
టీడీపీ నేతల గూండా గిరీపై మార్చి 26న సాక్షిలో ప్రచురిత మైన వార్త
- రవాణా శాఖ కమిషనర్‌పై దాడి వ్యవహారం..
- ‘సాక్షి’ కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన న్యాయస్థానం
- మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు 25 నుంచి విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతల గూండాగిరిపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ కార్పొరేషన్ మేయర్ కోనేరు శ్రీధర్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా తదితరులు దూషిస్తూ బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా పరిగణించింది. టీడీపీ నేతల బరి తెగింపుపై ‘సాక్షి’లో గత నెల 26న ‘ఐపీఎస్‌పై గూండాగిరీ’ శీర్షికతో ప్రచురిత మైన కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది.
ఇందులో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌లతో పాటు కేశినేని నాని, బొండా ఉమా తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ‘సాక్షి’ కథనాన్ని చదివి తీవ్ర ఆవేదనకు గురైన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు టీడీపీ నేతల దౌర్జన్యకాండను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. తన ఆవేదనను రెండు పేజీల లేఖలో పొందుపరిచి ఏసీజే ముందుంచారు. దానిని టేకెన్ అప్ పిటిషన్‌గా పరిగణించాలని కోరారు. దానిని పరిశీలించిన ఏసీజే ఆ లేఖను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పిల్ కమిటీకి నివేదించారు.
ఈ వ్యవహారాన్ని విస్తృత కోణంలో చూడాలి..
ముగ్గురు న్యాయమూర్తులు ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించాలంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ వ్యవహారం పిల్‌గా పరిగణించాల్సినంతది కాదని మిగతా ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. పిల్‌గా పరిగణించాలన్న న్యాయమూర్తుల్లో ఒకరు తన అభిప్రాయాన్ని చాలా ఘాటుగా వ్యక్తం చేశారు. ‘ఈ మొత్తం వ్యవహారాన్ని విస్తృత కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. సమాజంలో తమ పాత్ర ఏమిటన్న దానిపై ప్రస్తుత రాజకీయ కార్యనిర్వాహకులకు అవగాహన ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయ అవినీతి, అపరిమిత అధికారం వారి నినాదాలుగా కనిపిస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం ప్రకారం ఈ వ్యవహారాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలి. తద్వారా వక్రమార్గంలో పయనించే రాజకీయ నాయకులకు గట్టి సందేశం పంపినట్లవుతుంద’న్నారు. పిల్‌గా అవసరం లేదన్న ఓ న్యాయమూర్తి.. ఇది కేవలం దౌర్జన్యం మాత్రమేనని చెప్పారు. మెజారిటీ అభిప్రాయం మేరకు దీనిని పిల్‌గా పరిగణిస్తున్నట్లు ఏసీజే పరిపాలనపరంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రిజిస్ట్రీ ‘సాక్షి’ కథనాన్ని పిల్‌గా మలిచింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.