డెల్లాయిట్ కంపెనీకి కోర్టు ఆదేశాలు
- అగ్రిగోల్డ్ కేసులో డెల్లాయిట్‌కు ఉమ్మడి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్, దాని అనుబంధ కంపెనీల టేకోవర్‌కు సంబంధించి న్యాయస్థానం వద్ద రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని సుభాశ్‌చంద్ర ఫౌండేషన్ తరఫున ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న డెల్లాయిట్ కంపెనీని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని వారంలోగా డిపాజిట్ చేయాలని తేల్చిచెప్పింది. షరతులు, విధి విధానాలు తదితర వివరాల గురించి తదుపరి విచారణప్పుడు మాట్లాడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అగ్రిగోల్డ్, దాని అనుబంధ కంపెనీల ఆస్తులు, డిపాజిట్ల డాక్యుమెంట్లను పరిశీలించేందుకు డెల్లాయిట్‌ను అనుమతించాలని.. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో పాటు ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులను ఆదేశించింది.
అలాగే ఆయా ఆస్తుల సేల్‌డీడ్లు, ఇతర పత్రాలను పరిశీలించేందుకు డెల్లాయిట్ ప్రతినిధులను అనుమతించాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల వద్ద తనఖా ఉన్న ఆస్తుల వివరాల పరిశీలనకు కూడా అనుమతిచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. కాగా, ధర్మాసనం ఆదేశాల మేరకు డిపాజిట్‌దారుల వివరాలను అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్‌తో పాటు ఏపీ సీఐడీ న్యాయవాది కృష్ణప్రకాశ్ అందించారు. 32 లక్షల మంది డిపాజిటర్లకు రూ.6,880.52 కోట్లు చెల్లించాల్సి ఉందని వారు కోర్టుకు తెలిపారు.