సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులను స్థానికత ఆధారంగా విభజించడాన్ని ఉమ్మడి హైకోర్టు తప్పుబట్టింది. ఇలా స్థానికత ఆధారంగా విభజిస్తూ విద్యుత్ సంస్థలు రూపొందించిన మార్గదర్శకాలు, వాటికి ఆమోదముద్ర వేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
వాటిని అమలు చేయడానికి వీల్లేదంటూ.. ఆ మార్గదర్శకాలను, ఉత్తర్వులను కొట్టివేసింది. ఇప్పటికే ఏపీకి రిలీవ్ చేసిన ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని విద్యుత్ సంస్థలకు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. దీంతో 2015 నుంచి కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదానికి తెరపడింది.
రోజువారీగా విచారణ జరిపి..
ఏపీ స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజిస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలు, వాటిని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 2015లో ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఆ వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, వేదుల వెంకటరమణ, లక్ష్మీనర్సింహ తదితరులు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. రోజువారీ పద్ధతిలో వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం తీర్పు వెల్లడించింది.
కొత్త మార్గదర్శకాలు రూపొందించండి
స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై ప్రస్తుతమున్న జాయింట్ కమిటీతోగానీ, కొత్త కమిటీలను వేసిగానీ ఉద్యోగుల విభజనకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని, ఉద్యోగుల విభజన ప్రక్రియను 4 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
అప్పటివరకు ఆయా ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా ఎటువంటి వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని తెలంగాణ విద్యు త్ సంస్థలకు సూచించింది. వారి సీనియారిటీని పునరుద్ధరించాలని.. విభజన పూర్తయ్యేనాటి వరకు వారి అర్హతలను బట్టి పదో న్నతులకు సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాక వారికి చెల్లించాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లిం చాలని స్పష్టం చేసింది. రిలీవ్ చేసిన ఉద్యోగులకు ఏపీ విద్యుత్ సంస్థలు జీతభత్యాలు చెల్లించి ఉంటే.. ఆ సొమ్మును మూడు నెలల్లోపు తిరిగి చెల్లించేయాలని సూచించింది.
అయితే తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగులను పక్కనపెట్టి ఇచ్చిన పదో న్నతుల విషయంలో జోక్యానికి నిరాకరించింది. పదోన్నతులపై దాఖలైన వ్యాజ్యాలను వేరుగా విచారించాలంది. కాగా ధర్మాసనం సభ్యులైన జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌కు ఇదే చివరి తీర్పు. ఈ తీర్పు వెలువరించిన అనంతరం పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment