చలి పంజా..
11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో నగరంపై చలి పంజా విసురుతోంది. వేకువజామున కురుస్తున్న మంచు, ఉదయం, రాత్రి వేళల్లో వీస్తున్న శీతలగాలులు సిటీజన్లను గజగజలాడిస్తున్నాయి. శుక్రవారం సాధారణం కంటే 4 డిగ్రీలు అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం గమనార్హం. తెల్లవారుజామున కనిష్టంగా 11.4 డిగ్రీలు, గరిష్టంగా 30.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత పెరగడంతో జలుబు, వైరల్ జ్వరాలతో జనం సతమతమవుతున్నారు.
చలితీవ్రత పెరగడంతో వాహనదారులు, పాదచారులు, వృద్ధులు, రోగులు, చిన్నారులు విలవిల్లాడుతున్నారు. స్వెట్టర్, మంకీక్యాప్, జర్కిన్ లేనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఆయా దుకాణాల వద్ద కొనుగోళ్లు పెరిగాయి. రోగులు, చిన్నారులు చలిబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేస్తున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.