![President Donald Trump not conceding defeat is an embarrassment - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/12/1111164-BIDEN.jpg.webp?itok=wtJJ41_9)
వాషింగ్టన్: ఎన్నికల్లో ఓడిపోయినా ఆ విషయాన్ని అంగీకరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇబ్బందికరమేనని కొత్త అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ తెలిపారు. అధ్యక్షుడిగా ట్రంప్ తప్పుడు సంకేతాలు పంపుతున్నారని పునరుద్ఘాటించారు. అధికార మార్పిడికి సంబంధించిన తన ప్రణాళికలకు అడ్డంకులేవీ రాలేదని, ప్రపంచదేశాల నేతలతో మాటాలు కలపడం మొదలుపెట్టానని బైడెన్ డెలవేర్‌లోని విల్మింగ్టన్‌లో చెప్పారు. అధికార మార్పిడి ప్రక్రియను మొదలుపెట్టేందకు ట్రంప్ యంత్రాంగం నిరాకరించినా నిష్ప్రయోజనమని, తాము చేయాల్సింది చేస్తామని స్పష్టం చేశారు. జనవరి 20వ తేదీకి అన్నీ సక్రమంగానే పూర్తవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆరు దేశాల నేతలు తనకు ఫోన్ చేశారని, యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల వారు ఇందులో ఉన్నారని చెప్పారు.
బైడెన్ బృందంలో 20 మంది...
ప్రస్తుత ట్రంప్ నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ విభాగాల సమీక్ష కోసం బైడెన్ ఏర్పాటు చేసిన సమీక్ష బృందాల్లో 20 మందికిపైగా భారతీయ అమెరికన్లున్నారు. వీరిలో ముగ్గురు ఆయా బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు. అధ్యక్ష మార్పిడి సాఫీగా జరిగేందుకు ఈ సమీక్ష బృందాలు ఉపయోగపడతాయని అంచనా. అమెరికా చరిత్రలో ఇంత వైవిధ్యతతో కూడిన సమీక్ష బృందం ఏదీ లేదని బైడెన్ వర్గం తెలిపింది. ఈ బృందాల్లో సగం మంది మహిళలు. సుమారు 40 శాతం మంది చారిత్రకంగా కేంద్ర ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు చెందిన వారు. విద్యుత్తు పరమైన అంశాల సమీక్షకు ఏర్పాటు చేసిన బృందానికి స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన అరుణ్ మజుందార్ నేతృత్వం వహిస్తూండగా, మాదకద్రవ్యాల నియంత్రణ బృందానికి రాహుల్ గుప్తా, ఆఫీస్ ఆఫ్ పర్సనెల్ మేనేజ్‌మెంట్‌కు కిరణ్ అహూజాలు నేతృత్వం వహిస్తున్నారు. ప్రవీణా రాఘవన్, ఆత్మన్ త్రివేదీ, శుభశ్రీ రామనాథన్, రాజ్ డే, సీమా నందా వంటి వారికీ చోటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment