
మార్కెటింగ్ కమిషనర్‌ది కోర్టు ధిక్కారమే
► తేల్చిన హైకోర్టు.. రూ. ఐదు వేల జరిమానా
► నాలుగు వారాల్లో న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలి
► లేకపోతే వారం రోజులు జైలుశిక్ష అనుభవించాలి
► తేల్చి చెప్పిన న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు ఆయనకు రూ. ఐదు వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లో ఈ మొత్తాన్ని తెలంగాణ న్యాయసేవాధికార సంస్థకు జమ చేయాలని శరత్‌ను ఆదేశించింది. లేదంటే 7 రోజుల సాధారణ జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమవారం తీర్పు వెలువరించారు.
వెజిటబుల్ కమీషన్ ఏజెంట్ల సంక్షేమ సంఘం సభ్యులు మొదట కార్వాన్‌లోని మార్కెట్‌లో వ్యాపారం చేసేవారు. తరువాత ప్రభుత్వం ఆ మార్కెట్‌ను గుడిమల్కాపూర్‌కు మార్చి అక్కడ వారికి షాపులు కేటాయించింది. తరువాత ప్రత్యేకంగా గదుల రూపంలో షాపుల నిర్మాణానికి ఒక్కో వ్యాపారి నుంచి రూ. 25వేలు వసూలు చేసింది. నిర్మాణాలు పూర్తయిన తరువాత వారి నుంచి ఒక్కో షాపుకు రూ. 1,875 అద్దె డిమాండ్ చేసింది. దీనిపై వెజిటబుల్ కమీషన్ ఏజెంట్ల సంక్షేమ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇతర మార్కెట్ యార్డుల్లో చేసిన విధంగా షాపులను తమకు 99 ఏళ్ల లీజుకు గానీ, శాశ్వత ప్రాతిపదికన అమ్మడం గానీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ 2000 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని, దీనిపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించింది. దీని ప్రకారం సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. అయితే ఇప్పటి వరకు మార్కెటింగ్ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిని సవాలు చేస్తూ సంఘం సభ్యులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి పిటిషనర్ల వినతిపత్రంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని మరోసారి మార్కెటింగ్ శాఖను ఆదేశించారు.
అయినప్పటికీ స్పందించక పోవడంతో వారు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పి. గంగయ్య నాయుడు వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ రామలింగేశ్వరరావు మార్కెటింగ్ శాఖ అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని తేల్చారు. ఇందుకు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎ.శరత్‌ను బాధ్యుడిగా చేస్తూ అతనికి రూ. 5 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు.