ఓటుకు కోట్లు: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనుమతి | High court allows quash petition of chandra babu naidu in cash for votes scam | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనుమతి

Published Fri, Dec 9 2016 10:52 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

ఓటుకు కోట్లు: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనుమతి

ఓటుకు కోట్లు: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనుమతి

ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అనుమతించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. చంద్రబాబుపై విచారణ జరపాలన్న ఏసీబీ కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ఏసీబీ అధికారులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదుచేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దర్యాప్తు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
 
విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ  ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు  వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి గత నెలలో విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, ఓటు  వేసేందుకు లంచం తీసుకుంటే అది అవినీతి కిందకు రాదని వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి గత నెల 22న తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పులో.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement