కోర్టులు వద్దన్నా ఎలా వసూలు చేస్తున్నారు?
⇒ కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి వసూళ్లపై హైకోర్టు
⇒ వివరణ ఇవ్వాలని నీటిపారుదల శాఖకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించిన బిల్లుల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (న్యాక్), సీఎం రిలీఫ్ ఫండ్‌ల కోసం 0.25 శాతాన్ని వసూలు చేస్తుండటంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశిస్తూ.. విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషశాయి ఇటీవల ఉత్తర్వులిచ్చారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనుల బిల్లుల నుంచి రూ.71.25 లక్షలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్–1 బిల్లుల నుంచి రూ.1.14 కోట్లు, బీమా ఎత్తిపోతల పథకం బిల్లుల నుంచి రూ.90 లక్షలను న్యాక్, సీఎం రిలీఫ్ ఫండ్‌ల కోసం నీటిపారుదల శాఖ అధికారులు వసూలు చేశారని, ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ నిర్మాణ సంస్థ పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది.
వాపసు చేయమన్నా పట్టించుకోలేదు...
ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ, న్యాక్, సీఎం రిలీఫ్ ఫండ్‌ల కోసం కాంట్రాక్టర్ల స్థూల బిల్లుల్లో 0.25 శాతాన్ని వసూలు చేయాలంటూ 2000, 2004ల్లో అప్పటి ప్రభుత్వం జీవోలు జారీ చేసిందన్నారు. ఈ జీవోలను సవాలు చేస్తూ కొందరు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించగా, ఆ జీవోలను హైకోర్టు కొట్టేసిందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైందన్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాజెక్టుల బిల్లుల ద్వారా వసూలు చేసిన రూ.3.48 కోట్లను వాపసు చేయాలని పిటిషనర్లు కోరారని, అయితే అందుకు అధికారులు తిరస్కరించారని కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆదేశించినా ఎలా వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.