Power transformer
-
తప్పిన పెను ప్రమాదం
కీసర: ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొడుతూ వెళ్లి ముందున్న చెట్టు కు ఢీకొని నిలిచిపోయింది. విప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. చీర్యాల చౌరస్తాలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు రోజు మాదిరిగానే కీసర, కీసరదాయర, రాంపల్లి దాయర, గోధుమకుంట, కుందన్పల్లిల నుంచిద్యార్థులను తీసుకుని వస్తోంది. ఈక్రమంలో కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో ఎదురుగా వచి్చన కారును తప్పించడానికి డ్రైవర్ బస్సును పక్కకు తిప్పాడు. వేగంతో బస్సు అదుపు తప్పి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని కొట్టింది. స్తంభం విరిగి కింద పడిపోయింది. ఆ ధాటికి మరో రెండు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. కరెంటు తీగలు బస్సుపై పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సు అదే వేగంతో చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. కాగా.. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బస్సు ఢీకొని ఉంటే పెను ప్రమాదమే సంభవించేది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ రాజు బస్సును అక్కడే వదిలేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్థానికంగా ఉన్న ప్రజలు, అటుగా వెళ్తున్న వాహనదారులు విద్యార్థులను బస్సులోంచి బయటకు దింపారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను వాహనాల్లో ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
కబళించిన కరెంటు తీగ
దండేపల్లి (మంచిర్యాల): ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ బలయ్యాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైపోయింది. మంగళవారం మేదరిపేటకు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26)ను పిలిచారు. ట్రాన్స్ఫార్మర్పై నుంచి రెండు విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి. లక్ష్మణ్ కిందనున్న లైన్‌కు మరమ్మతులు చేస్తూ.. ప్రమాదవశాత్తు పైనున్న 11కేవీ విద్యుత్ తీగలను తాకాడు. ఆ సమయంలో పైలైన్‌కు విద్యుత్ సరఫరా ఆపలేదని, దీనివల్లే లక్ష్మణ్ బలైపోయాడని స్థానికులు ఆరోపించారు. ఘటన స్థలానికి వచ్చిన ట్రాన్స్‌కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ లింగాపూర్ వద్ద రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మృతుని కుటుంబానికి పరిహారం అందిస్తామని ట్రాన్స్‌కో అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే
వాషింగ్టన్: ఎన్నికల్లో ఓడిపోయినా ఆ విషయాన్ని అంగీకరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇబ్బందికరమేనని కొత్త అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ తెలిపారు. అధ్యక్షుడిగా ట్రంప్ తప్పుడు సంకేతాలు పంపుతున్నారని పునరుద్ఘాటించారు. అధికార మార్పిడికి సంబంధించిన తన ప్రణాళికలకు అడ్డంకులేవీ రాలేదని, ప్రపంచదేశాల నేతలతో మాటాలు కలపడం మొదలుపెట్టానని బైడెన్ డెలవేర్‌లోని విల్మింగ్టన్లో చెప్పారు. అధికార మార్పిడి ప్రక్రియను మొదలుపెట్టేందకు ట్రంప్ యంత్రాంగం నిరాకరించినా నిష్ప్రయోజనమని, తాము చేయాల్సింది చేస్తామని స్పష్టం చేశారు. జనవరి 20వ తేదీకి అన్నీ సక్రమంగానే పూర్తవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆరు దేశాల నేతలు తనకు ఫోన్ చేశారని, యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల వారు ఇందులో ఉన్నారని చెప్పారు. బైడెన్ బృందంలో 20 మంది... ప్రస్తుత ట్రంప్ నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ విభాగాల సమీక్ష కోసం బైడెన్ ఏర్పాటు చేసిన సమీక్ష బృందాల్లో 20 మందికిపైగా భారతీయ అమెరికన్లున్నారు. వీరిలో ముగ్గురు ఆయా బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు. అధ్యక్ష మార్పిడి సాఫీగా జరిగేందుకు ఈ సమీక్ష బృందాలు ఉపయోగపడతాయని అంచనా. అమెరికా చరిత్రలో ఇంత వైవిధ్యతతో కూడిన సమీక్ష బృందం ఏదీ లేదని బైడెన్ వర్గం తెలిపింది. ఈ బృందాల్లో సగం మంది మహిళలు. సుమారు 40 శాతం మంది చారిత్రకంగా కేంద్ర ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు చెందిన వారు. విద్యుత్తు పరమైన అంశాల సమీక్షకు ఏర్పాటు చేసిన బృందానికి స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన అరుణ్ మజుందార్ నేతృత్వం వహిస్తూండగా, మాదకద్రవ్యాల నియంత్రణ బృందానికి రాహుల్ గుప్తా, ఆఫీస్ ఆఫ్ పర్సనెల్ మేనేజ్మెంట్కు కిరణ్ అహూజాలు నేతృత్వం వహిస్తున్నారు. ప్రవీణా రాఘవన్, ఆత్మన్ త్రివేదీ, శుభశ్రీ రామనాథన్, రాజ్ డే, సీమా నందా వంటి వారికీ చోటు దక్కింది. -
ఉద్యోగం దొరకడం లేదని...
నిజామాబాద్: ఉద్యోగం దొరకడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు మంగళవారం ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. జిల్లాలోని నవీపేట్ మండలం బినోలా గ్రామానికి చెందిన గుండాజీ భోజరావు గోల్డ్‌స్మిత్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరిలో చిన్నవాడైన గుండాజీ హరీశ్ (23) బీటెక్‌లో అడ్మిషన్ పొందాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటంతో చదువు పూర్తి చేయలేకపోయాడు. ఈ క్రమంలో రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు. వీరి కుటుంబం మూడు నెలల క్రితం నిజామాబాద్ వర్నిరోడ్డులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. హరీశ్ కుటుంబానికి అండగా ఉండేందుకు ఏదైనా పనిచేయాలని భావించాడు. అందుకోసం పలు కంపెనీలు, దుకాణాల్లో ఉద్యోగ ప్రయత్నం చేశాడు. ఎక్కడా ఉద్యోగం దొరకకపోవటంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంటికి భారమైపోయినట్లు కలత చెందాడు. గతంలో ఓసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. సోమవారం రాత్రి హరీశ్ ఎప్పటిలాగే అందరితో కలసి భోజనం చేసి పడుకున్నాడు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో కనిపించకపోవటంతో వాకింగ్‌కు వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, ఇంటికి దగ్గరలోని న్యాల్కల్ చౌరస్తాలో పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకుని హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు. -
కుండపోత
రహదారులు జలమయం ఇళ్లలోకి వర్షపు నీరు కుత్బుల్లాపూర్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం సిటీబ్యూరో: రుతు పవనాల ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. షాపూర్ నగర్లో 1.9 సెంటీమీటర్లు, జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం వద్ద 1.8 సెంటీమీటర్లు, జీడిమెట్లలో 1.7, చిలకలగూడలో 1.6, ఆసిఫ్‌నగర్‌లో 1.3, ఉప్పల్‌లో 1.3, ఫీవర్ ఆస్పత్రి వద్ద 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో వివిధ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరదనీరు ప్రవహించింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, సచివాలయం, నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, మలక్‌పేట్‌లోని ప్రధాన, లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం క లిగింది. కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొని ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. లోతట్టు కాలనీలు, బస్తీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో నీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరునుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. మోకాలి లోతున నీరు... ఖైరతాబాద్: ఖైరతాబాద్లైబ్రరీ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వాస్పత్రి ముందు మోకాలి లోతున వర్షం నీరు నిలిచింది. పాదచారులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. వర్షం పడిన ప్రతిసారీ ఇక్కడ వరదనీటితో ఇదే పరిస్థితి ఎదురవుతోందని... అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాణాలతో చెలగాటం కుత్బుల్లాపూర్: భారీ వర్షంతో కుత్బుల్లాపూర్ ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. నర్సాఫూర్ రాష్ట్ర రహదారిలో వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతోంది. జీడిమెట్ల డివిజన్ ప్రసూనగర్ కోదండ రామాలయం వెనుకనున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద వర్షం పడితే మోకాళ్ల లోతు నీరు చేరుతుంది. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మంగళవారం భారీ వర్షంతో ఆ ప్రాంతంలో నీరు చేరి ప్రమాదభరితంగా ఉన్నప్పటికీ వాహనదారులు రాకపోకలు సాగించాల్సి వచ్చింది. అదే విధంగా వేంకటేశ్వర నగర్‌లోని ఓపెన్ నాలా మధ్యలో శ్లాబ్‌ను పగుల గొట్టి ఏడాది గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదు. వర్షం పడే సమయంలో నీరంతా రోడ్డు పైకి చేరడంతో స్థానికులు నడిచేందుకు దారి లేక ఆ గొయ్యి పక్క నుంచే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే ప్రాంతంలో 2010లో కురిసిన భారీ వర్షాలకు ఓ ఉపాధ్యాయుడు నాలాలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయినా అధికారులు మాత్రం మారడం లేదు. -
కరెంటు కోతలపై అన్నదాతల ఆగ్రహం
మొయినాబాద్, న్యూస్‌లైన్: వేళాపాళా లేకుండా విద్యుత్ సరఫరా, దాంట్లోనూ కోతలు... లోఓల్టేజీతో పంపుసెట్లు పనిచేయక... నీటి తడి అందక పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. మండల పరిధిలోని అమీర్‌గూడ, నక్కలపల్లి గ్రామాల రైతులు శుక్రవారం మండల విద్యుత్ ఏఈ కార్యాలయం ఎదుట వేర్వేరుగా ధర్నా నిర్వహించారు. రెండు గ్రామాల్లోనూ వారం పది రోజులుగా కరెంటు సక్రమంగా లేక వరి, కూరగాయ పంటలు, పూల తోటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో విద్యుత్ సరఫరా సరిగా లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు ఇవ్వడంలేదని, అందులోనూ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. రాత్రిపూట కరెంటు సరఫరా చేస్తుండటంతో పొలాల వద్దే ఉండాల్సి వస్తోందని, ఆ సమయంలో కూడా లోఓల్టేజీ కరెంటు రావడంతో మోటార్లు నడవక పంటలకు నీరు పెట్టలేక పోతున్నామని అన్నారు. కార్యాలయంలో ఏఈ నాగరాజు అందుబాటులో లేకపోవడంతో నక్కలపల్లి రైతులు ఫోన్లో ఆయనకు విషయం తెలియజేశారు. కాగా, అమీర్గూడలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వారం రోజుల క్రితం కాలిపోయిందని, మరమ్మతులు చేయించినా మళ్లీ మళ్లీ కాలిపోతుండటంతో గ్రామంలో కరెంటు ఉండటంలేదని ఆ గ్రామ రైతులు పేర్కొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
గంగాధర, న్యూస్‌లైన్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మరుకు ఫ్యూజు వైరు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందగా, మరొకరు ప్రాణాపయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన గురువారం మండలంలోని హిమ్మత్‌నగర్‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. హిమ్మత్‌నగర్‌కు చెందిన సర్వు రాజమల్లు(45) మూడెకరాల వ్యవసాయభూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ భూమి సమీపంలోనే ఎస్ఎస్ 11 ట్రాన్స్ ఫార్మర్ ఉంది. గురువారం పొలం పనిచేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజు వైరు కొట్టేసింది. గమనించిన రాజమల్లు ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి వైరు వేశాడు. అక్కడే ఉన్న మరో రైతు ఏగుర్ల బీరయ్యను డీపీ స్విచ్ఆన్ చేస్తుండగా ప్యూజ్‌లో మంటలు వచ్చి రాజమల్లు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో రైతు బీరయ్య సైతం విద్యుదాఘాతంతో గాయపడ్డాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలానికి ఎస్సై రాజేంద్రప్రసాద్, ఏఎస్సై రాజేశ్వర్ పరిశీలించారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. సర్పంచ్ సిరిమల్ల చంద్రమోహన్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. -
షార్ట్ సర్క్యూట్‌తో పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్
పామర్రు, న్యూస్‌లైన్ : ఫార్ట్సర్క్యూట్ కారణంగా ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఇళ్లలోని టీవీలు, బల్బులు మాడిపోయిన ఘటన చాట్లవానిపాలెంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఎంతో కాలంగా గ్రామంలోని నివాస గృహాల మధ్య ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని విద్యుత్ అధికారులను వేడుకున్నా... పట్టించుకోకపోవ డంతో పలుమార్లు షార్ట్‌సర్క్యూట్‌తో అవి పేలిపోతున్నాయి. సుమారు 8 నెలల క్రితం ఇక్కడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి గృహోపకరణాలు కాలిపోయి తీవ్రనష్టం ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించి రహదారి పక్కకు మార్చాలని విద్యుత్ శాఖ ఏఈని కోరగా త్వరలోనే మార్చుతామని హామీ ఇచ్చారన్నారు. అయితే 8 నెలలు కావస్తున్నా ఇంత వరకూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పటి కైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి గృహాల మధ్యలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించి గృహాలకు దూరంగా ఏర్పాటు చేయాలని స్థానికులు అంజి, హనుమంతు, చాట్ల ఏసుపాదం, శ్రీనివాసరావు,టీ వెంటేశ్వరరావు,చాట్ల రాజేష్, కొడాలి రవీంద్ర, రామయ్య తదితరులు కోరుతున్నారు.