ఆదాయ వివరాలు ప్రభుత్వానికే తెలియవా? | High Court comments on state government | Sakshi
Sakshi News home page

ఆదాయ వివరాలు ప్రభుత్వానికే తెలియవా?

Published Tue, Sep 20 2016 1:07 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ఆదాయ వివరాలు ప్రభుత్వానికే తెలియవా? - Sakshi

ఆదాయ వివరాలు ప్రభుత్వానికే తెలియవా?

- రాజధాని అభివృద్ధిలో అలా ఎలా ముందుకెళుతున్నారు?
రాష్ట్ర సర్కారు తీరుపై హైకోర్టు విస్మయం
ఆదాయ వివరాలు రహస్యంగా ఉంచాలని ఎందుకు భావిస్తున్నారని నిలదీత
చట్టంలో ఏమైనా నిషేధం ఉందా? అంటూ ప్రశ్న
సింగపూర్ కన్సార్టియం చెప్పొద్దని కోరిందన్న అటార్నీ జనరల్
ఈ ప్రాజెక్టుతో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందన్న ధర్మాసనం
తదుపరి విచారణ నేటికి వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి వ్యవహారంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికే తెలియకపోవడంపై హైకోర్టు ధర్మాసనం సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సింగిల్ జడ్జి ‘స్విస్ చాలెంజ్’పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ధర్మాసనం కూడా ఆదాయ వివరాలు తెలుసుకోకుండానే ముందుకెలా వెళుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయం సంతృప్తికరంగా లేకపోతే ఎలా? అని నిలదీసింది. ‘అయినా ఆదాయ వివరాల్లో అంత రహస్యం ఏముంది? ఎందుకు రహస్యంగా ఉంచాలని భావిస్తున్నారు..’ అని అడిగింది. దీనికి అటార్నీ జనరల్ సమాధానమిస్తూ.. ఆదాయ వివరాలు ‘యాజమాన్య సమాచారం’ అన్నారు.

ఆదాయ వివరాలను అందరికీ బహిర్గతం చేయవద్దని, టెక్నికల్ బిడ్డింగ్‌లో అర్హత సాధించిన వారికే చెప్పాలని సింగపూర్ కన్సార్టియం కోరిందని తెలిపారు. ఆ మేరకే తాము ఆదాయ వివరాలను అందరికీ వెల్లడించడం లేదని చెప్పారు. ఇప్పటివరకు సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలకు పోటీగా ఒక్క బిడ్ కూడా రాలేదని ఏజీ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు అంశాలపై ఏజీ నుంచి స్పష్టత తీసుకునే ప్రయత్నం చేసింది. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

స్విస్ చాలెంజ్ పద్దతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్‌ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ సీఆర్‌డీఏ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్‌లపై సింగిల్ జడ్జి ఈ నెల 12న స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏలు సంయుక్తంగా అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగిల్ జడ్జి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా భావించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని, వాస్తవానికి అది విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టు అని చెప్పారు. ఆదాయ వివరాలను ప్రాథమిక దశలోనే వెల్లడించాలన్న సింగిల్ జడ్జి ఏపీఐడీఈ చట్టం సెక్షన్ 2(ఎస్‌ఎస్)కు తనదైన శైలిలో భాష్యం చెప్పారన్నారు. ఆదాయ వివరాలు తప్ప అన్ని వివరాలను ప్రాథమిక స్థాయిలో చెప్పామని వివరించారు.

 ఆ ప్రతిపాదనలు లాభదాయకం కాకపోతే ఏంచేస్తారు?
 స్థూల అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి ఇంత మొత్తాన్ని ఆదాయంగా ఇవ్వాలని సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిందని, ఇందుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో ఉంచి, టెక్నికల్ బిడ్డింగ్‌లో అర్హత సాధించిన వారికే బహిర్గతం చేయాలని కోరిందని ఏజీ వెల్లడించారు. మీకైనా ఆదాయ వివరాలు తెలిసి ఉండాలి కదా? తెలుసా? లేదా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. సీల్డ్ కవర్‌లోనే ఆ వివరాలున్నాయని, ప్రభుత్వానికి కూడా తెలియవని ఏజీ చెప్పారు. దీంతో ‘ప్రభుత్వానికే తెలియవా..?’ అంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కన్సార్టియం ప్రతిపాదనలు ప్రభుత్వానికి లాభదాయకంగా లేకపోతే అప్పుడేం చేస్తారు?’ అని ప్రశ్నించింది. ఆ ప్రతిపాదనలను రద్దు చేస్తామని శ్రీనివాస్ చెప్పారు.

 వివరాలు చెప్పకూడదని నిషేధం ఏమైనా ఉందా?
 ‘అలా అయితే అప్పటివరకు చేసిన కసరత్తు మొత్తం వృథా అయినట్లే కదా! ప్రాథమిక స్థాయిలోనే ఆదాయ వివరాలు వెల్లడిస్తే స్పష్టత ఏర్పడటంతో పాటు సమయం, తదిరాలు ఆదా అవుతాయి కదా.. అయినా ఆదాయ వివరాలను ప్రాథమిక దశలో బహిర్గతం చేయకూడదని ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టం (ఏపీఐడీఈ) 2001లో ఏమైనా నిషేధం ఉందా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. నిషేధం ఏమీ లేదని, అలాగే ప్రాథమిక స్థాయిలో వెల్లడించడం తప్పనిసరి కూడా కాదని ఏజీ చెప్పారు. సింగిల్ జడ్జి తన మధ్యంతర ఉత్తర్వులను ఐక్యాచ్ కమ్యూనికేషన్స్ వర్సెస్ ప్రకాశ్ ఆర్ట్స్ కేసులో ఇదే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఆధారపడి ఇచ్చారని, వాస్తవానికి హైకోర్టు ధర్మాససం తన తీర్పులో సెక్షన్ 2(ఎస్‌ఎస్) అంశం గురించి ఎటువంటి చర్చా చేయలేదని చెప్పారు.

సాంకేతిక బిడ్‌ల సమర్పణకు ఈ నెల 13 చివర తేదీ అని, అయితే 12వ తేదీన సింగిల్ జడ్జి మొత్తం ప్రక్రియను నిలిపేశారని వివరించారు. ఆ తర్వాత ధర్మాసనం.. రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో పలు ప్రాథమిక, సూక్ష్మమైన అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసింది. భూముల అభివృద్ధి, ప్లాట్లు వేసే అంశానికి సంబంధించినంత వరకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు, ఈ ప్రాజెక్టుకు పెద్ద తేడా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ‘ఒకవేళ మేము సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తే.. ఇప్పటివరకు బిడ్‌లు దాఖలు కాలేదు కాబట్టి మీరు నేరుగా సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకోవచ్చు కదా? అడ్డంకులు ఏమీ ఉండవు కదా?’ అని ప్రశ్నించింది.
 
 ఉపాధిపై నిర్దిష్టంగా చెప్పలేం: ఏజీ
 అలా చేయడం పారదర్శకత కిందకు రాదని, మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని ఏజీ అన్నారు. సాంకేతిక బిడ్‌ల దాఖలు గడువు ఇప్పటికే ముగిసినందున మరోసారి ఆ గడువును పొడిగించాల్సి ఉంటుందని చెప్పారు. స్విస్ చాలెంజ్ పద్దతిలో భూములు అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకోవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం కాదని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్టు వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? అని ధర్మాసనం ప్రశ్నించింది. నిర్దిష్టంగా చెప్పలేమని ఏజీ చెప్పారు. ఇంతలో కోర్టు పనివేళలు ముగియడంతో విచారణ వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement