గెలిపిస్తే.. మెరిపిస్తాం
‘సాక్షి’ జన సభకు అపూర్వ స్పందన హామీలు గుప్పించిన అభ్యర్థులు
ఎక్కడ చూసినా జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందడే.. ప్రధాన రోడ్లతో పాటు గల్లీలూ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే నాయకులు కాలనీల్లో ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. వారి అభివృద్ధి హామీలేంటి? మంగళవారం కొత్తపేట బాబూజగ్జీవన్‌రామ్ భవనంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘గ్రేటర్ డిబేట్’ జరిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు, ఓటర్ల సమక్షంలో వాడీవేడిగా చర్చా కార్యక్రమం నిర్వహించారు. తమను గెలిపిస్తే డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అభ్యర్థులు హామీలు ఇచ్చారు.
- దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్‌జోన్ బృందం
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే...
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మహా నగరం సమస్యల సుడిగుడంలో చిక్కుకుంది. నగరవాసులకు నరకాన్ని చూపిస్తోంది. విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అర్హులకు దశలవారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పింఛన్లు అందజేసేందుకు కృషిచేస్తా.
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
స్థానిక సమస్యలపై అవగాహన ఉంది
సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో సమస్యలపై అవగాహన ఉంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే తనను ఆదరించి సంపూర్ణ మెజార్టీతో గెలిపిస్తే మోడల్ డివిజన్‌గా అభివృద్ధి చేస్తాను. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.
- ఆకుల అఖిల, టీడీపీ, సరూర్‌నగర్
ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
సరూర్‌నగర్ డివిజన్‌లోని చాలా మురికివాడలున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో మురికి వాడలు అభివృద్ధికి నోచుకోలేదు. నేను గెలిస్తే మురికివాడలను అభివృద్ధి చేయిస్తా. ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి సిమెంట్ పోల్స్ వేయిస్తా. పార్కులను పచ్చగా తీర్చిదిద్దుతా.
-పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్, సరూర్‌నగర్
టీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం
ఇరవై నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, గాలి మాటలు తప్ప హామీలేవీ నెరవేర్చలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంటూ కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే నగరం అభివృద్ధి చెంది పలు సంక్షేమ పథకాలు అమలయ్యాయి.
-ఎల్.నీరజకొండల్ రెడ్డి, కాంగ్రెస్ సరూర్‌నగర్
మురికివాడల సమస్యలు పరిష్కరిస్తా
డివిజన్ పరిధిలో భగత్‌సింగ్, శంకర్‌నగర్ వంటి మురికివాడల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వాటన్నింటిని పరిష్కరించడంతోపాటు కబ్జాదారుల హస్తగతమైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తా. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా.
- అర్చన, సరూర్‌నగర్ స్వతంత్ర అభ్యర్థి
కేసీఆర్‌ది మాటల గారడి
పేదలకు ఇళ్లు కట్టిస్తా.. పింఛన్లు ఇస్తానని కేసీఆర్ నగర ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నాడు. క్షేత్రస్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదు. మురికివాడలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. నన్ను గెలిపిస్తే డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.
- రాధ ధీరజ్‌రెడ్డి బీజేిపీ, అభ్యర్థి ఆర్‌కేపురం
టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు
దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని అధికారంలోకి రాకముందు ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌కు గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి తప్పదు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు పునాదే లేదు.. జనాన్ని మోసం చేస్తున్నారు. తనను గెలిపిస్తే భూ కబ్జాదార్లను తరిమికొట్టి పేదలకు న్యాయం చేస్తా.
- ఉపేంద్ర యాదవ్, బీఎస్‌పీ అభ్యర్థి
సమస్యలన్నీ పరిష్కరిస్తా
ఎమ్మెల్యే సహకారంతో డివిజన్‌లోని మౌలిక సమస్యలను పరిష్కరిస్తా. కాలనీ అంతర్గత రహదారులకు మరమ్మతులు చేయిస్తా. డివిజన్‌లో లోతట్టు ప్రాంతాలను మురుగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. శాశ్వత ప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తా. ఓపెన్, అండర్ నాలాల విస్తరణ పనులను చేపడతా.
-తీగల అనితారెడ్డి, ఆర్‌కెపురం, టీఆర్‌ఎస్
హామీలు తూచా తప్పక నెరవేరుస్తాం
గ్రేటర్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. గత సాధారాణ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నాం. జీహెచ్‌ఎంసీ నిధులను నగరం అభివృద్ధికే ఖర్చు చేస్తాం. మమ్మల్ని నమ్మి ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారని ఆశిస్తున్నాం.
- ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించారు
గతంలో పాలకులు హైదరాబాద్ నగర అభివృద్ధిని విస్మరించారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వన్ హైదరాబాద్ కూటమని ఏర్పాటు చేసి అభ్యర్థులను పోటీలో నిలిపాం. వారిని ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాం.
- మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
ముంపు సమస్యను పరిష్కరిస్తా
గడ్డిఅన్నారం డివిజన్‌లో పలు లోతట్టు ప్రాంతాలను మురుగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. శాశ్వత ప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తా. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తా. ఓపెన్, అండర్ నాలాల విస్తరణ పనులను చేపడతా.
- తులసీ శ్రీనివాస్, గడ్డిఅన్నారం కాంగ్రెస్ అభ్యర్థి
మురికి వాడలను అభివృద్ధి చేస్తా
చంపాపేట డివిజన్‌లో 62 కాలనీలకు గాను 18 నోటిఫైడ్ మురికివాడలున్నాయి. గత పాల కుల నిర్లక్ష్యంతో మురికి వాడలు అభివృద్ధికి నోచుకోలేదు. నేను మురికివాడలను అభివృద్ధి చేయిస్తా. జీహెచ్‌ఎంసీ నిధులను ప్రస్తుత పాలకులు ఇతర సంస్థలకు కేటాయిస్తున్నారు.
- వంగా మధుసూదన్‌రెడ్డి, బీజేపీ, చంపాపేట
అందరికీ పింఛన్లు అందేలా..
నేను విజయం సాధిస్తే అర్హులందరికి పింఛన్లు అందేటట్లు చేస్తా. హస్తినాపురం డివిజన్‌లో ప్రధానంగా డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. ట్రంక్‌లైన్ నిర్మిస్తే తప్ప డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటా.
- సత్యవతి, బీజేపీ, హస్తినాపురం అభ్యర్థి
ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
పేదలందరికి ఇళ్లు కట్టిస్తానని, పింఛన్లు ఇస్తానని కేసీఆర్ నగర ప్రజలను మోసం చేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నాడు. క్షేత్ర స్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదు. అధికారులపై పోట్లాడి నిధులు సాధిస్తా.
-పాల్వాయి వేణు, బీఎస్‌పీ అభ్యర్థి, హయత్‌నగర్
కబ్జాభూములను జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తా
మన్సూరాబాద్ డివిజన్‌లో ఖాళీ స్థలాలు చాలా వరకు చోటామోటా నాయకుల కబంధహస్తాలలో ఇరుక్కున్నాయి. నేను విజయం సాధిం చిన వెంటనే వాటన్నింటిని స్వాధీనపరచుకొని జీహెచ్‌ఎంసీకి అప్పగించడంతోపాటు మన్సూరాబాద్ నుంచి వీరన్నగుట్ట వరకు రహదారిని వేయిస్తా.
- పిడికిలి రాజు, మన్సూరాబాద్ బీఎస్‌పీ అభ్యర్థి
స్థలాలను కబ్జా నుంచి విడిపిస్తా
మన్సూరాబాద్ డివిజన్‌లో ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాకు గురయ్యాయి. గత ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. తాను కార్పొరేటర్‌గా గెలిచిన వెంటనే కాపాడేందుకు కృషి చేస్తా.
- అంజయ్య, వన్ హైదరాబాద్ కూటమి అభ్యర్థి మన్సూరాబాద్