11న గ్రేటర్ తొలి సర్వసభ్య సమావేశం
⇒ అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు.. త్వరలోనే జీవో జారీ
⇒ ఫిబ్రవరి 3న ఎన్నికల సిబ్బందికి ఆన్‌డ్యూటీ సౌకర్యం
⇒ గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్లో ‘నోటా’ ఆప్షన్ లేనట్లే
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాకముందే తదనంతర కార్యక్రమాలకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తదితర అంశాలపై గ్రేటర్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపిన దరిమిలా ఆ మేరకు జీవో కూడా జారీచేసేందుకు రంగం సిద్ధమైంది. 11న సర్వసభ్య సమావేశం జరిగే రోజునే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎంసీ పోలింగ్, 5న ఫలితాలు వెల్లడికానున్న సంగతి తెలిసిందే.
పోల్‌కు మరుసటిరోజు ఆన్‌డ్యూటీ..
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 2న జరగనుండగా.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆ మరుసటి సెలవు ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞాపనపై సైతం రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది ఆ మరుసటి రోజు విధులకు హాజరుకాకపోయిన ‘ఆన్‌డ్యూటీ’(ఓడీ)గా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం ఒకట్రేండు రోజుల్లో జారీ కానున్నాయి.
నోటాకు నై..
ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే.. అభ్యర్థులందరినీ తిరస్కరించేందుకు జీహెచ్‌ఎంసీ ఓటర్లకు ‘నోటా’ హక్కు ఇక లేనట్లే. నోటా అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ లేఖ రాసింది. సాంకేతిక కారణాలతో ప్రస్తుత పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘నోటా’ అమలు సాధ్యం కాదని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. దీంతో నోటా అమలు లేనట్లేనని అధికారవర్గాలు తెలిపాయి.