కుండపోత
రహదారులు జలమయం
ఇళ్లలోకి వర్షపు నీరు
కుత్బుల్లాపూర్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం
సిటీబ్యూరో: రుతు పవనాల ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. షాపూర్ నగర్‌లో 1.9 సెంటీమీటర్లు, జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం వద్ద 1.8 సెంటీమీటర్లు, జీడిమెట్లలో 1.7, చిలకలగూడలో 1.6, ఆసిఫ్‌నగర్‌లో 1.3, ఉప్పల్‌లో 1.3, ఫీవర్ ఆస్పత్రి వద్ద 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో వివిధ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరదనీరు ప్రవహించింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, సచివాలయం, నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, మలక్‌పేట్‌లోని ప్రధాన, లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం క లిగింది. కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొని ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. లోతట్టు కాలనీలు, బస్తీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో నీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరునుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.
మోకాలి లోతున నీరు...
ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లైబ్రరీ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వాస్పత్రి ముందు మోకాలి లోతున వర్షం నీరు నిలిచింది. పాదచారులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. వర్షం పడిన ప్రతిసారీ ఇక్కడ వరదనీటితో ఇదే పరిస్థితి ఎదురవుతోందని... అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రాణాలతో చెలగాటం
కుత్బుల్లాపూర్: భారీ వర్షంతో కుత్బుల్లాపూర్ ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. నర్సాఫూర్ రాష్ట్ర రహదారిలో వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతోంది. జీడిమెట్ల డివిజన్ ప్రసూనగర్ కోదండ రామాలయం వెనుకనున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వర్షం పడితే మోకాళ్ల లోతు నీరు చేరుతుంది. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మంగళవారం భారీ వర్షంతో ఆ ప్రాంతంలో నీరు చేరి ప్రమాదభరితంగా ఉన్నప్పటికీ వాహనదారులు రాకపోకలు సాగించాల్సి వచ్చింది. అదే విధంగా వేంకటేశ్వర నగర్‌లోని ఓపెన్ నాలా మధ్యలో శ్లాబ్‌ను పగుల గొట్టి ఏడాది గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదు. వర్షం పడే సమయంలో నీరంతా రోడ్డు పైకి చేరడంతో స్థానికులు నడిచేందుకు దారి లేక ఆ గొయ్యి పక్క నుంచే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే ప్రాంతంలో 2010లో కురిసిన భారీ వర్షాలకు ఓ ఉపాధ్యాయుడు నాలాలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయినా అధికారులు మాత్రం మారడం లేదు.