సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఐదేళ్ల కిందటి నాటి అంబోజు నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది భువనగిరి కోర్టు. సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్ల సత్తిరెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది భువనగిరి కోర్టు.
ఐదు సంవత్సరాల కిందట.. 2017 మే నెలలో నరేష్ హత్యకు(పరువు హత్య?) గురి కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ తాజాగా ఈ కేసును కొట్టేశారు జడ్జి బాల భాస్కర్. దీంతో సత్తిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక తీర్పుపై నరేశ్ తండ్రి వెంకటయ్య అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని, న్యాయం జరిగేంత వరకు పోరాడతానని, తన పాతికేళ్ల కొడుకును కోల్పోయానంటూ ఆవేదనగా మాట్లాడారాయన.
కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేశ్ ఘోరంగా హత్యకు గురయ్యాడు. అది స్వాతి తండ్రి పనేనన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కూడా జరిగింది. ఆపై స్వాతి కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ప్రేమకథ విషాదాంతమైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ కాలేజీ రోజుల్లో.. లింగరాజుపల్లికి చెందిన స్వాతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరు కావడంతో స్వాతి ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. దీంతో ముంబైలో ఉంటున్న నరేష్ తన తల్లిదండ్రుల వద్దకు స్వాతిని తీసుకెళ్లి కులాంతర వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి.. భువనగిరికి రావాలని, ఇక్కడ వివాహం జరిపిస్తానని ప్రేమతో కూతురిని నమ్మించాడు శ్రీనివాసరెడ్డి. అలా వచ్చిన స్వాతి-నరేశ్‌లు వేరయ్యారు. నరేష్ ఏమయ్యాడో.. ఆ తర్వాత జాడ లేకుండా పోయాడు.
దీంతో అతని తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కోర్టు జూన్ 1 కల్లా నరేష్ ఎక్కడున్నా కోర్టులో హాజరుపరచమని పోలీసులను ఆదేశించింది. కాగా నరేష్ హతమార్చినట్టు పోలీసు ఇంటరాగేషన్‌లో స్వాతి తండ్రి అంగీకరించాడు. బంధువు సాయంతో నరేశ్‌ను స్వాతికి చెందిన పొలంలోనే చంపి, దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడని తేలడంతో వాళ్లు గుండెలు పలిగేలా రోదించారు. ఆపై మే 16వ తేదీన నరేశ్ ప్రేయసి స్వాతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె మృతి కేసులోనూ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
వీళ్లే చేశారనేందుకు సాక్ష్యాలేవి?
నరేశ్ హత్య కేసులో నిందితులుగా స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి ఏ1గా,ఆయన బంధువు నల్ల సత్తిరెడ్డి ఏ2గా ఉన్నారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నేరం అంగీకరించారు కూడా. అయితే.. కేసు విషయమై న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్,డిఫెన్స్ తుది వాదనలు ఈనెల 9న పూర్తి కావడంతో బుధవారం కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. 2017లో జరిగిన ఈ కేసులో 2018 జులై 31న కేసు అభియోగపత్రాలు పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు.23 మంది సాక్షుల విచారణతోపాటు భౌతిక ఆధారాలు,ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే.. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులే హత్య చేశారనేందుకు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటిస్తూ భువనరిగి కోర్టు తీర్పును వెలువరించింది.
పోలీసుల దర్యాప్తులో.. 2017 మే2వ తేదీన ముంబాయి నుంచి స్వాతితో కలిసి వచ్చిన నరేశ్ భువనగిరి బస్టాండ్‌లో భార్యను ఆమె తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు తీసుకుని స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేశ్ మోటార్ వాహనంపై లింగరాజుపల్లికి వెళ్లాడు. శ్రీనివాస్‌రెడ్డి ఇంటి సమీపంలో నరేశ్, మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై కనిపించాడు. దీంతో వీరిని గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి తన పొలంలోకి తీసుకుపోయారు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో అక్కడ మాట్లాడుతుండగానే వెనుక నుంచి తలపై రాడ్‌తో గట్టిగా కొట్టడంతో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నరేశ్‌ను తగులబెట్టిన శ్రీనివాస్‌రెడ్డి బూడిదను, అస్థికలను తీసుకువెళ్లి మూసిలో కలిపారు. దీంతోపాటు స్వాతి ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసిందని ప్రచారం జరిగింది. అయితే సెల్ఫీ కాదని, అది వీడియోగా పోలీసులు భావిస్తున్నా. ఆ సెల్ఫీని స్వాతి స్వయంగా తీసిందా, లేక మరొకరి సమక్షంలో తీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment