చట్టం కాదు.. చుట్టం
‘స్విస్ చాలెంజ్’ ఆమోదానికి ఏపీఐడీఈ చట్టంలో సర్కారు మార్పులు
ఏపీఐడీఈ-2016 పేరిట కొత్త చట్టం
- న్యాయపరమైన అభిప్రాయం కోసం న్యాయశాఖకు ముసాయిదా ప్రతి
- విమర్శలు వచ్చిన అంశాలన్నీ చట్టంలో నుంచి తొలగింపు
- అర్హత ఉన్న కంపెనీలే స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలు ఇవ్వాలంటూ మెలిక
- పాత చట్టం ప్రకారం.. ఎవరైనా ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం
- సెక్షన్ 19(2) స్థానంలో ‘సంబంధిత అథారిటీ అనుమతి’ చేర్పు
- ఇక్కడ సంబంధిత అథారిటీ అంటే ప్రభుత్వమే
- ఇక రాజధాని నిర్మాణంలో అధికారాలన్నీ సర్కారుకే...
- సీఆర్‌డీఏ, ఇన్‌ఫ్రా అథారిటీ అధికారాలకు కత్తెర
- తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అమరావతి నిర్మాణం కోసం అమలు చేస్తున్న స్విస్ చాలెంజ్ విధానం వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్నే మార్చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాజధాని నిర్మాణం పేరిట లక్షల కోట్లు అడ్డగోలుగా దోచుకోవడానికే ప్రభుత్వ పెద్దలు స్విస్ చాలెంజ్‌ను తెరపైకి తెచ్చినట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్కారు తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఏకంగా చట్టాన్నే తన చుట్టంగా మార్చుకొని, ఇష్టారాజ్యంగా చెలరేగిపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకొని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్(ఏపీఐడీఈ)లో మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది.
కొత్తగా ఏపీఐడీఈ-2016 పేరుతో చట్టాన్ని తీసుకురానుంది. ఇప్పటికే దీని ముసాయిదా ప్రతిని న్యాయపరమైన అభిప్రాయం కోసం న్యాయ శాఖకు పంపినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం.. రాజధాని నిర్మాణ బాధ్యతలను అటు సీఆర్‌డీఏకు కానీ, ఇటు ఇన్‌ఫ్రా అథారిటీకి కానీ ఇవ్వకుండా ప్రభుత్వం తన అధీనంలోనే ఉంచుకోనుంది. అంతేకాకుండా హైకోర్టులో పిటిషన్లు వేసిన కంపెనీలను అర్హత లేదనే సాకుతో తప్పించనుంది. ఇందుకోసం బిడ్డింగ్‌లో కేవలం అర్హత ఉన్న కంపెనీలే ప్రతిపాదనలు సమర్పించాలని మెలిక పెట్టనుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మొత్తం ప్రక్రియను సమీక్షించుకుని ముందుకు వెళ్లడానికి బదులుగా... విమర్శలు వచ్చిన అంశాలను చట్టంలో నుంచి తొలగించడాన్ని గమనిస్తే మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
ఆసక్తి కాదు... అర్హత ఉండాలి
ప్రధానంగా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ప్రధాన బిడ్డర్ తన ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత కేవలం అర్హత ఉన్న కంపెనీలు మాత్రమే ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుందంటూ కొత్తగా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. వాస్తవానికి 2001 నాటి పాత చట్టం సెక్షన్ 2 (ఎస్‌ఎస్)లో ప్రధాన బిడ్డర్ తన ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత.... ఆసక్తి ఉన్న కంపెనీలు ఏవైనా తమ ప్రతిపాదనలను సమర్పించవచ్చని స్పష్టం చేస్తోంది. అయితే, ‘కేవలం అర్హత ఉన్న కంపెనీలే’ ప్రతిపాదనలు సమర్పించాలనే కొర్రీ వేస్తూ ప్రభుత్వం చట్టంలో కొత్త నిబంధన చేరుస్తోంది. హైకోర్టులో పిటిషన్ వేసిన ఆదిత్య, ఎన్వీయన్ కంపెనీలకు అర్హత లేదనే సాకుతో తప్పించేందుకే చట్టంలో ప్రభుత్వం ఈ మార్పులు తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాకుండా సీఆర్‌డీఏ, ఇన్‌ఫ్రా అథారిటీ సంస్థల అధికారాలకు కూడా కత్తెర పడనుంది. అన్ని అధికారాలను ప్రభుత్వ అధీనంలోనే ఉంచుకోనుంది. ఇక్కడ రాజధాని నిర్మాణ వ్యవహారాలను చూసే అథారిటీ కేవలం ప్రభుత్వమేనంటూ కొత్త నిర్వచనాన్ని కూడా చేరుస్తూ చట్టంలో మార్పులు చేయనున్నారు.
సెక్షన్19(2)కు కత్తెర
ఏపీఐడీఈలోని సెక్షన్ 19(2) ప్రకారం... మొదట ప్రధాన బిడ్డర్ తన ప్రతిపాదనలను స్థానిక సంస్థకు సమర్పించాలి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి, సదరు సంస్థకు ప్రాజెక్టును చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్నాయో లేదో తేల్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్‌ఫ్రా అథారిటీ పరిశీలించాలి. అయితే, అమరావతి నిర్మాణ వ్యవహారంలో సింగపూర్ ప్రైవేట్ సంస్థల కన్సార్టియం చేసిన ప్రతిపాదనలు నేరుగా ప్రభుత్వానికే వెళ్లాయి. ఆ తర్వాత చట్టంలో ఎక్కడా పేర్కొనని హైపవర్ కమిటీకి వెళ్లాయి. అక్కడి నుంచి ఇన్‌ఫ్రా అథారిటీకి వచ్చాయి. అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి చేరాయి. ఇదే విషయాన్ని విచారణ సందర్భంగా హైకోర్టు లేవనెత్తింది. స్విస్ చాలెంజ్ విధానంపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏకంగా సెక్షన్ 19(2)ను తొలగించి, ఆ స్థానంలో సంబంధిత అథారిటీ అనుమతి అంటూ చేర్చారు. ఇక్కడ అథారిటీ అంటే ప్రభుత్వమేనని ముక్తాయించడం గమనార్హం. అంటే మొత్తం మీద స్విస్ చాలెంజ్ విధానంలో ఇప్పటివరకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా చట్టంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధాన బిడ్డర్ నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం సరైందేనని చెప్పడానికి సెక్షన్ 19(2)ను తొలగించిందన్నమాట.
హైకోర్టు ఏం చెప్పింది?
స్విస్ చాలెంజ్ విధానంపై మొదటి నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్ కంపెనీలతో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుని, రాజధాని నిర్మాణంలో మొత్తం ప్రక్రియను నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్విస్ చాలెంజ్ విధానంలో మొత్తం ప్రక్రియ రివర్స్‌లో జరిగిందని హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఆసక్తి ఉన్న కంపెనీలు పోటీ ప్రతిపాదనలను సమర్పించేందుకు గడువు 60 రోజులు ఇవ్వాల్సి ఉండగా దాన్ని 45 రోజులకే తగ్గించారని ఆక్షేపించింది. అంతేకాకుండా ఏపీఐడీఈ చట్టం సెక్షన్ 2(ఎస్‌ఎస్) ప్రకారం మొదట బిడ్డర్ సీల్డ్ కవర్‌లో దాఖలు చేసిన ఆదాయ వివరాలను చూడలేదనడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు అంటే కేవలం అర్హత ఉన్నవారు మాత్రమే కాదని తన తీర్పులో పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు అంటే అర్హత లేకపోయినప్పటికీ బిడ్‌ను దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏపీఐడీఈ చట్టంలో మార్పులు తెస్తూ ఏకంగా ‘ఆసక్తి’ అనే పదానికి బదులుగా ‘అర్హత’ అనే పదాన్ని చేర్చింది. తద్వారా కేవలం తనకు అనుకూలమైన కంపెనీలే బిడ్‌ను దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. స్విస్ చాలెంజ్ విధానంలో విమర్శలు వచ్చిన అంశాలనే చట్టంలో నుంచి తొలగిస్తూ కొత్త చట్టం తెస్తుండడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.