
నరేశ్ వెంట ఉన్నది ఎవరు ..?
⇔ దర్యాప్తు ముమ్మరం
⇔ కొనసాగుతున్న పోలీసుల విచారణ
⇔ ఆచూకీ లభిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి..
సాక్షి, యాదాద్రి : కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేశ్ హత్య జరిగిన రోజు ఆయన వెంట ఉన్న మరో యువకుడి ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మే2వ తేదీన ముంబాయి నుంచి స్వాతితో కలిసి వచ్చిన నరేశ్ భువనగిరి బస్టాండ్‌లో భార్యను ఆమె తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు తీసుకుని స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేశ్ మోటార్ వాహనంపై లింగరాజుపల్లికి వెళ్లాడు. శ్రీనివాస్‌రెడ్డి ఇంటి సమీపంలో నరేశ్, మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై కనిపించాడు. దీంతో వీరిని గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి తన పొలంలోకి తీసుకుపోయారు.
రాత్రి సుమారు 10.30గంటల సమయంలో అక్కడ మాట్లాడుతుండగానే వెనుక నుంచి తలపై రాడ్‌తో గట్టిగా కొట్టడంతో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నరేశ్‌ను తగులబెట్టిన శ్రీనివాస్‌రెడ్డి బూడిదను, అస్థికలను తీసుకువెళ్లి మూసిలో కలిపారు. అయితే నరేశ్ వెంట వాహనంపై ఉన్న మరో యువకుడు ఎవరని పోలీసులు విచారణ ప్రారంభించారు. అతని ఆచూకీ తెలిస్తే ఈకేసు మరింత పురోగతి సాధిస్తుందని భావిస్తున్నారు. దీంతోపాటు స్వాతి ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసిందని ప్రచారం జరిగింది.
అయితే సెల్ఫీ కాదని, అది వీడియోగా పోలీసులు భావిస్తున్నా. ఆ సెల్ఫీని స్వాతి స్వయంగా తీసిందా, లేక మరొకరి సమక్షంలో తీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆత్మహత్యకు ముందే మరొకరి ద్వారా సెల్‌ఫోన్‌లో వీడియో తీసినట్లు సమాచారం. వీటి గుట్టు విప్పడం ద్వారా ఈకేసులో మరింత పురోగతి సాధించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా నరేశ్, స్వాతి మరణం వెనుక మరిన్ని విషయాలను బయటపెట్టేందుకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.