పోలీసులకు అత్యుత్సాహమెందుకు? | High Court comments on Naresh murder case | Sakshi
Sakshi News home page

పోలీసులకు అత్యుత్సాహమెందుకు?

Published Fri, Jun 2 2017 2:02 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

High Court comments on Naresh murder case

- పరువు హత్యలు పెరుగుతుంటే ఏం చేస్తున్నారు?
- నరేశ్‌ హత్య కేసులో హైకోర్టు వ్యాఖ్యలు
- హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ మూసివేత
 
సాక్షి, హైదరాబాద్‌: ‘‘పోలీసులు బ్రాండ్‌ ఇమేజ్‌ను ఎందుకు పెంచుకోవడం లేదు? నిష్పాక్షికంగా ఎందుకు వ్యవహరించడం లేదు? ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? ఈ తీరుతోనే విమర్శల పాలవుతున్నారు. పోలీసులు పారదర్శకంగా ఉండటం లేదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఎందుకిలా జరుగుతోంది?’’అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేశ్‌ను కోర్టులో హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరుగుతున్న దాఖలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. వీటిపై పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. లింగరాజుపల్లెకు చెందిన తుమ్మల స్వాతిని నరేశ్‌ వివాహం చేసుకోవడం, తర్వాత ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురవడం తెలిసిందే. ఉన్న స్వాతి, నరేశ్‌లను ముంబై నుంచి పోలీసులు బలవంతంగా ఇక్కడికి రప్పించారని పిటిషనర్‌ తరఫున అర్జున్‌ ఆరోపించగా, అలాంటిదేమీ లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పేర్కొన్నారు. తన కుమార్తెను వరకట్నం కోసం వేధిస్తున్నారని నరేశ్‌ కుటుంబీకులపై శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేయడం వల్లే పిలిపించారన్నారు.

మృతున్ని హాజరు పరచడం అసాధ్యం గనుక, నరేశ్‌ జీవించి లేనందున  విచారించేందుకేమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఈ వ్యవహారంలో ముందుకెళ్లేందుకు పిటిషనర్‌కు న్యాయపరమైన ప్రత్యామ్నాయాలున్నాయి. అన్యాయం జరుగుతోందని భావిస్తే తిరిగి మమ్మల్ని ఆశ్రయించవచ్చు. ఈ వ్యాజ్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాం’’అని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement