ముంచెత్తిన వాన | Heavy rainfall causes flooding in Hyderabad, several areas inundated | Sakshi
Sakshi News home page

ముంచెత్తిన వాన

Published Sun, Aug 27 2017 1:24 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM

ముంచెత్తిన వాన - Sakshi

ముంచెత్తిన వాన

భారీ వర్షంతో చిగురుటాకులా వణికిన నగరం
సాక్షి, హైదరాబాద్‌:  కుండపోత వర్షంతో హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఏకంగా సగటున 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో నగరం చిగురుటాకులా వణికిపో యింది. నాలాలు ఉప్పొంగి అనేక ప్రాంతాలు జలమ యమయ్యాయి. వందలాది కాలనీలు నీటముని గాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

శుక్రవారం సెలవుదినం కావడం, రాత్రి సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్‌ సమస్య వంటి కొన్ని ఇబ్బందులు తప్పాయి. కానీ వరద నీటి కారణంగా సుమారు 395 ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శేరిలింగంపల్లి, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు తదితర ప్రాంతాల్లో 12–13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరి, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా నగరంలోని 150 ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నాచారం హెచ్‌ఎంటీ నగర్‌ పెద్ద చెరువుకు గండి పడింది.

దాంతో ఇందిరానగర్, రాఘవేంద్రనగర్‌ కాలనీలు జలమయమయ్యాయి. చెరువు కట్ట కుంగి పెద్ద గోతి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. కట్ట మట్టి అంతా మ్యాన్‌హోల్స్‌ ద్వారా భూగర్బ డ్రైనేజీలోకి చేరి పూడుకుపోయాయి. దాంతో వర్షపు నీరు రహదారులపైనే నిలిచిపోయింది. ఎర్రకుంట, పటేల్‌కుంట చెరువులకు వరద పోటెత్తడంతో.. పటేల్‌ కుంట చెరువు బ్రిడ్జిపైన భారీగా వరద నీరు చేరింది. నిజాంపేట్, భండారీ లే అవుట్, దీప్తిశ్రీనగర్‌ తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కాలుష్యకారక రసాయనాలతో కూడిన కూకట్‌పల్లి పరికి చెరువు వరదతో ఉప్పొంగింది. ఆ నీరంతా రహదారులు, ఇళ్లలోకి చేరి తీవ్రమైన దుర్గంధం వ్యాపించి.. జనం అవస్థలు పడుతున్నారు.

భండారీ లేఅవుట్‌లో అదే ఘోష..
ఏడాది కిందట భారీ వర్షంతో నిజాంపేట్, భండారీ లేఅవుట్‌ అతలాకుతలమైంది. మూడు రోజుల పాటు ప్రజలు నిద్రాహారాలు మాని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. తాజా వర్షంతోనూ అలాంటి పరిస్థితే తలెత్తింది. భారీగా వచ్చిన వరదనీటితో జన జీవనం స్తంభించింది. అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు చేరాయి. చందానగర్, దీప్తిశ్రీనగర్‌ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పటేల్‌ చెరువు, ఈర్ల చెరువు, కాయిదమ్మ కుంట నుంచి భారీ స్థాయిలో వరద రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి.

దీప్తిశ్రీనగర్‌ నుండి పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌కు వెళ్లే మార్గం జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.ఈ మార్గంలోని పది స్కూళ్లలోకి వరదనీరు చేరడంతో వాటికి సెలవు ప్రకటించారు. దీప్తిశ్రీనగర్‌లోని రోడ్లు, సెల్లార్లు నీటితో నిండిపోయాయి. శనివారం ఉదయం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మూడు అడుగుల లోతు నీరు ఉండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దీప్తిశ్రీనగర్‌లోని ఆదర్శ్‌నగర్, సీబీఆర్‌ ఎస్టేట్, శ్రీకృష్ణ దేవరాయ కాలనీ, శాంతినగర్, దుర్గా ఎన్‌క్లేవ్, చిరంజీవినగర్, ప్రగతి ఎన్‌క్లేవ్‌ తదితర కాలనీలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి.

35 అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లలో వరద నీరు చేరింది. ఈ ప్రాంతాల్లో రాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. మదీనాగూడలోనూ ఐదు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరదనీరు చేరింది. జాతీయ రహదారి పై వరదనీరు నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నీట మునిగిన కాలనీల్లో జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ –21 ఉప కమిషనర్‌ వెంకన్న, ఉప వైద్యాధికారి రవికుమార్‌లు సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి వరదను నాలాలలోకి మళ్లించారు. నీటిలో మునిగిన అపార్ట్‌మెంట్‌ వాసులకు నీరు, ఆహారపు పొట్లాలను అందించారు.

విద్యుత్‌ సరఫరా బంద్‌
హైదరాబాద్‌లోని చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. 154 ప్రాంతాల్లో విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. గోల్కొండ, సరూర్‌నగర్, ఎల్లమ్మ టెంపుల్, సుచిత్ర, ఎస్సార్‌నగర్, గ్రీన్‌లాండ్స్, మాదాపూర్, జర్నలిస్టు కాలనీలలో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్‌ తీగలు తెగిపోయా యి. బర్కత్‌పుర, తార్నాక, బంజారాహిల్స్‌లలో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి వరకు కూడా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించలేకపోయారు. ఇక అనేక ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరి.. విద్యుత్‌ వ్యవస్థ నీళ్లలో మునగడంతో సరఫరా నిలిపివేశారు. కాప్రా, ఏఎస్‌ రావునగర్‌లలో పలు చోట్ల విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. మొత్తంగా చాలా ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచి పోవటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కూకట్‌పల్లిలో వర్షబీభత్సం
కూకట్‌పల్లిలో భారీ వర్షం కారణంగా ఇళ్ల బయట రోడ్లపై పార్క్‌ చేసిన వాహనాలు, పలు ఇళ్లలోని వస్తు సామగ్రి రోడ్లపై కొట్టుకుపోయాయి. ధర్మారెడ్డి ఫేజ్‌–1 ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనం ప్రహరీ కూలిపోయి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో.. పార్క్‌ చేసి ఉన్న ఓ కారు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. వాహనాలు కొట్టుకుపోకుండా ఆపేందుకు ప్రయత్నించిన వాచ్‌మన్‌కు, ఓ వాహనం యజమానికి గాయాల య్యాయి. బేగంపేట నాలా పరిధిలోని అల్లంతోట బావి, మయూరి మార్గ్, బ్రాహ్మణన్‌వాడీ, ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీ, ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతాలు నీటమునిగాయి. పలుచోట్ల ప్రహరీలు, చెట్లు కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పర్యటన
భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో బేగంపేటలోని వరద ప్రాంతాలను సందర్శించి.. పరిస్థితిని సమీక్షించారు. వరద నీటి తొలగింపుతో పాటు బాధితులకు సహాయక చర్యలు అందేలా చర్యలు చేపట్టారు.

పొంగిపొర్లిన నాలాలు
కంటోన్మెంట్‌ 5వ వార్డులోని మహేంద్రహిల్స్‌ త్రిమూర్తికాలనీ, రోడ్‌–9 మూలమలుపు వద్ద గుట్టపై నుంచి భారీబండరాళ్లు రోడ్డుపై పడిపోయాయి. దీంతో ఈ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. బేగంపేట ఎస్‌పీరోడ్‌ భరణి కాంప్లెక్స్‌ వద్ద ప్రహరీగోడ నిర్మాణ పనుల కోసం 6 నెలల క్రితం ప్రధాన నాలాను పూడ్చారు. దాంతో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీవర్షానికి కంటోన్మెంట్‌లో నాలా వెంట ఉన్న కాలనీలు నీట మునిగాయి. ప్యాట్నీ కాంపౌండ్‌ కాలనీలోని పలు అపార్ట్‌మెంట్లు, భవనాల్లోని సెల్లార్లలోకి వర్షపునీరు, మురుగునీరు చేరడంతో పలు కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. పైగా కాలనీ, బాలంరాయి, మార్గదర్శి కాలనీల్లో మోకాలిలోతు వరద నీరు చేరింది.

సెల్లార్‌ గుంతలోకి నీరు..అపార్ట్‌మెంట్‌ ఖాళీ
దీప్తిశ్రీనగర్‌లోని సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ ప్రమాదపుటంచుల్లో ఉండడంతో అధికారులు అందులోని నివాసితులను ఖాళీ చేయించారు. ఈ అపార్ట్‌మెంట్‌ పక్కన భారీ భవన నిర్మాణం కోసం 30 అడుగుల సెల్లార్‌ గుంతను తవ్వారు. తాజా వర్షంతో అది నీటితో నిండిపోయింది. దానికి ఆనుకొని ఉన్న సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌లోకి వెళ్లే రోడ్డు కుంగిపో యింది. ప్రహరీ కూలి.. నీరు అపార్ట్‌మెంట్‌లోకి చేరుతోంది. దీంతో అపార్ట్‌మెంట్‌ పిల్లర్లకు ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. శనివారం రాత్రి జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అధికారులు అపార్ట్‌మెంట్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగే అవకాశము న్నందున అందులోని 35 ఫ్లాట్లను ఖాళీ చేయించారు. సెల్లార్‌ గుంతలోని నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా 30 అడుగుల సెల్లార్‌ గుంత తవ్విన శ్రీతిరుమల ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌ చౌదరిపై కేసు నమోదు చేశారు.

ముంపు బాధితులను ఆదుకుంటాం: తలసాని
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆదేశించారు. బేగంపేట, సనత్‌నగర్‌ డివిజన్‌లలో ముంపు ప్రాంతాలలో పర్యటించి.. బాధితులను పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 60 ఫీట్ల రోడ్డు మరమ్మతులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ రోడ్డుకు అడ్డుగా మట్టిని పోసిన కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదనీరు ఇళ్లలోకి చేరిందని బాధితులు వాపోయారు. దీంతో ఈ మట్టిని వెంటనే తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మంచు కాదు.. మురుగు నురుగు
శుక్రవారం రాత్రి ఉధృతంగా కురిసిన వర్షంతో పరికి చెరువులోని కలుషిత నీరు ఉప్పొంగి.. సమీప ప్రాంతాలన్నీ మురుగు నురుగుతో నిండిపోయాయి. శనివారం ఇక్కడి కాలనీల్లో చెట్లు, భవనాలు, వాహనాలు ఎక్కడ చూసినా.. నురగలో తేలియాడాయి. ధరణినగర్‌తో పాటు నాలాను ఆనుకొని ఉన్న ఆల్విన్‌కాలనీ పరిస్థితి దుర్భరంగా మారింది. కలుషిత నీటితోపాటు డ్రైనేజీ దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఈ నురగను జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ హరిచందన, ఉప కమీషనర్‌ దశరథ్‌ పరిశీలించారు. అయితే చెరువు నీటిలో పిల్మెంటరీ బ్యాక్టీరియా పెరగడంతోనే నురగ ఏర్పడుతోందని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రవీందర్‌ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement