
నోట్ల మార్పిడి అవకాశం ఎందుకివ్వలేదు?
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లకు నోట్ల మార్పిడి, డిపాజిట్లకు అవకాశం
- దీని వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటో స్పష్టంగా చెప్పండి
- డీసీసీబీలపై ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లకు నోట్ల మార్పిడి, డిపాజిట్లకు అవకాశం కల్పించకపోవడంపై ఉమ్మడి హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వాలను నిలదీసింది. డీసీసీబీలకు నోట్ల మార్పిడి, డిపాజిట్ల అవకాశం ఇవ్వకూడదన్న నిర్ణయం వెనకున్న హేతుబద్ధత ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. ఇతర బ్యాంకుల్లాగే డీసీసీబీలకు సైతం నోట్ల మార్పిడి, డిపాజిట్ల అవకాశం కల్పించేందుకున్న ఇబ్బందులేమిటో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను బుధవారానికి వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీలకు నోట్ల మార్పిడి, డిపాజిట్లకు అవకాశం లేకుండా చేస్తూ ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యూలర్‌ను రద్దు చేసి, మిగిలిన బ్యాంకులతో సమానంగా అవకాశం కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అధ్యక్షుడు ఈదర మోహన్‌బాబు గతవారం పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఇదే అభ్యర్థనతో నిజామాబాద్ జిల్లాకు చెందిన మామిళ్ల సాయారెడ్డి మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
డీసీసీబీలకు తీవ్ర నష్టం..
ప్రకాశం డీసీసీబీ తరఫు న్యాయవాది బొబ్బా విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 14న ఆర్‌బీఐ జారీచేసిన ఆర్‌బీఐ సర్కులర్‌తో డీసీసీబీలు నష్టపోతున్నాయన్నారు. మిగిలిన సహకార బ్యాంకులకు నోట్లమార్పిడి, డిపాజిట్లకు అవకాశం కల్పించిన ఆర్‌బీఐ.. డీసీసీబీల విషయంలో వివక్ష చూపుతోందన్నారు. అనుమతించకపోవడానికి సర్క్యూలర్‌లో ఏ కారణమూ వివరించలేదని తెలిపారు. ఈ సర్క్యూలర్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, డీసీసీబీలకు చెల్లించాల్సిన రుణాల్ని తిరిగి చెల్లించలేకపోతున్నారన్నారు. దీంతో వారు కొత్త రుణాలు పొందే అవకాశం లేదన్నారు. ఖాతాలున్నా డబ్బు డిపాజిట్ చేయడానికి అనుమతి ఇవ్వకపోవడానికి కారణమేంటని ఆర్‌బీఐ, కేంద్రం తరఫు న్యాయవాదుల్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నిర్ణయం తీసుకోవడంలో హేతుబద్ధత ఏమిటంది. నోట్ల మార్పిడి, డిపాజిట్లకు అనుమతినిచ్చినంత మాత్రాన డీసీసీబీలేమీ పారిపోవు కదా.. అని వ్యాఖ్యానించింది. రైతులకోసం అన్నీ చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. నోట్ల రద్దు వల్ల వారు పడుతున్న ఇబ్బందుల్ని పట్టించుకోవట్లేదని విజయలక్ష్మి తెలిపారు.