నరేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి
సీపీఎం, ప్రజాసంఘాల డిమాండ్
సాక్షి, యాదాద్రి: నరేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. దళిత, రజక, ఎంబీసీ, బీసీ, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేం ద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో నరేష్ తల్లి దండ్రులు వెంకటయ్య, ఇందిరమ్మ, సోదరి నీలిమ పాల్గొన్నారు. అలాగే.. జిల్లాలోని వలిగొండ, మోత్కూర్, ఆలేరు, సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్, రామన్నపేట మండలాల్లో సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిం చారు. భువనగిరిలో నరేష్ చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, నింది తుడు శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఆస్తుల ను వెంటనే జప్తు చేయాలని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల పొలాన్ని పరిహారంగా ఇప్పిం చాలని డిమాండ్ చేశారు. పరువు హత్యల నివారణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, నరేశ్ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తన కుమారుడిని హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలని నరేష్ తండ్రి వెంకటయ్య డిమాండ్ చేశారు.