ప్రతి సెలూన్ టీఆర్‌ఎస్ కార్యాలయం కావాలి
దోమలగూడ: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని, తమ పాలనలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చామని నాయీ బ్రహ్మణుల సెలూన్లకు విద్యుత్ బిల్లులను డొమెస్టిక్‌కు మార్చుతూ జీవో జారీ చేశామని, గ్రేటర్‌లోని ప్రతి సెలూన్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం చిక్కడపల్లిలోని నాయీ బ్రహ్మణ కళ్యాణ మండపంలో నాయీ బ్రహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రసాధన ఉద్యమంలో నాయీ బ్రహ్మణులు కీలక పాత్ర పోషించారన్నారు.
ప్రాంతాలుగా విడి పోయి ప్రజలుగా కలిసి ఉన్నామన్నా రు. తమది స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ కాదని, ప్రాం తీయ పరంగా ఎవరిపై వివక్ష చూపడం లేదన్నారు. బీసీలందరికీ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామన్నారు. నాయీ బ్రహ్మణులకు గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన రెండు సీట్లను గెలిపించుకోవడంతో పాటు టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు తమ వంతు కృషి చేయాలని కోరారు. నాయిని నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ నాయీ బ్రహ్మణులకు మంచి రోజులు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం వారి వెంట ఉంటుందన్నారు. ప్రస్తుత కల్యాణ మండపం స్థానంలో అత్యాధునిక కల్యాణ మండపాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి తల సాని మాట్లాడుతూ పేదల ఆకలి తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టమన్నారు.నాయీ బ్రహ్మణులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. డిప్యూటీ స్పీకరు పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నోయేళ్లుగా పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తూ బంగారు తెలంగాణకు బాటల వేస్తున్న కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, నాయీ బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్‌రావు నాయీ, నాయకులు సూర్యనారాయణ, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.