సాక్షి, హైదరాబాద్: సోమవారం కార్తికేయ నగర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. కొనేళ్లుగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడంతో ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో నోటాకే ఓటు వేయాలని కార్తికేయ కాలనీ వాసులు నిర్ణయించుకున్నారు. దీంతో వారు ‘మా ఓటు నోటాకే’ అని బ్యానర్‌లతో రాజకీయ నాయకులకు స్వాగతం పలికారు.
కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలోని కార్తికేయ కాలని లో 33 ఎకరాల కాలనీ స్థలంలో ప్రజల కోసం ఒక్క ఉద్యానవనం కూడా లేదు. కొంత కాలంగా నీటి పైపులైన్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయనప్పటికీ ఎటువంటి మరమ్మతులకీ నోచుకోలేదు. కాలనీలో కొన్ని రహదారులు గుంతలమయంగా మారినా పట్టించుకున్నవారే లేరు. అందుకే నాయకుల్లో మార్పు కోసమే ఈ ఎన్నికల్లో నోటాకు ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేస్తామని కాలనీవాసులు తెలిపారు.
రెండు రోజుల క్రితం మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఇటువంటి పరిస్థితే ఎదురైన సంగతి తెలిసిందే. యాప్రాల్ (మేడ్చల్ జిల్లా) లోని ప్రకృతి విహార్ లో ప్రచారం కోసం వెళ్లగా అక్కడి ప్రజలు ఓట్లు కోరే ముందు నాయకులు రోడ్లు చూడాలని హనుమంత రావుతో అన్నారు.
స్థానికుల వేడిని తట్టుకోలేక డిసెంబర్ 1 తర్వాత రహదారి నిర్మాణాన్ని చేపడుతామని హామి ఇచ్చాకే వారు ఎమ్మెల్యేను ప్రచారానికి వెళ్లనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment