గ్రేటర్‌లో సైకిల్ పంక్చర్..! | Cycle puncture in the Greater ..! | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో సైకిల్ పంక్చర్..!

Published Wed, Feb 3 2016 1:15 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

గ్రేటర్‌లో సైకిల్ పంక్చర్..! - Sakshi

గ్రేటర్‌లో సైకిల్ పంక్చర్..!

♦ కొన్ని డివిజన్లలో టీడీపీకి ఏజెంట్లు కూడా లేని వైనం
♦ గడిచిన అసెంబ్లీ ఎన్నికల తో పోలిస్తే పరిస్థితి ఘోరం
♦ సింగిల్ డిజిట్ దాటితే గొప్ప అంటున్న పార్టీ నేతలు
♦ కొన్నింటిలోనే గట్టి పోటీ ఇవ్వగలిగిన టీడీపీ
♦ పోలింగ్ సరళిని చూసి విస్తుబోయిన తమ్ముళ్లు
♦ సవాళ్లు విసిరినా కార్యక్షేత్రంలో నీరుగారిన శ్రేణులు
 
 సాక్షి, హైదరాబాద్: పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఇదేనేమో! ఏడాదిన్నర క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో బలం చాటిన తెలుగుదేశం పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కుదేలైంది. నాడు గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిదింట జయకేతనం ఎగరేసిన టీడీపీ.. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో సైతం దయనీయ స్థితిని ఎదుర్కొంది. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పెట్టండి- మా సత్తా ఏంటో చూపిస్తాం’ అని సవాళ్లు విసిరిన తెలుగు తమ్ముళ్లు తీరా కార్యక్షేత్రంలో నీరుగారి పోయారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హడావుడిగా రెండు రోజులు రోడ్‌షోలు, ఓ రోజు విలేకరుల సమావేశం నిర్వహించి ‘నేను చేసిన అభివృద్ధిని చూసి టీడీపీకి ఓటేయాల’ని వేడుకున్నా గ్రేటర్ ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదని ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.

చంద్రబాబు, లోకేశ్ పర్యటించిన డివిజన్లలో ఎన్ని గెలుస్తామనే విషయంలో కూడా టీడీపీ నాయకులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ అంచనాలను కూడా అందుకోలేక పోయిందని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నాయకులంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో మొదలైన టీడీపీ పతనం ఆ పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న బూత్, డివిజన్ స్థాయి కార్యకర్తలు గులాబీ గూటిని ఆశ్రయించడంతో పరిపూర్ణమైనట్లు అంచనావేస్తున్నారు. దీంతో కొన్ని పోలింగ్ బూత్‌లలో టీడీపీకి ఏజెంట్లు కూడా లేనిపరిస్థితి. తెలంగాణ భావజాలం ఉన్న ఓటర్లతో పాటు సెటిలర్లు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ మాటలను విశ్వసించి ఓట్లు వేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 టీడీపీకి చుక్కలు చూపించిన శివార్లు
 2014 సార్వత్రిక ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కంటోన్మెంట్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మహేశ్వరం, ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పరిణామాల్లో జూబ్లీహిల్ ్స, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్‌బీ నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో మిగిలారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య టీడీపీలో ఉన్నా, లేకున్నా ఒకటే. ఆయన రాజకీయ బాధ్యతలను సామ రంగారెడ్డికి అప్పగించి తప్పించుకున్నారు.

ఈ నేపథ్యంలో శివార్లపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్.. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో పాటు సీమాంధ్రుల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేసింది. టీడీ పీకి బలమున్న కూకట్‌పల్లి, మహేశ్వరం, సనత్‌నగర్‌లతో పాటు ఆపార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి వంటి నియోజకవర్గాల్లో కూడా టీ డీపీ ఓటు బ్యాంకు టీఆర్‌ఎస్ వైపు బదిలీ అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. అదీగాక, వివిధ పార్టీల్లో నాయకులుగా ఉన్న సెటిలర్లను తమ పార్టీలోకి తీసుకొని ఆయా డివిజన్‌లలో వారికే టీఆర్‌ఎస్ టికెట్లు కేటాయించింది. బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయిన డివిజన్లలోని బలమైన నాయకులకు టీఆర్‌ఎస్ టికెట్లు ఇవ్వడం కూడా టీడీపీకే నష్టం కలిగించింది.

అలాగే గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 45 డివిజన్లలో సుమారు 30 డివిజన్ల మాజీ కార్పొరే టర్లు టీఆర్‌ఎస్ గూటికి చేరి, స్థానికంగా తమ బలానికి, తెలంగాణ సెంటిమెంట్‌ను జోడించి సఫలమైనట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అలాగే టీడీపీకి కేటాయించిన డివిజన్లలో బీజేపీ శ్రేణులు మనస్ఫూర్తిగా పనిచేయలేదని తెలుస్తోంది. 12 నుంచి 15 డివిజన్‌లలో రెండు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండటం కూడా అధికార పార్టీకి లాభించగా, టీడీపీ దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం తరువాత మూడోస్థానంలో నిలుస్తామని చెప్పుకున్న టీడీపీ నాయకుల నోటి వెంట ఇప్పుడు మాట పెగలడం లేదు. ఫలితాల తరువాత మాట్లాడతామని ఓ నేత చెబుతుండగా, సింగిల్ డిజిట్ దాటేందుకూ కాంగ్రెస్‌తో పోటీ పడే పరిస్థితి నెలకొందని మరో నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement