వారి అకౌంట్ నెంబర్లకు నేరుగా నిధులు బదిలీ చేశారు. మురికివాడల్లో స్థానిక బస్తీ లీడర్ల చేతుల మీదుగా ఓటుకు కనిష్టంగా రూ.500 నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పురుష ఓటర్లకు విందు వినోదాలు సరేసరి. అపార్ట్మెంట్లు, కాలనీ సంక్షేమ సంఘాలు ఈ పార్టీలకు వేదికగా మారాయి. మహిళా ఓటర్లను మెప్పిం చేందుకు చీరలు, గాజు లు, వెండి కుంకుమ భరిణెలు, డిన్నర్సెట్లు, మిక్సీ లు, వంట పాత్రలు, గృహోపకరణాలు పంపిణీ చేశా రు. యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు క్యారమ్స్, చెస్ బోర్డులు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. స్థానికంగా ఎక్కడికిక్కడే నివాసం ఉండే తమ పార్టీ నేతలతో ఈ కార్యక్రమాలను చేపట్టడం విశేషం. లిక్కర్‌కు రూ.లక్షలు ప్రధాన పార్టీల అభ్యర్థులు మద్యం కొనుగోలుకు రూ. లక్ష ల్లో ఖర్చు చేశారు. ఒక్కో అభ్యర్థి గత పది రోజు లుగా మద్యం కొనుగోలుకే రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించి నట్లు అనధికారిక అం చనా. నగర శివార్లలో ఒక్కో డివిజన్‌కు సుమారు రూ.కోటి విలువైన మద్యాన్ని అభ్యర్థులు మందుబాబులకు పంపిణీ చేయడం గమనార్హం. వీరంతా ఇంతగా కష్టపడినా వారు ఆశించిన స్థాయిలోఓట్లు పడతాయా అన్నదే ఇప్పు డు మిలియన్ డాలర్ల ప్రశ్న. బస్తీ నేతలకు తాయిలాలు.. కొందరు అభ్యర్థులు కుల సంఘాలు, బస్తీల్లోని చోటా మోటా నేతలను పిలిపించుకొని ఏకమొత్తంగా డబ్బులిచ్చినట్లు సమాచారం. డబ్బు తీసుకునేందుకు ఇష్టపడని కాలనీలకు మాత్రం అక్కడున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు అయ్యే మొత్తాన్ని భరిం చేలా హామీ ఇచ్చి ఒప్పందం చేసుకొన్నట్లు వినికిడి. మినీ వాటర్ ట్యాంకులు, బోర్లు నిర్మించేలా మరి కొం దరు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. చిన్న, మధ్యతరగతి వర్గాల వారున్న ప్రాంతంలో మద్యం, మాంసంతో కూడిన విందులు ఏర్పాటు చే సి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు యత్నించారు. మరికొం దరు ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వర కూ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళల లీడర్లను కలిసి ఓట్ల లెక్కన కొంతమొత్తం చెల్లించినట్టు సమాచారం. నేరుగా తీసుకోని గ్రూపులకు వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. మరి కొందరు అభ్యర్థులు కిరాణా దుకాణాలు, వైన్ షాపుల్లో కొంత డబ్బు డిపాజిట్ చేసి పక్కాగా ఓటు వేస్తామని చెప్పిన వారికి కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న చిన్న స్లిప్ రాసి ఇచ్చారు. వీటి ఆధారంగా పంపిణీలు జరిగిపోయాయి. -
అంధులు ఓటేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్
♦ బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ రూపకల్పన ♦ వెల్లడించిన కమిషనర్ జనార్దన్‌రెడ్డి బంజారాహిల్స్: అంధులు ఓటేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ రూపొందించామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ బ్యాలెట్ పేపర్‌ను ఈవీఎంపై ఉంచి ఎవరి సహాయం లేకుండా అంధులు సొంతంగా ఓటు వేయొచ్చన్నారు. మొట్టమొదటిసారిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే దీనిని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజ ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ముగిసిందన్నారు. ప్రతి వార్డు కార్యాలయం, పోలింగ్ స్టేషన్లలో ఓటర్ సౌలభ్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 9,352 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 1500 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని తెలిపారు. మూడు వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్‌కాస్టింగ్‌లో శిక్షణనిచ్చామని చెప్పారు. సమస్యాత్మకంగా గుర్తించిన మూడు వేల పోలింగ్ స్టేషన్లను వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామన్నారు. ఎన్నికల రోజున సినిమా థియేటర్లు, హోటళ్లు, మాల్స్ దుకాణాలకు సెలవు ప్రకటించాలని కార్మికశాఖకు లేఖ రాస్తామన్నారు. -
స్టార్ క్యాంపెయిన్
చివరి రోజు జోరు.. హోరు.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం ప్రచార ‘స్టార్లు’ నగరాన్ని చుట్టేశారు. టీఆర్ఎస్ తరఫున మంత్రి కేటీఆర్... బీజేపీ తరఫున ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి... ఎంఐఎం తరఫున ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ర్యాలీలు... పాదయాత్రలలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో రెండో అంకానికి ఆదివారంతో తెరపడింది. ఇరవై రోజుల పాటు వాడవాడలా.. ప్రతి ఇంటి తలుపును తట్టిన పార్టీల ప్రచార పర్వం ముగిసింది. చివరిరోజు కావడంతో అధికార పార్టీ మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యనాయకులు జోరు పెంచారు. బైక్ ర్యాలీలు, బహిరంగ సభలతో కాలనీలను హోరెత్తించారు. -
ఒపీనియన్... ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం
సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగనున్నందున ఓపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ వంటివి నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచార, ప్రసార మాధ్యమాలు ఇలాంటి వాటిని ప్రచారం... ప్రసారం చేయరాదని పేర్కొంది. ఇవి పోలింగ్‌పై ప్రభావం చూపనున్నందున నిషేధం విధించినట్టు పేర్కొంది. ఇంటర్నెట్, రేడియో, టీవీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ, శాటిలైట్, కేబుల్ చానెల్స్, మొబైల్, తదితర ఏ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానూ ప్రసారం చేయడానికి వీల్లేదు. ప్రింట్ మాధ్యమానికి సంబంధించి వార్తాపత్రిక, మేగజైన్, పీరియాడికల్, పోస్టర్, ప్లకార్డు, హ్యాండ్బిల్, ఇతరత్రా డాక్యుమెంట్ల రూపేణా ప్రచారం చేయకూడదు. వీటిని అతిక్రమించే వారికి రెండేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్రమంత్రులు ఓటరుగా, లేదా పోటీ చేస్తే అభ్యర్థిగా, అధీకృత ఏజెంటుగా తప్ప ఇతరత్రా అధికారంతో పోలింగ్ కేంద్రాల్లోకి కానీ, ఓటర్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రంలోకి కానీ వెళ్లేందుకు వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెక్యూరిటీ సదుపాయం ఉన్న మంత్రులు ఎన్నికల ఏజెంట్‌గా, పోలింగ్ ఏజెంట్‌గా, కౌంటింగ్ ఏజెంట్‌గా వ్యవహరించేందుకు వీల్లేదు. భద్ర తా సిబ్బందినీ కేంద్రాల్లోకి అనుమతించరు. -
11న గ్రేటర్ తొలి సర్వసభ్య సమావేశం
⇒ అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు.. త్వరలోనే జీవో జారీ ⇒ ఫిబ్రవరి 3న ఎన్నికల సిబ్బందికి ఆన్‌డ్యూటీ సౌకర్యం ⇒ గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్లో ‘నోటా’ ఆప్షన్ లేనట్లే సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాకముందే తదనంతర కార్యక్రమాలకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తదితర అంశాలపై గ్రేటర్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపిన దరిమిలా ఆ మేరకు జీవో కూడా జారీచేసేందుకు రంగం సిద్ధమైంది. 11న సర్వసభ్య సమావేశం జరిగే రోజునే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ పోలింగ్, 5న ఫలితాలు వెల్లడికానున్న సంగతి తెలిసిందే. పోల్‌కు మరుసటిరోజు ఆన్‌డ్యూటీ.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 2న జరగనుండగా.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆ మరుసటి సెలవు ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞాపనపై సైతం రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది ఆ మరుసటి రోజు విధులకు హాజరుకాకపోయిన ‘ఆన్‌డ్యూటీ’(ఓడీ)గా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం ఒకట్రేండు రోజుల్లో జారీ కానున్నాయి. నోటాకు నై.. ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే.. అభ్యర్థులందరినీ తిరస్కరించేందుకు జీహెచ్ఎంసీ ఓటర్లకు ‘నోటా’ హక్కు ఇక లేనట్లే. నోటా అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ లేఖ రాసింది. సాంకేతిక కారణాలతో ప్రస్తుత పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘నోటా’ అమలు సాధ్యం కాదని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. దీంతో నోటా అమలు లేనట్లేనని అధికారవర్గాలు తెలిపాయి. -
గెలిపిస్తే.. మెరిపిస్తాం
‘సాక్షి’ జన సభకు అపూర్వ స్పందన హామీలు గుప్పించిన అభ్యర్థులు ఎక్కడ చూసినా జీహెచ్ఎంసీ ఎన్నికల సందడే.. ప్రధాన రోడ్లతో పాటు గల్లీలూ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే నాయకులు కాలనీల్లో ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. వారి అభివృద్ధి హామీలేంటి? మంగళవారం కొత్తపేట బాబూజగ్జీవన్‌రామ్ భవనంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘గ్రేటర్ డిబేట్’ జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు, ఓటర్ల సమక్షంలో వాడీవేడిగా చర్చా కార్యక్రమం నిర్వహించారు. తమను గెలిపిస్తే డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అభ్యర్థులు హామీలు ఇచ్చారు. - దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్జోన్ బృందం గత పాలకుల నిర్లక్ష్యం వల్లే... గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మహా నగరం సమస్యల సుడిగుడంలో చిక్కుకుంది. నగరవాసులకు నరకాన్ని చూపిస్తోంది. విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అర్హులకు దశలవారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పింఛన్లు అందజేసేందుకు కృషిచేస్తా. - ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక సమస్యలపై అవగాహన ఉంది సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో సమస్యలపై అవగాహన ఉంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే తనను ఆదరించి సంపూర్ణ మెజార్టీతో గెలిపిస్తే మోడల్ డివిజన్‌గా అభివృద్ధి చేస్తాను. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. - ఆకుల అఖిల, టీడీపీ, సరూర్‌నగర్ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా సరూర్‌నగర్ డివిజన్లోని చాలా మురికివాడలున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో మురికి వాడలు అభివృద్ధికి నోచుకోలేదు. నేను గెలిస్తే మురికివాడలను అభివృద్ధి చేయిస్తా. ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి సిమెంట్ పోల్స్ వేయిస్తా. పార్కులను పచ్చగా తీర్చిదిద్దుతా. -పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి, టీఆర్ఎస్, సరూర్‌నగర్ టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం ఇరవై నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, గాలి మాటలు తప్ప హామీలేవీ నెరవేర్చలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంటూ కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే నగరం అభివృద్ధి చెంది పలు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. -ఎల్.నీరజకొండల్ రెడ్డి, కాంగ్రెస్ సరూర్‌నగర్ మురికివాడల సమస్యలు పరిష్కరిస్తా డివిజన్ పరిధిలో భగత్‌సింగ్, శంకర్‌నగర్ వంటి మురికివాడల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వాటన్నింటిని పరిష్కరించడంతోపాటు కబ్జాదారుల హస్తగతమైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తా. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. - అర్చన, సరూర్‌నగర్ స్వతంత్ర అభ్యర్థి కేసీఆర్‌ది మాటల గారడి పేదలకు ఇళ్లు కట్టిస్తా.. పింఛన్లు ఇస్తానని కేసీఆర్ నగర ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నాడు. క్షేత్రస్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదు. మురికివాడలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. నన్ను గెలిపిస్తే డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. - రాధ ధీరజ్‌రెడ్డి బీజేిపీ, అభ్యర్థి ఆర్కేపురం టీఆర్ఎస్కు ఓటమి తప్పదు దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని అధికారంలోకి రాకముందు ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌కు గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి తప్పదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పునాదే లేదు.. జనాన్ని మోసం చేస్తున్నారు. తనను గెలిపిస్తే భూ కబ్జాదార్లను తరిమికొట్టి పేదలకు న్యాయం చేస్తా. - ఉపేంద్ర యాదవ్, బీఎస్పీ అభ్యర్థి సమస్యలన్నీ పరిష్కరిస్తా ఎమ్మెల్యే సహకారంతో డివిజన్లోని మౌలిక సమస్యలను పరిష్కరిస్తా. కాలనీ అంతర్గత రహదారులకు మరమ్మతులు చేయిస్తా. డివిజన్లో లోతట్టు ప్రాంతాలను మురుగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. శాశ్వత ప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తా. ఓపెన్, అండర్ నాలాల విస్తరణ పనులను చేపడతా. -తీగల అనితారెడ్డి, ఆర్కెపురం, టీఆర్ఎస్ హామీలు తూచా తప్పక నెరవేరుస్తాం గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. గత సాధారాణ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నాం. జీహెచ్ఎంసీ నిధులను నగరం అభివృద్ధికే ఖర్చు చేస్తాం. మమ్మల్ని నమ్మి ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాం. - ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించారు గతంలో పాలకులు హైదరాబాద్ నగర అభివృద్ధిని విస్మరించారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వన్ హైదరాబాద్ కూటమని ఏర్పాటు చేసి అభ్యర్థులను పోటీలో నిలిపాం. వారిని ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాం. - మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ముంపు సమస్యను పరిష్కరిస్తా గడ్డిఅన్నారం డివిజన్లో పలు లోతట్టు ప్రాంతాలను మురుగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. శాశ్వత ప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తా. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తా. ఓపెన్, అండర్ నాలాల విస్తరణ పనులను చేపడతా. - తులసీ శ్రీనివాస్, గడ్డిఅన్నారం కాంగ్రెస్ అభ్యర్థి మురికి వాడలను అభివృద్ధి చేస్తా చంపాపేట డివిజన్లో 62 కాలనీలకు గాను 18 నోటిఫైడ్ మురికివాడలున్నాయి. గత పాల కుల నిర్లక్ష్యంతో మురికి వాడలు అభివృద్ధికి నోచుకోలేదు. నేను మురికివాడలను అభివృద్ధి చేయిస్తా. జీహెచ్ఎంసీ నిధులను ప్రస్తుత పాలకులు ఇతర సంస్థలకు కేటాయిస్తున్నారు. - వంగా మధుసూదన్‌రెడ్డి, బీజేపీ, చంపాపేట అందరికీ పింఛన్లు అందేలా.. నేను విజయం సాధిస్తే అర్హులందరికి పింఛన్లు అందేటట్లు చేస్తా. హస్తినాపురం డివిజన్లో ప్రధానంగా డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. ట్రంక్‌లైన్ నిర్మిస్తే తప్ప డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటా. - సత్యవతి, బీజేపీ, హస్తినాపురం అభ్యర్థి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ పేదలందరికి ఇళ్లు కట్టిస్తానని, పింఛన్లు ఇస్తానని కేసీఆర్ నగర ప్రజలను మోసం చేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నాడు. క్షేత్ర స్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదు. అధికారులపై పోట్లాడి నిధులు సాధిస్తా. -పాల్వాయి వేణు, బీఎస్పీ అభ్యర్థి, హయత్‌నగర్ కబ్జాభూములను జీహెచ్ఎంసీకి అప్పగిస్తా మన్సూరాబాద్ డివిజన్లో ఖాళీ స్థలాలు చాలా వరకు చోటామోటా నాయకుల కబంధహస్తాలలో ఇరుక్కున్నాయి. నేను విజయం సాధిం చిన వెంటనే వాటన్నింటిని స్వాధీనపరచుకొని జీహెచ్ఎంసీకి అప్పగించడంతోపాటు మన్సూరాబాద్ నుంచి వీరన్నగుట్ట వరకు రహదారిని వేయిస్తా. - పిడికిలి రాజు, మన్సూరాబాద్ బీఎస్పీ అభ్యర్థి స్థలాలను కబ్జా నుంచి విడిపిస్తా మన్సూరాబాద్ డివిజన్లో ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాకు గురయ్యాయి. గత ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. తాను కార్పొరేటర్‌గా గెలిచిన వెంటనే కాపాడేందుకు కృషి చేస్తా. - అంజయ్య, వన్ హైదరాబాద్ కూటమి అభ్యర్థి మన్సూరాబాద్ -
ఇదీ హద్దు...దాటవద్దు!
► అభ్యర్థులూ... ఇవి మరువద్దు ► నిఘా ముమ్మరం చేసిన సర్వైలెన్స్ టీమ్స్ ► ఏమాత్రం ‘కట్టు తప్పినా’ తిప్పలు తప్పవు సిటీబ్యూరో: ‘గ్రేటర్’లో వచ్చే నెల 2న జరుగనున్న ‘ఫైట్’కు ప్రచా రం ఊపందుకుంది. ఈ హడావుడి... ‘సీటు’ కోసం పడే పాట్లలో పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించకూడదు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ ఉండ దు. ఎన్నికల ఘట్టాన్ని సజావుగా పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేస్తుంది. వీటి అమలుకు పోలీసులు పక్కా చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు, కార్యక ర్తలు వీటిని కచ్చితంగా పాటించాల్సిందే. అలా చేయ ని వారిని గుర్తించ డానికే పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన సర్వైలెన్స్ టీమ్స్, స్వ్కాడ్స్ డేగ కన్ను వేశాయి. ఏమాత్రం ఉల్లంఘన కనిపించినా...భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో పోలీసులు సూచిస్తున్నారు. నగరంలోని ఏ ప్రాంతంలోనైనా సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలంటే నిర్ణీత సమయం ముందు స్థానిక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలి. ప్రదర్శనలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, రోడ్‌షోల కు అనుమతి పొందే సమయంలో అవి ప్రారంభమయ్యే ప్రాంతం, సమయం, ప్రయాణించే మార్గం, సమయం, సాగే దారి వివరాలు స్పష్టం గా తెలియజేయాలి. దీనికిఅనుగుణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. ప్రదర్శనసమయంలో ట్రాఫిక్‌కు ఏమాత్రం అంతరా యం కలగకుండా రోడ్డుకు ఓ పక్కగా మాత్రమే వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు నిబంధనలు అతిక్రమించి ఇబ్బందులు కలిగిస్తే.. కార్యక్రమానికి అనుమతి తీసుకున్న వ్యక్తే బాధ్యత వహించాలి.ఎన్నికల నియమావళి ప్రకారం కాన్వాయ్‌లో అత్యధికంగా మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది ద్విచక్ర వాహనమైనా... భారీ వాహనమైనా ఒకేలా పరిగణిస్తారు. కార్యకర్తలు, అభిమానులు ద్విచక్ర వాహనాలకు జెండాలు కట్టుకుని వెళ్లినా దాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. నామినేషన్లు, ప్రచార సమయంలో బల ప్రదర్శన కోసం జన సమీకరణ చేసినా... వారికి ధనం, మద్యం పంపిణీ చేసినా చర్యలు తప్పవు. ప్రచారానికి వినియోగించే లౌడ్ స్పీకర్లు, మైకులకు స్థానిక పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఏ వాహనాన్ని ప్రచారానికి వినియోగించదలిచారో ఆ నెంబరు కచ్చితంగా చెప్పాలి. వాహనాల్లో అక్రమంగా ఆయుధాలు, విస్ఫోటన పదార్థాలు, కరెన్సీ, మద్యం సరఫరా చేస్తుంటే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహన చోదకుడు, యజమానిని అరెస్టు చేస్తారు. ప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేయకూడదు. మిగిలిన ప్రదేశాల్లోనూ ఇతరులకు ఇబ్బంది కలిగించని స్థాయిలోనే మైకుల వినియోగానికిఅనుమతిస్తారు. సెక్షన్లు... నేరాలు... ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద కేసులు నమోదు చేస్తారు. ఐపీసీ 171 ప్రకారం... ► సెక్షన్ 171బి- ఓటర్లకు నగదుతో ప్రలోభ పెట్టడం. ► సెక్షన్ 171సి-ఓటర్లను వివిధ రకాలుగా ప్రభావితం చేయడం. సెక్షన్ 171డి-దొంగ ఓట్లు వేయడం. ► సెక్షన్ 171ఐ-ఎన్నికల వ్యయ నివేదికలను సకాలంలో అధికారులకు సమర్పించకపోవడం. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరాలివీ... ► సెక్షన్ 123- ఓటర్లకు లంచం ఇవ్వజూపడం, ప్రలోభాలకు లోను చేయడం, కుల, మత, వర్గ, భాషాపరమైన, మతపరమైన జెండాలను చూపించి ఓట్లు అడగటం. ► సెక్షన్ 125- ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు పెంచడం. ► సెక్షన్ 126- నిషేధిత సమయాల్లో బహిరంగ సభలు నిర్వహించడం. ► సెక్షన్ 127- ఎన్నికల సమావేశాలకు ఆటంకం కలిగించడం. ► సెక్షన్ 127(ఎ)- పోస్టర్లు, కరపత్రాల ముద్రణ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించకపోవడం. ► సెక్షన్ 128- రహస్య ఓటింగ్ హక్కుకు భంగం కలిగించడం. ► సెక్షన్ 130- పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధిత ప్రాంతంలో ప్రచారం చేయడం. ► సెక్షన్ 131- పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలను ఉల్లంఘించడం. ► సెక్షన్ 132- పోలింగ్ కేంద్రాల వద్ద అనైతికంగా ప్రవర్తించడం. ► సెక్షన్ 133- ఎన్నికల ప్రక్రియలో అక్రమంగా వాహనాలను వినియోగించడం. ► సెక్షన్ 134(బి)- పోలింగ్ కేంద్రం చుట్టూ అక్రమంగా సంచరించడం. ► సెక్షన్ 135(ఎ)- పోలింగ్ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్. ► సెక్షన్ 136- ఎన్నికల సిబ్బందికి సంబంధించిన అధికారిక, పోలింగ్ సాధనాలను ధ్వంసం చేయడం. -
జూ.ఎన్టీఆర్ పేరెత్తినందుకు పార్టీ నుంచి సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలను సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం నాయకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, పార్టీ తెలంగాణ నేతలు సీట్లు అమ్ముకున్నారని నగర టీడీపీ నాయకుడు నైషధం సత్యనారాయణ మూర్తి బుధవారం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీని బతికించాలంటే జూ.ఎన్టీఆర్‌కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో నైషధం వ్యవహారశైలిని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. జూనియర్ ఎన్టీఆర్‌కు బాధ్యతలు కట్టబెట్టమని డిమాండ్ చేసిన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నగర అధ్యక్షుడు, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రకటించారు. నైషధం సత్యనారాయణ మూర్తి రాంనగర్ డివిజన్ నుంచి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల పేరుతో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని, ఆయన భార్య అడిక్‌మెట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారని, దీనిని క్రమశిక్షణా చర్యగా పరిగణిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడికి సస్పెండ్ చేసే హక్కు ఎక్కడిది? పార్టీ సీనియర్ నాయకుడినైన తనను సస్పెండ్ చేసే హక్కు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు ఎక్కడిదని నైషధం సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు వచ్చిన ఆయన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో వాగ్వివాదానికి దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగానీ, క్రమశిక్షణా సంఘం చైర్మన్ గానీ తీసుకోవలసిన సస్పెన్షన్ నిర్ణయాన్ని గోపీనాథ్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, రాజీనామా లేఖను ఎన్టీఆర్ విగ్రహంకు సమర్పించారు. -
ప్రతి సెలూన్ టీఆర్ఎస్ కార్యాలయం కావాలి
దోమలగూడ: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని, తమ పాలనలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చామని నాయీ బ్రహ్మణుల సెలూన్లకు విద్యుత్ బిల్లులను డొమెస్టిక్‌కు మార్చుతూ జీవో జారీ చేశామని, గ్రేటర్‌లోని ప్రతి సెలూన్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం చిక్కడపల్లిలోని నాయీ బ్రహ్మణ కళ్యాణ మండపంలో నాయీ బ్రహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రసాధన ఉద్యమంలో నాయీ బ్రహ్మణులు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రాంతాలుగా విడి పోయి ప్రజలుగా కలిసి ఉన్నామన్నా రు. తమది స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ కాదని, ప్రాం తీయ పరంగా ఎవరిపై వివక్ష చూపడం లేదన్నారు. బీసీలందరికీ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామన్నారు. నాయీ బ్రహ్మణులకు గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన రెండు సీట్లను గెలిపించుకోవడంతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు తమ వంతు కృషి చేయాలని కోరారు. నాయిని నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ నాయీ బ్రహ్మణులకు మంచి రోజులు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం వారి వెంట ఉంటుందన్నారు. ప్రస్తుత కల్యాణ మండపం స్థానంలో అత్యాధునిక కల్యాణ మండపాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి తల సాని మాట్లాడుతూ పేదల ఆకలి తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టమన్నారు.నాయీ బ్రహ్మణులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. డిప్యూటీ స్పీకరు పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నోయేళ్లుగా పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తూ బంగారు తెలంగాణకు బాటల వేస్తున్న కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, నాయీ బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్‌రావు నాయీ, నాయకులు సూర్యనారాయణ, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.