
సాక్షి, హైదరాబాద్: మన దేశ రక్షణ రహస్యాలను సేకరించి పాకిస్తాన్‌కు చేరవేయడమే కాకుండా, వీసా గడు వు తీరిన తర్వాత కూడా మనదేశంలోనే ఉండిపోయిన ఓ పాకిస్తాన్ జాతీయుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిజా మాబాద్ రెండో అదనపు సెషన్స్ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. నిజామాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పాకిస్తానీ జాతీయుడు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్‌కెయిత్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.
ఆషిఖీ అలీ అలియాస్ షనీల్ అలియాస్ షనీల్ తాహిర్ అహ్మదీ పాకిస్తాన్ జాతీయుడు. పాకిస్తాన్ జాతీయులైన మేజర్ చౌదరి జహీద్ అహ్మద్, హవాల్దార్ మెహమూద్, హవాల్దార్ తాహీర్‌లకు మన దేశ రక్షణ రహస్యా లను అందజేసేందుకు ఆషిఖీ అలీ 2001లో భారతదేశానికి వచ్చాడు. ఢిల్లీ, కాన్పూర్ సందర్శనకు టూరిస్ట్ వీసాపై సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ద్వారా ఢిల్లీ చేరుకున్న అతను.. ఆ వెంటనే తన పాస్‌పోర్ట్‌ను ధ్వంసం చేశాడు.
ఆ తర్వాత పాస్ట్‌పోర్ట్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా బాటాల, అమృతసర్, హైదరాబాద్, నిజామాబాద్, ముంబై, నాగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లాడు. వీసా గడువు ముగిసిన తర్వాతా మనదేశంలోనే ఉండిపోయాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ ప్రాంతాలకు సంబంధించిన రహస్యాలను మేజర్ చౌదరి తదితరులకు ఇంటర్నెట్ ద్వారా పంపాడు. 2002లో నిజామాబాద్, జన్నపల్లి జంక్షన్ వద్ద ఫోన్‌లో పాక్‌లోని పెద్దలతో మాట్లాడుతుండగా ఆషిఖీ అలీని పోలీసులు పట్టుకున్నారు.
దీంతో నిజామాబాద్ రెండవ అదనపు సెషన్స్ జడ్జి కోర్టు 2005లో అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అలీ హైకోర్టులో అప్పీల్ చేశాడు. అయితే కింది కోర్టు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే శిక్ష విధించిందని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అలీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది.