naresh murder case
-
నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఐదేళ్ల కిందటి నాటి అంబోజు నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది భువనగిరి కోర్టు. సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్ల సత్తిరెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది భువనగిరి కోర్టు. ఐదు సంవత్సరాల కిందట.. 2017 మే నెలలో నరేష్ హత్యకు(పరువు హత్య?) గురి కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ తాజాగా ఈ కేసును కొట్టేశారు జడ్జి బాల భాస్కర్. దీంతో సత్తిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక తీర్పుపై నరేశ్ తండ్రి వెంకటయ్య అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని, న్యాయం జరిగేంత వరకు పోరాడతానని, తన పాతికేళ్ల కొడుకును కోల్పోయానంటూ ఆవేదనగా మాట్లాడారాయన. కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేశ్ ఘోరంగా హత్యకు గురయ్యాడు. అది స్వాతి తండ్రి పనేనన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కూడా జరిగింది. ఆపై స్వాతి కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ప్రేమకథ విషాదాంతమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ కాలేజీ రోజుల్లో.. లింగరాజుపల్లికి చెందిన స్వాతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరు కావడంతో స్వాతి ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. దీంతో ముంబైలో ఉంటున్న నరేష్ తన తల్లిదండ్రుల వద్దకు స్వాతిని తీసుకెళ్లి కులాంతర వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి.. భువనగిరికి రావాలని, ఇక్కడ వివాహం జరిపిస్తానని ప్రేమతో కూతురిని నమ్మించాడు శ్రీనివాసరెడ్డి. అలా వచ్చిన స్వాతి-నరేశ్‌లు వేరయ్యారు. నరేష్ ఏమయ్యాడో.. ఆ తర్వాత జాడ లేకుండా పోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కోర్టు జూన్ 1 కల్లా నరేష్ ఎక్కడున్నా కోర్టులో హాజరుపరచమని పోలీసులను ఆదేశించింది. కాగా నరేష్ హతమార్చినట్టు పోలీసు ఇంటరాగేషన్‌లో స్వాతి తండ్రి అంగీకరించాడు. బంధువు సాయంతో నరేశ్‌ను స్వాతికి చెందిన పొలంలోనే చంపి, దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడని తేలడంతో వాళ్లు గుండెలు పలిగేలా రోదించారు. ఆపై మే 16వ తేదీన నరేశ్ ప్రేయసి స్వాతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె మృతి కేసులోనూ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వీళ్లే చేశారనేందుకు సాక్ష్యాలేవి? నరేశ్ హత్య కేసులో నిందితులుగా స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి ఏ1గా,ఆయన బంధువు నల్ల సత్తిరెడ్డి ఏ2గా ఉన్నారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నేరం అంగీకరించారు కూడా. అయితే.. కేసు విషయమై న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్,డిఫెన్స్ తుది వాదనలు ఈనెల 9న పూర్తి కావడంతో బుధవారం కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. 2017లో జరిగిన ఈ కేసులో 2018 జులై 31న కేసు అభియోగపత్రాలు పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు.23 మంది సాక్షుల విచారణతోపాటు భౌతిక ఆధారాలు,ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే.. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులే హత్య చేశారనేందుకు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటిస్తూ భువనరిగి కోర్టు తీర్పును వెలువరించింది. పోలీసుల దర్యాప్తులో.. 2017 మే2వ తేదీన ముంబాయి నుంచి స్వాతితో కలిసి వచ్చిన నరేశ్ భువనగిరి బస్టాండ్‌లో భార్యను ఆమె తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు తీసుకుని స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేశ్ మోటార్ వాహనంపై లింగరాజుపల్లికి వెళ్లాడు. శ్రీనివాస్‌రెడ్డి ఇంటి సమీపంలో నరేశ్, మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై కనిపించాడు. దీంతో వీరిని గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి తన పొలంలోకి తీసుకుపోయారు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో అక్కడ మాట్లాడుతుండగానే వెనుక నుంచి తలపై రాడ్‌తో గట్టిగా కొట్టడంతో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నరేశ్‌ను తగులబెట్టిన శ్రీనివాస్‌రెడ్డి బూడిదను, అస్థికలను తీసుకువెళ్లి మూసిలో కలిపారు. దీంతోపాటు స్వాతి ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసిందని ప్రచారం జరిగింది. అయితే సెల్ఫీ కాదని, అది వీడియోగా పోలీసులు భావిస్తున్నా. ఆ సెల్ఫీని స్వాతి స్వయంగా తీసిందా, లేక మరొకరి సమక్షంలో తీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగింది కూడా. -
నరేష్ హత్య కేసులో కొత్త మలుపు
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అంబోజు నరేష్–స్వాతి హత్య సంఘటన కొత్త మలుపు తిరిగింది. 86 రోజుల తర్వాత వెలుగు చూసిన నరేష్ అస్థికలు కొత్త అనుమానాలకు తెరలేపాయి. హత్యకు గురైన నరేష్‌కు సంబంధించిన ఆన వాళ్లు ఇప్పటివరకు పోలీసులు గుర్తించలేక పోయారు. నరేష్ హత్య కేసులో నిందితుడు చెప్పిన ఆధారాలతో పోలీసులు ముందుకు సాగారన్నా ఆరోపణలకు బలం చేకూరు తోంది. ప్రజాసంఘాలు, నరేష్ కుటుంబ సభ్యులు ముందు నుంచి పోలీస్‌ల తీరుపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నరేష్ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బుధవారం ఆత్మకూరు మండలం లింగరాజు పల్లి శివారు పరిధిలోని తుర్కపల్లి వద్రికళ బండ వద్ద బయటపడ్డాయి. పశువులను మేపడానికి వెళ్లిన నరేష్ బాబాయ్ అనుమా నాస్పదంగా ఉన్న గోనె సంచి మూటను గుర్తించాడు. విషయం వెంటనే నరేష్ తల్లి దండ్రులకు తెల్పడంతో వారు సంఘటన స్థలంలో కనిపించిన ఎముకలతో కూడిన చినిగిపోయిన దుస్తుల ఆధారంగా నరేష్ అస్థికలేనని గుర్తించారు. శవాన్ని పడుకోబెట్టి కాల్చినట్లు అక్కడ ఉన్న ఎముకల ఆధారా లను బట్టి తల్లిదండ్రులు గుర్తించారు. శరీరంపై ఉన్న పాయింట్ 75% కాలిపోగా మిగిలిన భాగం ఉంది. చెంతనే పెట్రోల్ బాటిల్ అక్కడే ఉంది. -
నరేశ్ హత్యపై సీఎం కేసీఆర్ స్పందించాలి: తమ్మినేని
పోలీసులు నేరస్తులకు సహకరిస్తున్నారు: విమలక్క సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో కుల దురంహకార హత్యలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. అంబోజు నరేశ్, స్వాతి çపరువు హత్యలకు నిరసనగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ నరేశ్ హత్య కేసుపై సీఎం కేసీఆర్ ఇంకా స్పందించక పోవడం బాధాకరమన్నారు. దీనిపై త్వరలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆయన్ను కలుస్తామని చెప్పారు. అయినా సీఎం స్పందిం చకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని హెచ్చరిం చారు. నరేశ్ హత్యకేసు విషయంలో పోలీసులపై కేసులు నమోదు చేయాలని టఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. సభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాస్‌రాం నాయక్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, నరేశ్ తల్లిదండ్రులు వెంకటయ్య, ఇందిరమ్మ, ప్రజా సంఘాల వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. -
పోలీసులకు అత్యుత్సాహమెందుకు?
- పరువు హత్యలు పెరుగుతుంటే ఏం చేస్తున్నారు? - నరేశ్ హత్య కేసులో హైకోర్టు వ్యాఖ్యలు - హెబియస్ కార్పస్ పిటిషన్ మూసివేత సాక్షి, హైదరాబాద్: ‘‘పోలీసులు బ్రాండ్ ఇమేజ్ను ఎందుకు పెంచుకోవడం లేదు? నిష్పాక్షికంగా ఎందుకు వ్యవహరించడం లేదు? ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? ఈ తీరుతోనే విమర్శల పాలవుతున్నారు. పోలీసులు పారదర్శకంగా ఉండటం లేదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఎందుకిలా జరుగుతోంది?’’అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేశ్‌ను కోర్టులో హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరుగుతున్న దాఖలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. వీటిపై పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. లింగరాజుపల్లెకు చెందిన తుమ్మల స్వాతిని నరేశ్ వివాహం చేసుకోవడం, తర్వాత ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురవడం తెలిసిందే. ఉన్న స్వాతి, నరేశ్‌లను ముంబై నుంచి పోలీసులు బలవంతంగా ఇక్కడికి రప్పించారని పిటిషనర్ తరఫున అర్జున్ ఆరోపించగా, అలాంటిదేమీ లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పేర్కొన్నారు. తన కుమార్తెను వరకట్నం కోసం వేధిస్తున్నారని నరేశ్ కుటుంబీకులపై శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేయడం వల్లే పిలిపించారన్నారు. మృతున్ని హాజరు పరచడం అసాధ్యం గనుక, నరేశ్ జీవించి లేనందున విచారించేందుకేమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఈ వ్యవహారంలో ముందుకెళ్లేందుకు పిటిషనర్‌కు న్యాయపరమైన ప్రత్యామ్నాయాలున్నాయి. అన్యాయం జరుగుతోందని భావిస్తే తిరిగి మమ్మల్ని ఆశ్రయించవచ్చు. ఈ వ్యాజ్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాం’’అని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఒక ప్రేమ..రెండు నిండు ప్రాణాలు
-
నరేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి
-
నరేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి
సీపీఎం, ప్రజాసంఘాల డిమాండ్ సాక్షి, యాదాద్రి: నరేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. దళిత, రజక, ఎంబీసీ, బీసీ, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేం ద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో నరేష్ తల్లి దండ్రులు వెంకటయ్య, ఇందిరమ్మ, సోదరి నీలిమ పాల్గొన్నారు. అలాగే.. జిల్లాలోని వలిగొండ, మోత్కూర్, ఆలేరు, సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్, రామన్నపేట మండలాల్లో సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిం చారు. భువనగిరిలో నరేష్ చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, నింది తుడు శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఆస్తుల ను వెంటనే జప్తు చేయాలని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల పొలాన్ని పరిహారంగా ఇప్పిం చాలని డిమాండ్ చేశారు. పరువు హత్యల నివారణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, నరేశ్ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తన కుమారుడిని హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలని నరేష్ తండ్రి వెంకటయ్య డిమాండ్ చేశారు. -
నరేశ్ వెంట ఉన్నది ఎవరు ..?
⇔ దర్యాప్తు ముమ్మరం ⇔ కొనసాగుతున్న పోలీసుల విచారణ ⇔ ఆచూకీ లభిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి.. సాక్షి, యాదాద్రి : కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేశ్ హత్య జరిగిన రోజు ఆయన వెంట ఉన్న మరో యువకుడి ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మే2వ తేదీన ముంబాయి నుంచి స్వాతితో కలిసి వచ్చిన నరేశ్ భువనగిరి బస్టాండ్‌లో భార్యను ఆమె తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు తీసుకుని స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేశ్ మోటార్ వాహనంపై లింగరాజుపల్లికి వెళ్లాడు. శ్రీనివాస్‌రెడ్డి ఇంటి సమీపంలో నరేశ్, మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై కనిపించాడు. దీంతో వీరిని గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి తన పొలంలోకి తీసుకుపోయారు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో అక్కడ మాట్లాడుతుండగానే వెనుక నుంచి తలపై రాడ్‌తో గట్టిగా కొట్టడంతో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నరేశ్‌ను తగులబెట్టిన శ్రీనివాస్‌రెడ్డి బూడిదను, అస్థికలను తీసుకువెళ్లి మూసిలో కలిపారు. అయితే నరేశ్ వెంట వాహనంపై ఉన్న మరో యువకుడు ఎవరని పోలీసులు విచారణ ప్రారంభించారు. అతని ఆచూకీ తెలిస్తే ఈకేసు మరింత పురోగతి సాధిస్తుందని భావిస్తున్నారు. దీంతోపాటు స్వాతి ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసిందని ప్రచారం జరిగింది. అయితే సెల్ఫీ కాదని, అది వీడియోగా పోలీసులు భావిస్తున్నా. ఆ సెల్ఫీని స్వాతి స్వయంగా తీసిందా, లేక మరొకరి సమక్షంలో తీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆత్మహత్యకు ముందే మరొకరి ద్వారా సెల్ఫోన్లో వీడియో తీసినట్లు సమాచారం. వీటి గుట్టు విప్పడం ద్వారా ఈకేసులో మరింత పురోగతి సాధించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా నరేశ్, స్వాతి మరణం వెనుక మరిన్ని విషయాలను బయటపెట్టేందుకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. -
గతంలోనూ హత్యల చరిత్రేనా?
-
గతంలోనూ హత్యల చరిత్రేనా?
నరేష్ హత్య కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. అతడిని చంపిన శ్రీనివాసరెడ్డికి 20 ఏళ్ల వయసు నుంచే నేర చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ముందు నుంచే రౌడీషీటర్లతో తిరిగేవాడని అంటున్నారు. గతంలో 1992 సంవత్సరంలో ఒక పొలం వివాదంలో శ్రీనివాసరెడ్డి సొంత అన్న హత్యకు గురయ్యారు. ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు సైతం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అప్పట్లో ఈ మూడు హత్యల విషయంలోనూ ఈయనపై అనుమానాలు తలెత్తాయి గానీ, ఆధారాలు ఏమీ లేకపోవడంతో రుజువు కాలేదు. ఇప్పుడు స్వాతి కూడా ఆత్మహత్య చేసుకుందా.. లేక చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ అనుమానాస్పద మృతి, నరేష్ హత్య కేసులలో కూడా దాదాపు ఇలాగే జరిగేది. అయితే కోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఆలస్యంగానైనా స్పందించి విచారణ వేగవంతం చేయడంతో మొత్తం కేసు ఒక కొలిక్కి వచ్చింది. హత్య జరిగిన తీరు మొత్తం బట్టబయలైంది. స్వాతి పేరు మీద ఉన్న పొలంలోనే ఆమె భర్త నరేష్‌ను దారుణంగా చంపి, టైర్లతో తగలబెట్టిన శ్రీనివాసరెడ్డి.. అతడి అస్థికలను మూసీనదిలో కలిపేశాడు. దాంతో అసలు ఆధారాలన్నవి దొరకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే పోలీసులు చుట్టుపక్కల విచారించడంతో పాటు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఎవరైనా హత్య లాంటి నేరాలు చేస్తే ఎక్కడో ఒకచోట ఆధారాలు వదలకుండా ఉండారు. కానీ శ్రీనివాసరెడ్డి మాత్రం పక్కాగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా చేసి చివరకు అస్థికలను కూడా మూసీనదిలో కలిపేయడంతో.. స్వయంగా ఆయన చెబితే తప్ప హత్య జరిగిందన్న విషయం కూడా బయటకు వచ్చేది కాదు.