‘సింగపూర్’ కోసం ఏపీ చట్టం బలి! | APIDE forward amendments to the Cabinet today | Sakshi
Sakshi News home page

‘సింగపూర్’ కోసం ఏపీ చట్టం బలి!

Published Tue, Oct 18 2016 1:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

‘సింగపూర్’ కోసం ఏపీ చట్టం బలి! - Sakshi

‘సింగపూర్’ కోసం ఏపీ చట్టం బలి!

- నేడు కేబినెట్ ముందుకు ఏపీఐడీఈ సవరణలు
- అన్నిటికీ ఆమోదం.. ఆ వెంటనే ఆర్డినెన్స్
- ఇన్‌ఫ్రా అథారిటీ అధికారాలకు కత్తెర
- స్విస్‌చాలెంజ్‌కు ఇక ‘అడ్డూఅదుపూ’ లేనట్లే!
 
 సాక్షి, హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విధానం అమలుకు అడ్డంకిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) చట్టంలో పలు నిబంధనలను, సెక్ష న్లను రాష్ర్ట ప్రభుత్వం నేడు సవరించనుంది. ఈ మేరకు పలు సవరణలకు నేడు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నది. స్విస్ చాలెంజ్ విధానం పైనా, ఏపీఐడీఈ చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ర్టప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేయడంతో ఏకంగా చట్టాన్నే మార్చేయాలని రాష్ర్టప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలో ఏఏ సవరణలు చేయబోతున్నారనే విషయాన్ని ‘సాక్షి’ ఇప్పటికే వరుస కథనాలలో బైటపెట్టింది.

సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కోసం ఏపీఐడీఈ చట్టంలోని పలు నిబంధనలకు విరుద్ధంగా రాష్ర్టప్రభుత్వం వ్యవహరించడంపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే రాష్ర్టప్రభుత్వం చట్టానికి సవరణలు చేస్తుండడం విశేషం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పలు శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అధికారాలకు కత్తెర వేస్తూ చట్టంలో సవరణలు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చట్టసవరణ ప్రతిపాదనలు న్యాయ శాఖ పరిశీలన అనంతరం రాష్ట్ర పెట్టుబడులు మౌలిక  సదుపాయాల కల్పన శాఖ నుంచి ముఖ్యమంత్రికి చేరాయి. చట్టసవరణ ప్రతిపాదనలకు సీఎం శుక్రవారమే ఆమోద ముద్ర వేశారు.

మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశానికి చట్టసవరణ ముసాయిదా బిల్లును తీసుకురావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫైలు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. ముఖ్యమంత్రి ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ఆమోదించగానే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

 ఎవరూ ప్రశ్నించకుండా.. అడ్డంకులూ లేకుండా...
  ఏపీఐడీఈ చట్టంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐడీఏ) సం స్థకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ చట్టం ద్వారా చేపట్టే ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతీ చిన్న పనీ కూడా ఈ సంస్థ ద్వారానే జరగాల్సి ఉంది. ఏ  ప్రాజెక్టు విషయంలోనైనా సంతృప్తిగా లేకపోతే ప్రాజెక్టును పునః సమీక్షించేటువంటి కీలక అధికారం కూడా ఈ సంస్థకు ఉంది. ఈ ఇన్‌ఫ్రా అథారిటీని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు  సింగపూర్ కన్సార్టియం కోసం.. తమ స్వప్రయోజనాల కోసం నామమాత్రంగా మార్చేస్తున్నారు. ఏపీఐడీఈ చట్టానికి సవరణలు తీసుకొచ్చి ఈ సంస్థకు అధికారాలూ లేకుండా చేస్తున్నారు.  ఏ విషయాల్లో అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి చట్టం విస్తృత అధికారాలు కల్పిస్తుందో, ఎక్కడెక్కడ ఈ అథారిటీని సంప్రదించాలని ఉందో, ఆ విషయాలన్నింటిలో ఇన్‌ఫ్రా అథారిటీ అన్న పేరును తొలగించి దాని స్థానంలో‘ప్రభుత్వం’ అన్న పదాన్ని చేర్చుకుంటూ వెళ్లారు.

 అథారిటీ అధికారాలన్నీ కట్..
 అసలు ఏది ప్రాధాన్యత గల ప్రాజెక్టు అన్న విషయాన్ని నిర్ణయించే అధికారం ఇన్‌ఫ్రా అథారిటీకి సెక్షన్ 2(ఎఫ్‌ఎఫ్) కింద ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా ఆ సెక్షనే తొలగించేశారు. పలు రంగాల నిపుణులతో అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసే అధికారం ఉండేది. ఇప్పుడు సవరణ ద్వారా ఆ సెక్షన్ కూడా తప్పించేశారు. ఇక ఏ ప్రాజెక్టు విషయంలోనూ సలహాలు, సూచనలు, సిఫారసులు చేసే అవకాశం కూడా ఇన్‌ఫ్రా అథారిటీకి ఉండదు. అలాగే ప్రాజెక్టు అమలు విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలకైనా, డెవలపర్‌కైనా తగిన ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కూడా అథారిటీకి దూరం చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించే కనీస అధికారం కూడా ఉండదు. అథారిటీకి అధికారాలు కల్పిస్తున్న 11, 12 సెక్షన్‌లను తొలగించేస్తున్నారు. అలాగే డెవలపర్‌కు జరిమానా విధించే అధికారం కూడా అథారిటీకి లేకుండా చేస్తున్నారు.
 
 హైకోర్టు ఆక్షేపణలను ఖాతరు చేయని సర్కార్
 వాస్తవానికి సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్‌లను సవా లు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై మధ్యం తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకోవడానికి బదు లు, స్వప్రయోజనాలకు అడ్డంకిగా వస్తున్న వాటిని చట్ట సవరణతో తొలగించేస్తోంది. రాజీ క్లాజులే వర్తించకుండా  చట్ట సవరణ చేస్తోంది.ఆసక్తి ఉన్న వారికి బదులు అర్హత ఉన్న వారే బిడ్ దాఖలు చేయగలరని  ప్రతి పాదిస్తోంది.సింగపూర్ ప్రతిపాదనల పరిశీల నలో ప్రభుత్వం ‘రివర్స్’లో వ్యవహరించిందని కూడా హైకోర్టు తేల్చింది. సీఆర్‌డీఏ, అక్కడి నుంచి ఇన్‌ఫ్రా అథారిటీ, అక్కడి నుం చి ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కన్సార్టియం నుంచి ప్రభుత్వమే ముందు ప్రతిపాదనలను స్వీకరించిందని, ఇది సరికాదని ఆక్షేపించింది. దీంతో ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఒకటేనని వాదనలు వినిపి స్తూ వస్తున్న ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ఈ రెండింటికీ మధ్యలో ఉన్న ఇన్‌ఫ్రా అథారిటీ అధికారాలన్నింటినీ లాగేసుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement